హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 5 వేల సీసీ కెమెరాల దృశ్యాలను ఒకేసారి తెరపై వీక్షించేందుకు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఐటీ, ఫురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిథిలోని అన్ని సీసీ కెమెరాలను అనుసంధానం చేసి ఇక్కడి నుండే పర్యవేక్షించనున్నారు. బంజారాహిల్స్ లో నిర్మిస్తున్న ట్విన్ పోలీస్ టవర్లలో ఏర్పాటు కాబోయే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సమాంతరంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
10 లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాలను నెల రోజుల పాటు నిక్షిప్తం చేసేలా భారీ సర్వర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిని త్వరలోనే డయల్ 100 కు అనుసంధానం చేయనున్నారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో దీన్ని నిర్మించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ లతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.