తాపీధర్మారావు లాక్ డౌన్ లో ఉన్నారు… మీకు తెలుసా?
“… పూర్వపు రీతినే వ్రాసివేద్దామంటే, నా హృదయంలో కలిగిన మార్పు దానికి ఒప్పుకునేది కాదు. అందుచేత మౌనం కలిగింది నా కలానికి. దీనివల్ల స్నేహితులయిన పత్రికా సంపాదకులకి నాపై కోపం కూడా కలిగింది. ఏమి చేయను? నాపై నాకే కోపం కలిగినపుడు ఇతరులకి కలగదా!…”
దీనికి నేపథ్యం ఏమిటో తెలుసా?
“మూడు సంవత్సరాలు – వెయ్యిరోజులు – దాటిపోయాయి. ఒక్క ముక్క అయినా వ్రాయలేదు… ప్రచురించడం అంతకన్నా లేదు. నిజమే. కాని, చదివినది మాత్రం చాలా ఉంది. నేను దగ్గరదగ్గర 40, 50 వేల పేజీల సారస్వతం చదవగలిగాను. సారస్వతం అంటే ఎలాంటి సారస్వతం? దిక్కూమొక్కూ లేని సారస్వతం కాదు. అనుకరణమే ప్రధానమనుకునే సారస్వతం కాదు. జీవం లేని పాత్రలు కావు. జీవకళలు ఉట్టిపడుతూ ఉండే గ్రంథాలు. చాలా ప్రశస్తమైనవి. దేశదేశాలలోనూ, ఖండఖండాలలోనూ ప్రఖ్యాతి పొందిన గ్రంథాలు. వందలకొద్ది ఇతర భాషలలోకి తర్జుమా అయిన గ్రంథాలు, అన్ని జాతులవాళ్ళ పొగడ్తల్నీ, లక్షలకొద్దీ బహుమానాన్నీ పొందిన గ్రంథాలు. ప్రపంచంలోని జనులనీ, వాళ్ళ అభిప్రాయాలనీ ఒక్కసారి మార్చివేసిన గ్రంథాలు. రషియా, జర్మనీ, నార్వే, స్వీడను, ఫ్రాన్సు, ఇంగ్లండు, అమెరికా… ఈ దేశాలలో మిక్కిలి ఉత్తమమైన గ్రంథాలు.
Also read: తెలుగు సంపాదక దారిదీపం గాడిచర్ల హరిసర్వోత్తమరావు
ఈ గ్రంథాలు కరువుదీర చదివాను. నా స్వభావాన్నిబట్టి చదివిన వాటిని గురించి విమర్శించుకున్నాను. ఆలోచించుకున్నాను. తరువాత ఆయా దేశాలలో ఆ గ్రంథాలను గురించి విమర్శనలు చూశాను. నోబెల్ మొదలైన గొప్ప గొప్ప బహుమానాలు ఈ గ్రంథాలకెందుకిచ్చారో తెలుసుకున్నాను.
దీని అంతటివల్ల నా అభిప్రాయాలు చాలా ఎక్కువగా మారిపోయాయి. మారక తప్పదు ఆ గ్రంథాలని చూచిన తర్వాత. సారస్వతం అంటే ఏమిటి? భాష ఎటువంటిది? భావం ఎలాగుండాలి? కవి ఎటువంటివారు? … గురించి నా అభిప్రాయాలు మారిపోయాయి… పూర్తిగా మారిపోయాయి.”
ఈ మాటలన్నీ తాపీ ధర్మారావు గారి ‘కొత్తపాళీ’లోని తొలి నాలుగు పేరాలు. గూడవల్లి రామబ్రహ్మం నడిపిన ‘ప్రజామిత్ర’ పత్రికలో 1936 సంక్రాంతి సంచిక నుంచీ ధారావాహికంగా ప్రచురింపబడిన వ్యాసాల సంకలనమే ‘కొత్తపాళి’.
1933 నుంచి 1936 మధ్యకాలంలో తాపీవారు రాయకుండా చదివిన సమయం.
ఏమి చదవాలి? ఎలా చదవాలి? – అనే ప్రశ్నలకు వారు ఇచ్చిన జవాబుగా దీన్ని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది. చదివిన తర్వాత తన స్వభావాన్ని బట్టి విమర్శించుకున్నారు, ఆలోచించుకున్నారు. తర్వాతనే ఇతరులు ఆ గ్రంథాల గురించి వ్రాసింది చదివారు. ఈ ధోరణీ మనం ఎదగడానికి దోహదపడే విధానం. ఈ దశ పూర్తి చేసేటప్పటికి ధర్మారావు వయసు నలభైకు మించలేదు. తాపీవారిని వ్యావహారిక భాషా వైతాళికుడిగా మనం కొనియాడుతాం. ఘనమైన పత్రికా సంపాదకుడిగా గౌరవిస్తాం, తెలుగు సినిమాలకు చక్కని భాషను, స్క్రీన్ ప్లే విధానాన్ని ఇచ్చిన దార్శనికుడిగా కీర్తిస్తాం. అయితే ఆయన తెలుగు సాహిత్య విమర్శకుడిగా కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం చాలా ఉంది అనిపిస్తోంది.
Also read: పొట్టి శ్రీరాములు బలిదానానికి నేపథ్యం
ఇపుడు లాక్ డౌన్ టైంలో మళ్ళీ ఇనుప కచ్చడాలు, దేవాలయాలపై బూతు బొమ్మలు, సాహిత్యమొర్మరాలు, పాతపాళీ, కొత్తపాళీ పుస్తకాలను జాగ్రత్తగా చదివాను. సాహిత్య విమర్శను కూడా బొరుగులు తిన్నంత సులువుగా అందివ్వగలిగిన ప్రతిభాశాలి తాపీ. కొత్తపాళీ గురించి చాలామంది రాశారు, శ్లాఘించారు, తాపీవారికి పర్యాయపదంగా వాడారు. అయినా ఇప్పటికీ తెలుగు పాఠకులు కొత్తపాళీ కొత్తగా, సమగ్రంగా, సవ్యంగా చూడాల్సి ఉందేమో అనిపిస్తోంది. అందుకే ఈ విశ్లేషణ.
నిజానికి తాపీధర్మారావు ‘కొత్తపాళీ’ ద్వారా సాహిత్యరచనకు ఒక సిలబస్ రూపొందించారు. ఏదిసాహిత్యం? ఎవరికోసం ఆ సాహిత్యం? దాని ఉద్దేశ్యం ఏమిటి? ఎలా రాయాలి? అలానే ఎందుకు రాయాలి? – అనే విషయాల పట్ల సమగ్రమైన అవగాహన కల్గిస్తారు. అలాగే కవి లేదా రచయిత నిల్చున్న కాలానికీ, సమయానికీ – గతాన్నీ, గత సాహిత్యాన్ని ఎలా చూడాలి? ఏమి స్వీకరించాలి? అలాగే భవిష్యత్తులో బాధ్యత ఏమిటి? అని కూడా చాలా సులువుగా బోధపడేట్టు విశ్లేషిస్తారు.
సాహిత్య విమర్శకుడిగా ధర్మారావులో పాండిత్యం, విశ్లేషణ, ఓపిక విశేషంగా ఉన్నాయి. అంతకు మించి వారి విమర్శలో ఏమేమి వున్నాయి మనం చూడాల్సినవి
అ) సాహిత్య విమర్శను రీడబుల్ గా రాయడమూ
ఆ) హాసాన్ని, వ్యంగ్యాన్ని, వెటకారాన్ని పుష్కలంగా వాడటమూ
ఇ) ఎటువంటి ద్వేషం లేకుండా సహనం, సమన్వయంతో కూడిన దృష్టితో సాహిత్య పరిశీలనా
ఈ) హేతుబద్ధంగా ఏది ప్రయోజనకరమో, కాదో అని విశ్లేషించి చూపడమూ
ఉ) తెలుగునూ, తెలుగు సాహిత్యాన్ని నెత్తిన పెట్టుకుని అవి మరింత ఉజ్జ్వలంగా ఉండాలనడమూ
– వెరసి నవనవోన్మేషంగా తెలుగు సాహిత్య విమర్శకు కొత్తచూపు ఇవ్వడమూ
మూడు సంవత్సరాల అధ్యయనం తర్వాత వెలువరించిన వ్యాస సంపుటి – కొత్తపాళి. ఈ వ్యాసాలను 1955లో పుస్తకంగా వెలువరిస్తూ ఇలా అంటారు –
“… నాకు సంస్కృతం మీద ద్వేషమని కొందరయ్యలంటూంటారు. కాదు: నాకు కావాలి సంస్కృతం, కొద్దో గొప్పో ఇప్పటికీ చదువుకుంటుంటాను. అది గొప్ప రత్నాల గని. నిజమే. ఇష్టమున్నవాళ్ళు సంస్కృతం చదవవలసిందే, దానిలో ఉన్న విజ్ఞానం తెలుసుకోవలసిందే, ఆ విజ్ఞానాన్ని తెలుగులోనికి తీసుకురావలసిందే. అది కూడదనను. అనవసరంగా ఆ భాషను దిగుమతి చేయకండంటాను. తెలుగుతనం నిలుపమంటాను. అంతే…”
అలాగే కొత్తపాళీ చివరి వ్యాసం చివరలో ఇలా అంటారు:
“…సాహిత్యాన్ని పట్టి ఆ జాతి వారి విజ్ఞానము, జీవన విధానము, ఆచారాలు, సంస్కృతి తెలుసుకోవడానికి వీలుండాలి. సాహిత్యంలో జాతి కనబడాలి. జాతికి సాహిత్యం అద్దంలాగుండాలి.”
Also read: తిరుపతి కేంద్రం వార్షికోత్సవంతో సంగమించిన
ఇంకా అంటారు:
“తెలుగు కవి, తెలుగు రచయిత, తెలుగు ప్రజల జీవితంలో ఉండివ్రాయాలి… తెలుగు సంస్కృతీ, తెలుగు గడ్డా, యుగయుగాల నుంచి వచ్చిన తెలుగు విజ్ఞానమూ తనకిచ్చిన శక్తీ, అతను తెలుగు ప్రజకి రుణపడి ఉన్నాడు. ఆ రుణం తీర్చాలి; తన ఇష్టం వచ్చినట్టు వినియోగించుకోకూడదు. మళ్ళీ తెలుగు వాళ్ళకు తాను కొంత చెల్లించాలి”
ఇదీ తాపీ ధర్మారావు చూపుకు ఉండే ప్రణాళిక!
పీఠికలో ఇంకా అంటారు:
“నేను ఇతరులకు నిజం చెప్పుదామని తలచాను. ఆ ఉద్దేశ్యంలో వ్రాసిన వ్యాసాలు కాబట్టి కొంత మిషనరీ మత బోధకుల పద్ధతి అవలంబించవలసి వచ్చింది”
అంటూ తన వాదనా శిల్పం గురించి కూడా పరిశీలించేవారికి పని పురమాయించాడు.
“పాతదానిని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టలేము గూడాను. పాతది ఉండవలసిందే. ప్రపంచంలో మనం చూస్తూ ఉన్న అభివృద్ధి అంతా పాతదాని మీద మెరుగే గదా! తెరచాపల ఓడ ఆధారం చేసుకునే స్టీమర్లు తయారు చేసిన వారు తీగమీద వార్తలు పట్టే వైర్ లెస్ కనుక్కున్నారు… నిలిచే యోగ్యత ఉంటేనే నిలుస్తుంది. కాని తొందరపడి పారవేయడం మంచిది కాదు…” అంటూ భవిష్యత్తుకు గతానికి ఉండే లంకెను చెబుతూ ఒక సైన్స్ విషయాన్ని ఎలా హాయిగా ఉపమానంగా వివరించారో గమనించండి. అదీ ధర్మారావులోని సారళ్యం.
ఈ క్లారిటి చూడండి: “… అందులో సంస్కృతమే ఉండనీయండి, తెలుగే ఉండనియ్యండి, ఇంగ్లీషు, హిందూస్తానీ మరేదయినా ఉండనీయండి. ఏమైనాసరే తెలియడం ప్రధానం…” అంటారు.
1936లో రాసిన మాటలు నేటికీ చాలామందికి ఎంతో అవసరమనిపిస్తుంటుంది – కొన్ని సమయాలలో వినిపించే వాదనల రొద వింటూంటే! విషయం ఎక్కడో, శైలి ఎక్కడో, భాష ఎక్కడో చాలా స్పష్టంగా చెబుతారు వారు. సంస్కృత సాహిత్యమే కాదు, జానపద సాహిత్యం ఏమిటో కూడా చెబుతారు ధర్మారావు. “… ఊహలకి కనబడేటట్టూ, ప్రజలకి బోధపడేటట్టూ వర్ణనలు చేసేవారు. పాటలో ఉన్న సంగతీ, ఆ వర్ణనా అంతా తెలుస్తూనే ఉండేది కాబట్టి ప్రజల హృదయాలు అలా ఉర్రూతలూగుతూండేవి.”
Also read: పీవీ నరసింహారావు బహుముఖీనత
కొన్ని ముచ్చట్లు వారి వ్యాసాల నుంచి గమనించండి.
1) తెనుగు చేస్తానని చెప్పి, మరింత సంస్కృతం గుప్పి తెలియకుండా చేయడం అక్రమం, తన పాండిత్యం ప్రదర్శించడానికే వ్రాసుకొనడమే అంటుంది మొల్ల – నన్నయ గురించి, (పుట 65)
2) జాను తెలుగు కోసమూ, ద్విపదల కోసమూ, తెలుగు ప్రజల గాథల కోసమూ చూచేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు – నన్నెచోడుడు, పాలకురికి సోమనాథుడు మొదలైన వాళ్ళు. వీళ్ళ పేర్లే మొన్న మొన్నటిదాకా మనకు తెలియకుండా పోయాయి. (పుట 67)
3) కవిసమయాలన్నారు, సాహిత్యసూత్రాలన్నారు, కావ్యమర్యాదలన్నారు, నాటకలక్షణాలన్నారు, వెయ్యిపేర్లు చెప్పారు. పదివేల నియమాలు దింపారు… ఇవన్నీ సంస్కృతం రేవులో నుంచే దిగుమతి. (పుట 84)
4) పగలు కలువపువ్వులు వికసించి ఉండటం ఎంతమంది చూచారు కాదు? అవి కలువలు కావంటారా? (పుట 85)
5) తెలుగులో తెలుగు సాహిత్యాన్ని చూపాలి. సంస్కృతం పరిచయం వల్ల మరింత అభివృద్ధి పొందడానికి బుద్ధిపుట్టాలి. గాని బానిస బుద్ధి పుట్టిపోకూడదు. (పుట 89)
6) నెలకు రు.20లు ఇచ్చి ఒక పండితుని పెట్టుకుని (సిలప్పదికారం) గ్రంథంలోని సంగతులు తెలుసుకున్నాను (ఇది 1936కు పూర్వ విషయమని మనం గమనించాలి, పుట. 91) కవి దాని (సిలప్పదికారం)లో తన శక్తులని చూపించాడు. ముష్టిలేని మొగతనాన్ని కనబరిచారు. స్వతంత్రం అంటే ఏమిటో తెలిపించాడు. కవి అన్నవాడికి నోరూరించాడు. (పుట 92) అరవవాళ్ళపాటివారమే కాదు, అరవవాళ్ళ కన్నా ఎక్కువ వాళ్ళమే. ఎన్నో విధాల ఎక్కువ వారమే (మనము) (పుట 94)
7) కృష్ణరాయ చక్రవర్తినీ, ఆతని ఆముక్తమాల్యదా చూడండి. ఆ ఊహాచాతురీ ఆ ప్రపంచ పర్యావలోకనమూ, ఆ కవిత్వదృష్టీ చూచినవాళ్ళకి అతడు గ్రుడ్డి వ్రాతగాడు కాక, ఒక నూరు కళ్ళున్న వ్రాతగాడిలా కనిపిస్తాడే! (పుట 105)
8) పేరుగాంచిన ప్రబంధాలని మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. వాటిని కేవలం పారవేయకూడదు. అలా పారవేసినట్టయితే ఆంధ్రసారస్వత జీవనంలో మూడు, నాలుగు వందల సంవత్సరాలు వ్యర్థమయిపోయినట్టే అవుతుంది. అంత నష్టానికి ఎవరు ఒప్పుకోగలరు? (పుట 107)
9) గ్రంథాలలో స్త్రీ పురుష సాంగత్య విషయంలోని సంగతులన్నీ మడికట్టుకుని విడిచిపెడితే బాగుండదు. (పుట 120)
10) చదివేవాళ్ళు గ్రహించకపోవడం చేత చక్కని కవిత్వం చావవలసి వచ్చింది (పుట 132)
11) వేడివేడి నెత్తురుతో జీవయాత్ర సాగిస్తూ ఉన్న తెలుగు ప్రజలకి మన సాహిత్యంలో జాగా లేకపోయింది. జావా, సుమత్రా ద్వీపాలకి వెళ్ళి వలసలు ఏర్పాటు చేసే చేవగలిగిన తెలుగు తనానికి జాగా లేకపోయింది. పడవలు కడుతూ, సముద్రాలు దాటిన తెలుగు సాహసానికి జాగా లేకపోయింది. ఇంతెందుకు, బ్రతికి ఉన్న తెలుగుకు జాగా లేకపోయింది. తెలుగు సాహిత్యంలో. (పుట 93)
ఎనభైయ్యేళ్ళ క్రితం రాసిన ‘కొత్తపాళీ’ సాహిత్య విమర్శగానూ – సాహిత్య విమర్శలో సహనం, సమన్వయం, హేతుబద్ధత, తార్కికత, తెలుగు మీద మనకుండాల్సిన గురి – మరీ ముఖ్యంగా హాయిగా, అలవోకగా చదివేలా రాయగలగడం – వంటి కోణాలలో నేటికీ మనకు అవసరం.
Also read: రండి చూసొద్దాం… తారామండలం!
(సెప్టెంబర్ 19, తాపి ధర్మారావు జయంతి)
— డా. నాగసూరి వేణుగోపాల్, హైదరాబాద్
మొబైల్ : 944032392