అంతకు ముందు ఆ అఫీసు కు ఫొన్ చేసా, “Sir has not come yet, give me your details. I will provide it when he comes” అని పలికారు రిసెప్షన్ లో. సరేనని నేను ఫలానా అని చెప్పి, ఫోన్ పెట్టేసి పని చూసుకుంటున్నాను. పనిలోపడి ఫోన్ చేసిన సంగతే మరిచిపోయా. కాసేపున్నాకా టేబుల్ మీది ఫోన్ మోగింది. ఆ రోజుల్లో పెద్దగా సెల్ ఫోన్ వాడేవాడిని కాను. ఫోన్ ఎత్తగానే ” Hi Anwar, Ajit this side” అనే గొంతు పలికింది. ఇటువైపు ఉక్కిరి బిక్కిరి అయ్యా! అజిత్ నైనన్ గారి గొంతు వింటున్నాను నేను. దేశంలో కల్లా గొప్ప ఆర్టిస్టుల్లో ఒకడు, ఇండియా టుడే పత్రికలో తన బొమ్మలతో డిల్లి, బొంబాయి నగరాన్ని, ఆ నగరవాసుల షోకు, దర్పాలను పరిచినవాడు. మొత్తం దేశానికే తన బొమ్మలతో ఒక కొత్త గీత రుచి చూపించినవాడు. కార్టూన్ బొమ్మలో ఒక ఖచ్చితమైన ఆక్యురసి ప్రవేశపట్టినవాడు. బొమ్మలో కాంపొజిషన్ చూస్తే స్టాన్లి కుబ్రిక్ సినిమానే. బొమ్మకు అజిత్ రంగులు వేయడం మొదలవగానే బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలం ఆగిపోయి రంగుల రోజులు వచ్చాయి అన్నంత ఠీవీ గా రంగులు కొత్తగా కనపడ్డం మొదలయ్యింది. ఒక్క మాటలో ఇదీ అని చెప్పలేని కొత్త రేఖ, కొత్త రంగు, కొత్త రూపు, కొత్త తీరు అజిత్ నైనన్ అంటే . తెలుగులో ఇండియా టుడే వచ్చినప్పటికీ నేను పదవతరగతో, ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరమో అనుకుంటాను. చూసి చూడంగానే ఆ బొమ్మల ప్రేమాయాలో కూరుకు పొయాను నేను. మా ఊరి ఓవర్ బ్రిడ్జ్ కింద శ్రీను టీ కొట్టు పక్కనున్న బంకులో ఇండియా టుడే పత్రిక అద్దెకు తీసుకుని ఆ బొమ్మలని అబ్బురంగా చూసిన ఆ క్షణాలు ఇంకా గుర్తుంది. అజిత్ నైనన్ అంటే మాకు హీరో. దేవుళ్ళలో ఒక దేవుడు అజిత్ నైనన్ అంటే. అటువంటి అజిత్ నైనన్ గొంతు వినగానే వణుకు వచ్చేసింది “సార్, సార్, సార్సార్” 2009 ఆగష్ట్ నెల చివరలో జరిగింది ఇదంతా.
Also read: పేపర్ కూడా చదవబుద్ది కాలేదబ్బా!
మంగళవారం-సెప్టెంబరు ఒకటి 2009 న మధ్యాహ్నం 12:30 కి కలిశాను నేను ఆయన్ని. డిల్లి నడిబొడ్డున టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీసులో. భుజం మీద చేయి వేసి తన క్యాబిన్లోకి తీసుకు వెళ్లాడు. నేను నోరు విప్పి విప్పక మునుపే “ఏమిటి అన్వర్ కబుర్లు” అని తెలుగులో పలికాడు. నేను షాకై పోయా,”సర్, మీకు తెలుగు వచ్చా?” ” వస్తది గురూ! మరీ ఆ గుంటూరు జిల్లా వాళ్ల అంత ప్యూర్ కాదనుకో! బట్ ఐ మేనేజ్ ది లాంగ్వేజ్” నేను ఆరాధనగా ఆయన కేసి చూస్తున్నా. “సారీ, నిన్ను వెయిట్ చేయించాల్సి వచ్చింది. ఈ అఫీసులో రోజూ నాకు పనికి మాలిన ఎడిటోరియల్ మీటింగ్ ఉంటుంది గురూ! అసలు మనం మీటింగులకి వెల్లవలసిన అవసరం ఏం ఉంటుంది మిత్రమా? మన పని మనకు తెలుసుగా? అదే మాటడిగితే, నాయన్నాయనా ఊరికే అలా వచ్చి కాసేపు చెప్పేది విని వెళ్ళిపో అని బతిమలాడుతాడు మా ఎడిటర్. డైలీ కార్టూనిస్ట్ అంటే అసలు పనికిమాలిన ఉద్యోగం గురూ, ఆ ముసలాడు నన్ను ఈ నరకంలో పడేసి వెల్లిపోయాడు” ” ఏ ముసిలాడు సర్? ” ఇంకెవరు? ఆర్కే లక్ష్మణ్! పక్షవాతం వచ్చాక, మా ఇంటికి వచ్చాడు, నేను కిచెన్ లో కాఫీ కలుపుతున్నాను, చక్రాల కుర్చీలో వచ్చి నా చేతులు పట్టుకుని బతిమిలాడాడు. నువ్వు తప్పా అక్కడ నా ప్లేస్ తీసుకునే అర్హత ఎవరికీ లేదు అజిత్, ప్లీజ్ టైమ్స్ ఆఫ్ ఇండియాకి వచ్చేసేయ్ అని కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకున్నాడు. లెజెండ్ లక్ష్మణ్ అలా అడిగితే కాదనలేక పోయా అన్వర్. లేక పోతే నా పత్రిక అంటే ఇండియా టుడే నే! నా సామ్రాజ్యం అది. నేను ఏది గీసినా బొమ్మే! అసలు నా బొమ్మలు అంటూ ఏవైనా వేశాను అంటే టుడే కే”. ఎమోషనల్ అయి పోయి జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి నాకు ఒకటి ఇవ్వబోయాడు. అలవాటు లేదన్నా. నా కోసం కప్ తో థమ్స్ అప్ పట్టుకు వచ్చి ఇచ్చాడు.
అదయ్యాకా ఇద్దరం తన క్యాబిన్ లో కూచున్నాం, టేబుల్ మీద ముందుగానే వేసి పెట్టుకున్న కార్టూన్ స్కెచ్ ని రేపిడ్ స్పీడ్ గా ఇంకింగ్ చేసి, స్కానర్ లో పెట్టి తీసి, తీసి, పిమ్మట దానిపై చకాచకా ఏదో వ్రాసి ఇచ్చాడు. చూస్తే -అన్వర్ కి ప్రేమతో అజిత్ నైనన్ అని ఉంది. దేశం మొత్తం రేపు చూడబోయే ఒక పెద్ద కార్టూన్ ని నాకు అలా రాసి ఇచ్చేసి తన ప్రేమ చూపించాడు నా హీరో. తరువాత తన పుస్తకాల సొరుగు లోనుంచి ఆ మధ్యనే విడుదలయిన తన కార్టూన్ల పుస్తకం తీసి దానిలో ఒక సంతకం వ్రాసి నా చేతికి ఇచ్చాడు. ఈ కార్టూన్లు సరే! మీరు ఇండియా టుడే లో వేసిన బొమ్మలన్నీ ఒక బుక్ గా రావాలి అంటే, ఆ ఆలోచన ఉంది, త్వరలోనే తెస్తా అన్నాడు. నేను తన కోసం బాపు గారి బొమ్మల పుస్తకం ఒకటి పట్టుకు వెళ్ళా. వీళ్ళకెలాగో బాపు అంటే తెలియదు అని నాకు తెలుసుగా. పుస్తకం అంతా ఓపిగ్గా తిరగేశాడు. ఎంత గొప్ప ఆర్టిస్ట్ అబ్బా ఇతను, అన్వర్ నువ్వు వెనక్కి హైద్రాబాదు వెళ్లగానే మీ స్టేట్ సి ఎం ని కలువు, నేను చెప్పానని చెప్పు. ఇలాంటి ఆర్టిస్ట్ ఉన్న మీ ప్రాంతం ధన్యమయ్యా! ఈ రాష్ట్రం లో కెల్లా పెద్ద అవార్డ్ బాపుకు ఇవ్వమని చెప్పానని చెప్పు” బాపు బొమ్మలు చూసి ఎక్జైట్ అయిపోయాడాయన.
అజిత్ నైనన్ అమ్మా నాయనా తార్నాకలో ఉండేవారు. ప్రతి సంవత్సరం క్రిస్ట్మస్ కి ఆయన హైద్రాబాదుకి కుటుంబంతో సహా వచ్చేవాడు. ప్రతి క్రిస్ట్మస్ రోజు నేను ఆయనకు ఫోన్ చేసేవాడిని. ఆయన్ని సర్ అనడం మానేసి అజిత్ భాయ్ సాబ్ అని పిలిచేవాడిని. ఒకరోజు భద్రాచలం రైల్వే స్టేషన్ లో కూచుని ఎందుకో అజిత్ నైనన్ తో మాటాడబుద్ది వేసి ఆయనకి ఫోన్ కలిపా. అవతల నుండి ” అన్వర్, మా నాన్నగారు పోయారీ రోజు, నేను మళ్ళీ మాట్లాడతా” అన్నాడు . నాకు నోట మాట పలకలా. ఆ రోజు నుండి నేను నైనన్ కి ఫోన్ చేయలేదు. ఇక చేయను. ఈ రోజు ఆజిత్ నైననే పోయారు.
Also read: శ్రీరమణ పెట్టిన భిక్ష “బాపు”