Tuesday, December 3, 2024

చంద్రుడిపైన  విజయవంతంగా దిగిన విక్రమ్

  • చంద్రుడి దక్షిణ థ్రువంలో దిగిన ఏకైక దేశం భారత్
  • సూర్యుడిపై కూడా ప్రయోగాలు చేయబోతున్నాం: ప్రధాని

చంద్రయాన్-3 జయప్రదమైంది. ఇస్రో శాస్త్రజ్ఞులు ఆశించినట్టుగా, శాసించినట్టుగా భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం గం. 6.03లకు చంద్రుడిపైన విక్రమ్ దర్జాగా దిగింది.  చంద్రయాన్ – 3 చంద్రుడి దక్షిణధ్రువం దగ్గర బైఠాయించింది. చంద్రమండలంలోని గురుత్వాకర్షణశక్తినీ, ఉపరితల వేగాన్ని తట్టుకొని చంద్రయాన్ -3 సురక్షితంగా చంద్రుడిపైకి చేరడంతో ఇండియా అంతరిక్షయానంలో గొప్ప ముందుడుగు వేసింది. ఈ విజయం నవభారతాన్ని (న్యూఇండియాను) ఆవిష్కరించిందని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. ఈ విజయం ఒక్క భారత దేశానిదే కాదనీ, ప్రపంచ ప్రజలందరిదీననీ అన్నారు.

లాండర్ విక్రమ్ చంద్రుడిపైకి దిగడం గం. 5.45కి మొదలు పెట్టింది. 25 కిలోమీటర్లు ప్రయాణం చేసి గమ్యం చేరుకున్నది. తాను చంద్రుణ్ణి జయించానని విక్రమ్ బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి గం.6.03లకు  సంకేతాలు పంపింది. వెంటనే ప్రధానమంత్రి హిందీలో, తర్వాత ఆంగ్లంలో ప్రసంగం చేశారు. దేశ శాస్త్రజ్ఞులను అభినందించారు. సూర్యుడి మీదికి కూడా లాండర్ ని ప్రయోగించబోతున్నట్టు ప్రకటించారు.

చంద్రుడి కక్ష్యలోకి 15 రోజుల కిందట ఆగస్టు 5న ప్రవేశించిన చంద్రయాన్-3 భూమి నుంచి తన గమ్యం వరకూ సుమారు నాలుగు లక్షల కిలోమీటర్ల ప్రయాణం సాగించింది. దీన్ని జులై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. చంద్రయాన్-3 ప్రత్యేకత ఏమంటే అది దిగిన ప్రదేశం ఇంతవరకూ అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ పరిశీలించలేదు. అక్కడ దిగిన లాండర్ విక్రమ్ ఒక్కటే. దక్షిణాగ్రంలో దిగిన లాండర్ ఇండియాది మాత్రమే. అదీ ప్రత్యేకత. ఆ ప్రాంతంలో లాండర్ ను దించిన మొదటి దేశం ఇండియా కాగా చంద్రయానంలో భారత్ నాలుగోదేశం. ఇంతకు పూర్వం రష్యా, అమెరికా, చైనాలు విజయాలు సాధించాయి. చంద్రయాన్-2 నాలుగేళ్ళ కిందట విఫలమైంది.

చంద్రుడిపై ప్రయోగాలు 2008లో ప్రారంభమైనాయి. అప్పుడు ప్రయోగించిన చిన్న లాండర్ బద్దలై చంద్రుడిపైన పడిపోయింది. అది 25 నిమిషాలు మాత్రమే ప్రయాణం చేసినప్పటికీ చంద్రుడిపైన నీరు ఉన్నట్టు కనుగొన్నది. అప్పటికి 15 సంవత్సరాల తర్వాత భారత్ చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించింది. చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి దిగడానికి ప్రయత్నిస్తుండగా విఫలమైంది. దేశప్రజలందరూ ఇస్రో సిబ్బందితో పాటు బాధను పంచుకున్నారు. ఈ రోజున సంతోషం పంచుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles