మనుషులని మిస్ ఔతామా? మనిషి చేసే పనిని మిస్ అవుతామా? ఏమో! ఎవరికి ఏది అవసరమో వారు దానినే మిస్ అవుతారేమో! ఇప్పటికిప్పుడు ’ఐ మిస్ యు ’ అని, నా ఈ జీవితంలో ఎవరినయినా తలుచుకునే వాళ్ళు ఉన్నారా? అని ఆలోచిస్తే . ఎప్పుడో ఒకసారి ఒక క్షణం జీవితంలో నుంచి ఎవరో ఒకరో , పదులో మిస్ ఆయిన వాళ్ళు అంతా గుర్తుకు వస్తారు. అదీనూ ఎక్కువగా నిద్దురలో, కలలో. ఆ కలలో కాసింత కన్నీరు పెడతా. బహుశా నిదురించే సమయమే మనిషి బ్రతికి ఉన్న సమయమేమో! నిద్రనుండి బయటికి ఎవరికి వారే ప్రపంచం. మెలకువలో అయితే తరుచుగా వారి పని గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ మనిషి ఉండి ఉంటే బొమ్మలు ఇంకా బాగా ఉండేవి, బోలెడు మంచి రచన వచ్చేది, గొప్ప సినిమా తీయబడి ఉండేది,లోకానికి ఇంకా మంచి జరిగి ఉండేది… ఇలా నడుస్తాయి ఆలోచనలు.
Also read: చివరి సంతకం
రేపు మోహన్ గారి వర్థంతి. వేయాల్సిన బొమ్మ అయిపోయి ఊరికే ఖాలీగా ఉన్నాను కదాని మోహన్ గారి గురించి ఆలోచిస్తూ, నే ఏమైనా మోహన్ గారిని మిస్ అయ్యానా? అని ప్రశ్న అనుకుంటే, ఆయన ఉన్న రోజుల్లో కూడా నేనాయన్ని ఆరు నెలలకు ఒకసారి కూడా పలకరించే వాడ్ని కాదు కాబట్టి ఆ మనిషి ఉన్నప్పుడు ఫీల్ అవని లోటు, ఇప్పుడు ఈ మూడేళ్ళ తరువాత మాత్రం కోల్పోయింది ఏముందని అనిపిస్తుంది! పోనీ! ఆయన బొమ్మ, ఆయన రాత ఏమైనా మిస్ అయ్యానా అంటే వాటిలో కొత్తదనం, చదవాలని పరుగులెత్తించే గుణం నశించి చాలాకాలమే అయిపోయింది. ఈ ప్రపంచం మనిషి కన్నా ఆ మనిషి ఇవ్వగలిగే పనినే ఎప్పుడూ కోరుకుంటుంది అని నాకనిపిస్తుంది. ఎప్పుడయితే పని అందించడంలో నీ పని అయిపోయిందా. ఆ రోజే మన పని అయిపోయినట్లు లెక్క. మనిషి బ్రతికి ఉన్నంత కాలం తన చేతనయినంత నైపుణ్యమైన పనిని అందిస్తూనే ఉండాలి. బ్రతికి ఉన్నంత కాలం తను మరణించలేదని తన పని ద్వారా నిరూపిస్తూనే ఉండాలి. నాకు తెలిసి పని ఇచ్చే సంతోషం మరేది ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన పోయిన తరువాత ఆయన్ని చాలా మిస్ అవుతున్నా అనిపిస్తుంది. ఆయన్ను కలవకున్నా, మాటడకున్నా పర్లా కానీ మనిషి ఉండి ఉంటే అది చాలేది అనిపిస్తుంది. కానీ ప్రకృతి మనలా అనుకోదు. తనతో తాను విసిగి పోయిన మనిషిని, పని ఒట్టి పోయిన మనిషిని వెనక్కి పిలిపించుకుంటుంది. ఆ పిలుపు కోసమే వారు ఎదురు చూస్తూ ఉంటారు కూడా. వెళ్ళి పోతూ వెళ్ళిపోతూ వారు వెనక్కి తిరిగి మనకేసి చూస్తారు. ఆ చూపులో పని చెయ్యండి, మంచి పని మిగల్చండి అని ఒక మూగ మాట వదిలి వెడతారు. పని. పని. పని.
Also read: అజిత్ భాయ్ సాబ్ అమర్ హై!
పని అంటే ఆలూరి భుజంగరావు గారి ఆత్మ కథ గమనాగమనం నుండిమాటలు కొన్ని జ్నప్తి అవుతాయి. “నన్ను బోడెమ్మ హోటల్లో పనికి పెట్టారు. తెల్లవారు ఝాము నుండి రాత్రి వరకు పనిచేసేవాణ్ణీ. రాత్రి హోటలు కట్టేశాకా సత్రానికి వెళ్ళి అమ్మా, అక్కయ్యలని కలుసుకుని ఒక గంట వాళ్ళ దగ్గర కూచుని తిరిగి హోటలుకు వచ్చేసేవాణ్ణి! మళ్ళీ పని. పనిలో నాని నాని, వేసుకున్న అరచొక్కా, అరలాగూ చిరిగి, మసిబారి చాలా అసహ్యంగా ఉండేవి! ఒళ్ళంతా మట్టి, దుమ్ము. తల వెంట్రుకలు మట్టి కొట్టుకుని మొరెటల్లాగుండేవి.
ఒకరోజు తోటి పనివాడొకడు- “సబ్బుతో చొక్కా-లాగూఉతుక్కోకపోయావా?” అడిగాడు.
“సబ్బు లేదుగా”
“బొడెమ్మ నడుగు డబ్బులిస్తుంది!”
పని చేస్తే డబ్బులిస్తారని నాకు తెలీదు, చాలా భయపడుతూ బోడెమ్మ దగ్గరకు వెళ్ళి- ” డబ్బులిస్తే ,సబ్బు కొనుక్కుని బట్టలుతుక్కుంటాను!” అని అడిగాను.
బోడెమ్మ ఒక ’ కాణి”ఇచ్చింది. పని చేస్తే డబ్బులిస్తారన్న ఓ సరికొత్త జ్ఞానాన్ని నాకు ప్రసాదించిందా ’ కాణి’ డబ్బు. డబ్బంటే మరేటేదో కాదు; మనం చేసే పనే డబ్బు! నిజం! అని వ్రాశాడు ఆయన.
పని అంటే ’వట్టి డబ్బు ’ అనే చిన్న తులువ ముక్క మాట కాదు. పని అంటే చాలా. బహు చాలా. పని జీవం. పని ప్రవహించే నెత్తురు, పని ప్రాణ వాయువు. పని రేపటి సూర్యోదయం. హేమంత్ కుమార్ పాడిన ” సూరజ్ రే జల్ తే రెహనా” అనే పాట అర్థం – పని చెయ్యమనే, నడవమనే !
మనకే, జీవితం పాడే పాట ఏమిటో సరిగా వినిపించుకోక ఒక్కోసారి జీవితం మీద అలక వస్తుంది. భవిష్యత్తు మీద ఫలితం ఉస్సూరని తోస్తుంది. ప్రపంచం మీద పగ బూని అస్త్ర సన్యాసం అవ్వాలని వెయ్యినొక్కసారి నిశ్చితమవుతాము. పని చేసి చేసీ మహాత్యాగం ఉద్దరగా ఈ లోకానికి ఒంపుతున్నామేమో అని అనుమానం కూడా అవుతుంటుంది. నిజానికి ప్రపంచం తెలివి తక్కువదేమీ కాదు! ఉద్దర సొమ్ము గెంచుగడ్డ అని తీసుకోడానికి. నువ్వు అనామత్ ఖాతా అనే ఎవ్వడిని , సోమరిని ఏ ఒక్కడిని తన లెక్కలోకి వేసుకోదు. నువ్వు ఎంత ఇస్తావో దానికి వడ్డీ కలిపి ప్రపంచం నీ దోసిట పోస్తోంది. నీ మీదే నీకు సరయిన అంచనా లేదు. నీకు ఏం కావాలో తెలీదు. నువ్వు ఏం ఇవ్వగలవు అంటే సమాధానం లేదు. అయినా సమస్త జీవ ప్రపంచం మనందరి కోసం ఒక రేపుని అట్టి పెడుతుంది. ఒక కొత్త సూర్యోదయాన్ని కల్పిస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావ్? వెలుగు సోకిన నీ కనురెప్పలని చికాగ్గా చికిలిస్తూ ఇంకా బలవంతంగా కళ్ళు మూసుకుంటున్నావు. ఎంత కాలమని కాంతి ఊరికే కరుణ చూపుతుంది? మూసిన కనురెప్పలు ఇక తెరవకుండా అనుగ్రహించబడే రోజున తథాస్తు అంటుంది. ఆ మాట వినడానికి కూడా లేక కంటికి ఇరుపక్కల చెవులు కూడా మరణించబడే ఉంటాయి. మరణానికి ముందే మేల్కొవాలి, సాయంత్రం అయ్యింది. వర్షాకాలపు దినాలు వెలుతురయ్యని త్వరగా ఇంటికి పంపుతున్నాయి, ఇక దీపం వెలిగించాలి, లేచి స్విచ్ వెయ్యాలి. ప్రతి చీకటిని వెలిగించడానికి ఒక బల్బు వెలగాలి. బల్బు వెలిగించిన ప్రతి సాయంకాలం కేసి తలెత్తి చేతులు జోడించి అన్నిదిక్కుల నుండి ఎగబాకుతున్న ఎడిసన్ కు దండం పెట్టుకునేది ఏమీ ఉండదు. అసలు ఎడిసన్ అంటేనే ఎవరో తెలీదు. పర్లేదు. మనిషి ఉండడు . కానీ పని ఉంటుంది. పోయిన ఏ మనిషి మంచి చెడ్డలతో పనిలేదు. వాడు ఈ ప్రపంచానికి మిగిల్చి పోయిన పనితోనే వ్యవహారం నడుస్తోంది. పని ముఖ్యం. పనిలో నాణ్యత ముఖ్యం, నువ్వు ఉన్నా లేకపోయినా ,ఆ పని వలన ప్రపంచం ప్రతి నిత్యం ఎంత వెలుగుతుందనేదే అతి ముఖ్యం.
Also read: పేపర్ కూడా చదవబుద్ది కాలేదబ్బా!
(21 సెప్టెంబర్ 2023 మోహన్ వర్థంతి)
20 సెప్టెంబర్ 2023