Tuesday, December 3, 2024

పశుపాలకుడుగా సహదేవుడు

మహాభారతం: శ్రీమద్విరాటపర్వం-5

విజ్ఞానం, విజ్ఞత రెండూ కలిసి దాల్చిన రూపు ఆతడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలజ్ఞానం ఆయనకు కరతలామలకం. మానవవైద్య శాస్త్రం, పశువైద్య శాస్త్రం, రాజనీతి, సంఘరీతి అన్నీ కాచి వడబోసిన విజ్ఞాని. ఇన్ని శాస్త్రాలు చదివినవాడు ఎలా ఉంటాడు? ఆ వెలుగు ఎంత దాచుదామన్నా దాగదు.

ముఖంలో అమితమైన ప్రశాంతత ఆయన ఒక మేధావి అని తెలియచేస్తున్నది. కండలు తిరిగిన ఆయన శరీరపు తీరు ఒక యోధుడిని  బయటపెడుతున్నది.

మరి వేషధారణ విపరీతంగా ఉన్నది. ఒక భుజం మీద పలుపుతాళ్ళ మోపు. ఇంకొక భుజం మీద పెయ్యదూడల తాళ్ళు. ఇవన్నీ కాకుండా ఎన్నో చుట్టలు చుట్టిన ఒక పెద్ద తాడు మొలలో దోపుకున్నాడు. చూడగానే ఒక చక్కని గోపాలకుడిలాగ కనపడుతున్నాడు.

Also read: బృహన్నల రంగప్రవేశం

నునుసెలగోల చేకొని మనోహర మౌ తన మేను రాజు చూపును బ్రజచూపును… చేతిలో నునుపైన పసులకాపరి కర్రను పట్టుకుని రాజు, సభాసదుల చూపులను ఆకట్టుకుంటున్నాడాయన. ఆతడు కుంతి గారాల తనయుడు సహదేవుడు.

వచ్చి రాజుకు దండాలుపెట్టి ‘‘నన్ను నీ పశువులకాపరిగా చేసుకో అని రావడం తడవే అడిగాడు.’’ నవనాగరీకపు విన్యాసాలు లేకుండా కల్లాకపటం లేకుండా కావలసినది అడగటం మాత్రమే తెలిసిన ఒక గోపబాలకుడిలా మాత్రమే అడిగాడు.

‘‘ఏమయ్యా నీరూపు పసులకాపరి రూపు. కానీ నీ జీవలక్షణాలు అలా అనిపించటంలేదు. కాబట్టి ఇంకా ఏదైనా మంచి పదవి ఇస్తాను తీసుకో’’ అని ఆశ చూపాడు రాజుగారు.

అందుకు ఒప్పకోక సహదేవుడు ఇలా అన్నాడు… ‘‘నన్ను పశువులకు సంరక్షకుడిగా నియమించు అనతికాలంలో అనంతమయిన పశుసంపద నీ స్వంతమవుతుంది. ఏ ఆవు ఎలాంటిదో, ఏ గిత్తతో పొర్లితే ఎంత గొడ్డావయినా చూడిదవుతుందో, ఆలమందలో సహజంగావచ్చే రోగాలు వాటి చికిత్సా విధానం నాకు బాగా తెలుసు. వేరే పని నాకు చాతకాదు.’’ సహదేవుడు పశురక్షకుడైనాడు తంత్రీపాల నామధేయంతో.

గమనిక:

మన ఇంటర్వ్యూలు ఎలా ఉంటున్నాయి అంటే ఎవరినైనాసరే disqualify చేయాలంటే ఈ విధంగా అడుగుతారు.

ఒక చేప ఒక స్విమ్మర్ post ఇంటర్వ్యూ కెళ్లిందట. అది మంచి విశ్వాసంతో ఉన్నది. ఎలాగయినా నాకే వస్తుందని. ఎందుకూ అంటే అది సహజంగానే స్విమ్మర్ కదా!

అయితే దానికి పోటీ ఒక కోతి… ఈ కోతి బాగా పలుకుబడి కలిగినది. మంచి రికమండేషను ఉన్నది. ఇంటర్వ్యూ బోర్డుకుకూడా కోతి అంటే బాగా ఇష్టం చచ్చినట్లు కోతిని సెలక్ట్ చేయాల్సిందే!..

Also read: శ్రీమద్విరాటపర్వం-3

మరి చేపను eliminate చేసేదెట్లా? వాళ్ళు ఇలా అడిగారు ‘‘మా కంపెనీలో స్విమ్మింగ్ సూటు ఎప్పుడూ ఈతకొలను ప్రక్కనేఉన్న చెట్టుమీద దాస్తాము. నీవు ప్రతిరోజు అది ధరించి ఈదాల్సివుంటుంది. మరి నీకు చెట్టు ఎక్కడం వచ్చా’’ అని అడిగారు. పాపం బిక్కచచ్చిన చేప ఉద్యోగం మీద ఆశ వదులుకుంది. కోతి swimmer అయింది, చేప కల చెదిరిపోయింది.

విరాట రాజు ఈ విధంగా చేయలేదు. ఎవరికి దేంట్లో అనుభవం ఉన్నదో, ప్రావీణ్యత ఉన్నదో గుర్తించి అందులో నియమించాడు.

 Elimination కోసం ప్రశ్నలడగలేదు. అతనికి తెలిసిన విషయాలు తన రాజ్యానికి ఎంతవరకూ ఉపయోగపడతాయో పసిగట్టి మరీ అందరికీ కొలువుకూటంలో స్థానం కల్పించాడు. Talentని ఆదరించాడు.

ఆరుగురూ ఒక చోట కుదురుకొన్నారు. ఎవరి వృత్తిలో వారు అద్భుతంగా రాణిస్తున్నారు. రాజుకు సంతోషం కలిగేటట్లు తమతమ పనులు అత్యంత నైపుణ్యంతో నెరవేరుస్తున్నారు. అన్ని పనులలో ఉండి  కూడా ఒకరినొకరు జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాండుకుంటూ అత్యంత జాగరూకతతో సంచరిస్తున్నారు.

రాజు వద్ద ప్రత్యక్షంగా పనిచేసేవాడికి అత్యంత ఓర్పుకావాలి. (Under the direct control of boss.

ధర్మరాజు తన సహజగుణమయిన ఓర్పుతో మసలుకొంటున్నాడు. దాచిన దాగే బలమా, దాచిన దాగే రూపమా భీమసేనుడిది.  ఆయన చాలా జాగ్రత్తగా జంకుతో మసలుకొంటున్నాడు తనను ఎవరూ గుర్తు పట్టకుండా.

తన సహజ స్వభావానికి విరుద్ధంగా అణగిమణిగి ఉంటున్నాడు భీమసేనుడు. ఇందుకు ఎంత మనోధైర్యం కావాలి? ఎంత మెలకువ కావాలి? ఎంత బుద్ధిబలం ఉండాలో ఆలోచిస్తే మనకు తెలుస్తుంది.  ఆయన అనిలాత్మజుడు. అనిలము అంటే నిలకడ లేనిది. అ.. నిలము.. కానీ ఈయన నిలకడ చూడండి కడుప్రశంసనీయంగా ఉన్నది.

ఆడువారిలో బయట పడకుండా నెగ్గుకు రావాలంటే ఎంతో అణుకువ కావాలి.  Lady boss ల దగ్గర పనిచేసిన వారికి తెలుస్తుంది ఎంత Shrewd గా ఉంటారో వాళ్లు. అలాంటి వారి దగ్గర అణిగిమణిగి ఉండాల్సిందే. అర్జునుడు అంత అణుకువగా మసలుకొంటున్నాడట.

Purchase managers కి అవకాశం వచ్చినప్పడల్లా నొక్కేస్తుంటారు. నకులుడు అశ్వాలను సేకరించడం, వాటికి శిక్షణ ఇచ్చే విభాగానికి సర్వాధికారి అయినా ఎక్కడా ధర్మం తప్పకుండా, ఏమీ ఆశించకుండా కర్తవ్యపాలనలో ధార్మికప్రవృత్తి కనబరుస్తూ రాజుకు కడు విశ్వాస పాత్రుడై మెసలుకుంటున్నాడు.

గొడ్లుకాసుకునేవాడు అని తీసిపారేస్తాం. కానీ ఒక్క గంట గొడ్లుకాస్తే తెలుస్తుంది. మందను జాగ్రత్తగా ఉంచడం ఎంత క్లిష్టమైన బాధ్యతో. చాలా అప్రమత్తంగా ఉండాలి. సహదేవుడు తదనుగుణంగా ఉంటూ మందను వృద్ధి చేస్తున్నాడు.

పరుల పంచన బ్రతికే పడతి బ్రతుకు కడు దుర్భరం. కాటేసే కాలనాగులను తప్పించుకుంటూ స్వీయరక్షణ, శీలరక్షణ చేసుకుంటూ ఉండాలి. ద్రౌపది మంచినడవడి, ఉదాత్తశీలంతో రాణివాసంలో రాణికి తలలోనాలుక అయ్యింది.

గమనిక:

ఒక చోట పనిచేసేటప్పుడు ప్రతి మనిషిలో ఉండవలసిన గుణాలు ఆరు… ఓర్పు, జంకు, అణగిమణగి ఉండటం, ధర్మం, అప్రమత్తత, మంచినడవడి. ఈ ఆరుగుణాలకు ఆరుగురు ప్రతినిధులుగా మారారు. PERFECTION IN ACTION అని అరవిందులు చెపుతారు. దానికి Perfect example ద్రౌపదీ సహిత పంచపాండవులు.

Also read: శ్రీమద్విరాటపర్వం-2

(సశేషం)

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles