Sunday, December 22, 2024

బకెట్లు మోసే ప్రపంచం

సంపద సృష్టిద్దాం 11

బర్క్‌ హెడ్జెస్‌ చెప్పిన బకెట్లు మోసే బ్రూనో, పైప్‌లైన్‌ నిర్మించే పాబ్లో కథ చదివారు కదా! ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు? బ్రూనో అంటున్నారా? నిరంతర ఆదాయం సంపాదించి పెట్టే పైప్‌లైన్‌ సృష్టికర్త పాబ్లోగా మిమ్నల్ని పిలుస్తున్నారా! మనమే స్వయంగా పనిచేసి ఆదాయం సంపాదిస్తుంటే, మనం బకెట్లు మోస్తున్నట్లే. ఒకసారి పనిచేస్తే, ఆ తరువాత మీరేం చేసినా మొదటిసారి చేసిన పని తాలూకా ఆదాయం వస్తూంటే మీరు ఇప్పటికే పైప్‌లైన్‌ వేసేశారన్న మాట. దానికి కారణం ఈ ప్రపంచంలో మెజారిటీ జనం బకెట్లు మోస్తునే ఉంటారు. మన చుట్టూ ఉన్నవారు బకెట్లు మోయటం చూసి, మనం కూడా అదే చేస్తాం. బకెట్లు మోయటం మాత్రమే మార్గం అనుకుని, అదే మన లక్ష్యంగా చేసుకుంటాం.

Also read: పైప్ లైన్ నిర్మిద్దాం!

రోజుకు ఆరు గంటలో, ఎనిమిది గంటలో పని చేస్తేనే ఆదాయం వస్తుంటే దాన్ని నేను ‘డబ్బుకు సమయాన్ని అమ్ముకోవటం’ అంటాను. కొందరు నెలంతా కష్టపడి పాతిక వేలు సంపాదిస్తుంటే, వారు తమ పగటి సమయాన్ని అమ్ముకునే చిన్న బకెట్లు మోస్తున్నట్లు. అదే యాభై వేలకు పగలంతా కష్టపడుతుంటే మరి కొంచెం పెద్ద బకెట్లు మోస్తున్నట్లు. ఇంకా ఎక్కువ సంపాదిస్తుంటే ఇంకా పెద్ద బకెట్లు మోస్తున్నట్లు. వీరంతా పని చేయడం ఆపేస్తే ఆదాయం ఆగిపోతుంది. బకెట్లు మోసే పనితో ఇదే సమస్య. ఆఖరి ఊపిరి తీసుకునే వరకూ బకెట్లు మోయల్సిందే. మన చుట్టూ అందరూ బకెట్లు మోసేవాళ్లే ఉండడంతో మనం కూడా దానికే అలవాటు పడతాం. మన తల్లిదండ్రులూ, వాళ్ల తల్లిదండ్రులూ, మన స్నేహితుల తల్లిదండ్రులూ, మన బంధువుల తల్లిదండ్రులూ అందరూ అదే పని చేశారు. అంటే బకెట్లు మోస్తూనే బతికారు. మనకూ అదే నేర్పారు. ఈ పెంపకం ఎలా ఉంటుందంటే, ‘‘బుద్ధిగా చదువుకో. మంచి మార్కులు తెచ్చుకో. బకెట్లు మోసే అర్హత వస్తుంది. మొదట్లో భుజాలు, నడుం నొప్పి పెట్టాయా, ఇబ్బంది పడకు. కొద్ది రోజుల్లో సర్దుకుంటుంది. బకెట్లు మార్చు. అంటే పని చేస్తున్న ఆఫీసు మారవచ్చు. లేదంటే ప్రమోషన్‌వంటి ఇంకా పెద్ద బకెట్లు మోయవచ్చు. లేదంటే ప్లాస్టిక్‌ బకెట్లనుంచి ఇనప బకెట్లకు, డిజిటల్‌ బకెట్లకు మారవచ్చు’’. ఇటీవల కాలంలో మనమందరమూ చూస్తున్న ఇంకొక దారుణమైన విషయం ఏమిటంటే కుటుంబ అవసరాలకు పగలంతా మనం మోసే బకెట్లు సరిపోకపోతే తీరిక సమయాలలో చిన్నచిన్న బకెట్లు మోస్తుండడం. అంటే పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేయడం. అదీ కుదరకపోతే, భార్యాభర్తలిద్దరూ బకెట్లు మోయడానికి పోవడం!

Also read: తలపోతల వలబోతలు 

టైం మనీ ట్రాప్‌

అనారోగ్య కారణం వల్లనో, మరో కారణం వల్లనో మీరు చేసే ఉద్యోగం పోతే పరిస్థితి ఏమిటి? లేదా బాస్‌ ఉద్యోగం నుంచి తీసేస్తే పరిస్థితి ఏమిటి? మరుసటి రోజు నుంచి ఆదాయం పోతుంది. దాచిపెట్టుకున్నది ఖర్చు చేస్తాం. ఖర్చులేమీ తగ్గవు. ఇన్సూరెన్స్‌ పాలసీలు, ఈఎంఐలు, పిల్లల ఫీజులు.. జీవితం కొనసాగాల్సిందే. కాని ఎన్నాళ్లు గడుస్తుంది? మూడు వారాలు! మూడు నెలలు!! మూడేళ్లు!!! మరీ పచ్చిగా చెప్పాలంటే మన సమయాన్ని అమ్ముకుంటున్నాం కదా, కొనేవాళ్లు లేకపోతే మన పరిస్థితి ఏమిటి? దానికి ప్రత్యామ్నాయమే ‘పైప్‌లైన్‌ నిర్మించటం’. అంటే నిరంతర ఆదాయం వచ్చేలా ఒక పనిని చేయటం. పైప్‌లైన్‌ వేసిన వారి దగ్గర నేర్చుకుని, మనం ఒక పైప్‌లైన్‌ వేసుకుని, మరింత మందికి నేర్పించి, ‘టైం-మనీ ట్రాప్‌’ లోంచి బయటపడడం.

ఎంత పెద్ద బకెట్లు మోసినా మనం ధనవంతులం కాలేమని గుర్తించండి. మనందరికీ సావిత్రి, శోభన్‌బాబుల జీవితాలు తెలిసినవే. సినిమా ద్వారా సంపాదించిన సొమ్మును రూపాయి మిగుల్చుకోకుండా దానధర్మాలకు, విలాసాలకు ఖర్చు పెట్టిన సావిత్రి నిరుపేదగా మరణిస్తే, అదే సినిమా రంగంలో సంపాదించిన సొమ్ముతో రియల్‌ ఎస్టేట్లో, ఇతర పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా శోభన్‌బాబు శ్రీమంతుడిగా మరణించాడు. కాబట్టి కిటుకు అంతా మన సమయం, డబ్బులను లీవరేజ్‌ చేయడంలోనే ఉందని గమనించండి. ఒక్కసారి ఒక గంట సమయాన్ని లేదా ఒక రూపాయిని పెట్టుబడి పెట్టి దానినుంచి వెయ్యి గంటలు లేదా వెయ్యి రూపాయలు సంపాదించడమే లీవరేజింగ్‌ అంటే. ఇది అర్థం కావడానికి మనందరికీ తెలిసిన మరొక కథ చెప్తాను. వినండి.

Also read: విధాతలు మీరే!

అడుగు – నమ్ము – పొందు

ఒక రాజుగారికి చదరంగం పరిచయం చేసిన వ్యక్తిని గౌరవించాలని, ఏమి కావాలో కోరుకొమ్మని అడిగాడట. ఆ గడసరి ‘ఒక ధాన్యం గింజ ఇప్పించండి, ప్రభూ’ అని అడిగాడట. రాజుగారు ఆశ్చర్యంతో ‘‘ఏమిటీ, ఒక్క ధాన్యం గింజా!’’ అని ఆశ్చర్యపోయాడట. అప్పుడాయన, ‘‘అవును మహాప్రభో, చదరంగం మొదటి గడిలో ఒక ధాన్యం గింజ, రెండవ గడిలో దానికి రెట్టింపు అంటే రెండు గింజలు, మూడవ గడిలో వాటికి రెట్టింపు అంటే నాలుగు గింజలు, ఆ తరువాత గడిలో వాటికి రెట్టింపు అలా ఇప్పించండి, చాలు’’ అని వేడుకున్నాడట. రాజుగారు సంతోషంగా అలాగే ఇప్పించమని ఆర్డరేసారట. గడులు సగంకూడా పూర్తి కాకుండానే, ధాన్యాగారంలో ధాన్యం అయిపోయాయని రాజుగారికి కబురు అందిందంట. రాజుగారికి విషయం అర్థమయ్యేసరికి అరగంట పట్టిందట. తన దేశం మొత్తంమీద రాబోయే ఐదేళ్లు పండించిన పంటంతా ఇచ్చినా సరిపోదని లెక్కలు వేశారట మంత్రులు. నివ్వెరపోవడం రాజుగారి వంతయింది. రెండు పవర్‌ అరవైనాలుగు అంత శక్తిమంతమైన సంఖ్య.

దీనినే కాంపౌండింగ్‌ పవర్‌ అంటారు. పైప్‌లైన్‌ వేసుకునే వాళ్లంతా ప్రస్తుతంలో కొంత కాలాన్ని, ధనాన్ని ఇలా ఆదా చేసుకున్నవారే. కాలం గడుస్తున్న కొద్దీ కాంపౌండింగ్‌ మహత్యంతో అవి శక్తిమంతమైన పైప్‌లైన్లుగా మారాయి. మీకు వచ్చే ఆదాయంలో ముందు పెట్టుబడులకు, పొదుపునకు డబ్బును తీశాక మిగిలిన సొమ్మునే ఆ నెలంతా ఖర్చు పెట్టుకోవడం ఒక గొప్ప వ్యక్తిగత క్రమశిక్షణ. డబ్బు సంపాదించాలనే వారికి అద్భుతమైన చిట్కా.

తప్పక చేయండి: కోటీశ్వరులు కావాలనుకుంటున్న సాహసవీరుల కోసం సిద్ధం చేసిన వాట్సప్‌ గ్రూపులో చేరారా! వెంటనే 9989265444 నెంబరుకు వాట్సప్‌ ద్వారా ‘సంపద’ అని మీ పేరు, ఊరు వివరాలు మాత్రమే మెసెజ్‌ పెట్టండి.

Also read: ఇస్తుంటే తీసుకుంటాం..

దుప్పల రవికుమార్‌

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles