విస్మరించబడిన అసాధారణ ప్రజ్ఞాశీలి
భారతదేశంలో మొట్టమొదటి ఆంగ్ల రచయిత్రి. ఇండియా చరిత్రలో ఫ్రెంచ్ నవల రాసిన ఏకైక వ్యక్తి. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, సంస్కృతం వంటి భాషల్లో ప్రావీణ్యత కలిగిన ఆధునిక సాహిత్యకారిణి. విద్యార్థిదశలోనే షేక్స్పియర్ మొదలు విక్టర్హ్యూగో వరకూ మహామహుల ఉధ్గ్రంథాల్ని పుక్కిట పట్టిన అధ్యయనశీలి. మిల్టన్ ప్యార డైజ్ లాస్ట్ ని మక్కీకి మక్కీ ఒప్పచెప్పగల అసామాన్యురాలు, ఆమె – తోరూ దత్!
బెంగాల్ లో పుట్టిన తోరూ పారిస్ లో చదివింది. తర్వాత ప్రాన్స్ నుంచి లండన్, కేంబ్రిడ్జ్ లో ప్రత్యేక మహిళా తరగతులకు హాజరైంది. అక్కడే మేరీ మార్టిన్ ను కల్సిన తోరూ ఫ్రెంచ్, భారతీయ సంస్కృతులకు సంబంధించి చేసిన లోతైన కృషి అసాధారణ మైంది. తర్వాత కోల్కతా వచ్చేసిన తోరూ భిన్న భాషా సాంస్కృతిక స్రవంతుల్లో ప్రయాణించిన చిన్న వయసు లోనే పరిపక్వత గల విస్తృతిని పొందగలిగింది!
అనేక రచనలు, అనువాదాలు చేసింది. అనేక భాషలతో పాటూ సంస్కృతాన్నీ నేర్చుకుంది. సాహిత్యంతో పాటు సంగీతం, కళలపట్ల కూడా మక్కువ చూపింది. ఆనాడే కాదు ఈనాటికీ అంతటి సాంద్రతగల భాషలో కవిత్వాన్ని రాసినవారు లేరంటారు. అదే తోరూ ప్రత్యేకత. చిన్న వయసులోనే సోదరినీ, సోదరుడ్నీ కోల్పోయిన తోరూ అదే టి.బి. వ్యాధితో కేవలం 21 ఏళ్ళ అతి చిన్న వయసులోనే మరణించింది!
ఇండో ఫ్రెంచ్, ఇండో ఆంగ్లియన్ ప్రప్రథమ రచయిత్రి. దాదాపు 65 మంది ఫ్రెంచ్ కవుల రచనల్ని ఇంగ్లీష్ లోకి సారంతో సహా తర్జుమా చేసిన ఏకైక అనువాదకురాలు. భారతదేశంలో ఆంగ్లంలో నవల రాసిన మొదటి వ్యక్తి. అంతే కాదు, ఫ్రెంచ్ నవల రాసిన ఒకేఒక్క భారతీయ మహిళ, సంస్కృత పురాణ గ్రంథాల్ని ఆంగ్లంలోతర్జుమా చేసిన మొదటి భారతీయ మహిళ తోరూ దత్ దారుణంగా విస్మరించబడింది !
డా. గీతా షేట్ 27 ఏళ్ళు నిరవధిక పి హెచ్. డి పరిశోధన ఆధారంగా దీప్ పజ్వాని, రవిరాజ్పుత్ లు పద్నాలుగేళ్ళ క్రితం 2009 లో నిర్మించిన 15 నిమిషాలు నిడివిగల డాక్యు మెంటరీ చిత్రం Reviving Toru Dutt. కాలగర్భంలో కలిసి పోయిన ఒక విశిష్టమైన భారతీయ మహిళ లేఖలు, రచనల ఆధారంగా ఆమె హృదయాన్ని స్పృశించే ప్రయత్నం చేసింది. రెండు భాగాల్లో లింక్ పెడుతున్నాను. తప్పక చూడండి !
(భారతీయ సాంస్కృతిక వికాసోద్యమ కృషితో నన్నెంతగానో ప్రభావితం చేసిన ఇరువురు బెంగాల్ యోధుల్లో ఒకరు హెన్రీ డిరాజియో ఐతే, రెండు తోరూ దత్. ఎప్పుడు కోల్ కతా వెళ్ళినా సంస్మరణ స్థలాలకి వెళ్ళాలనుకొని అలాగే సమయం చాలక మళ్ళీ వెనక్కు రావడం అలవాటైంది. జీవితాన్ని ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ధారపోసిన తోరూ కృషికి నివాళిగా వర్ధంతి రోజు ఈ చిన్న రైటప్!)
– గౌరవ్