Sunday, December 22, 2024

మాడపాటి జీవితమే ఆంధ్ర ఉద్యమ చరిత్ర

మాడపాటి హనుమంతరావు  ఒక వ్యక్తి కాదు. ఒక మహాసంస్థ. ఆయన జీవిత చరిత్రమే తెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్ర. అందుకే ఆంధ్ర పితామహుడని పేరుపొందిన ప్రజానాయకుడు ఆయన. నాటి నిజాం రాజ్యంలోని తెలుగు వారిలో జాగృతిని కలిగించి, సామాజిక, సాంస్కృతిక రాజకీయ వికాసానికై నిరంతర కృషిచేసిన ప్రముఖుడు, బహుభాషా పండితుడు మాడపాటి. తెలంగాణలో చైతన్యాన్ని తెచ్చిన తొలి తెలుగు నాయకునిగా ఆయన సుపరిచితుడు. ఆయన ఒక  విజ్ఞాన సర్వస్వము. ఆయన బ్రిటీష్‌, నిజాం రాజ్యాల సరిహద్దులలో ఉన్న ఎర్రుపాలెం వాస్త‌వ్యుడు కనుక నిజాం ఆంధ్రులందరిలో ముందు మేల్కొన్నాడు. తన దేశీయుల్ని మేల్కొలిపినాడు. 1904లో హనుమకొండలో శ్రీరాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయంలో సన్నని జాలుగా బయలుదేరిన ఆయన ఆంధ్రోద్యమం గోల్కొండ పత్రికలో పరిపుష్టినందుకుని, ఆంధ్రమహాసభలలో వాహినిగా ప్రవహించింది. హనుమంతరావు 20వ శతాబ్ది తొలిదశకంలో హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతాల్లో (నేటి తెలంగాణ) ఆంధ్రోద్యమం వ్యాప్తి చేసేందుకు కృషిచేశారు. న్యాయవాద వృత్తిని చేపట్టిన మాడపాటి, విజయవంతమైన లాయరుగా పేరుపొందారు. తీరిక సమయాలన్నిటా ఆంధ్రోద్యమానికి, తెలంగాణాలో గ్రంథాలయాల అభివృద్ధికి కేటాయించేవారు. ఆంధ్రజనసంఘం, ఆంధ్రమహాసభ వంటి ప్రజాసంఘాల స్థాపనలోనూ, వాటి నిర్వహణలోనూ కీలకపాత్ర వహించారు. 1885 జనవరి 22 (తారణ సంవత్సర మాఘ‌ శుద్ధ షష్ఠి) న కృష్ణా జిల్లా, నందిగామ తాలూకా పొక్కునూరులో వెంకటప్పయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి గ్రామాధికారిగా పనిచేసేవారు.

లాయ‌ర్‌గా ప్రాక్టీస్‌

ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రి చనిపోగా, సూర్యాపేటలో ఉద్యోగం చేస్తున్న మేనమామ దగ్గర పెరిగారు. హన్మకొండలోని ఉన్నత పాఠశాలలో చేరి మద్రాసు యూనివర్సిటీ మెట్రిక్యులేషన్‌ పరీక్ష ఉత్తీర్ణులు అయినారు. వరంగల్‌ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నెలకు 40 రూపాయల వేతనంపై మీర్‌మున్షీ (హెడ్‌క్లర్క్‌) ఉద్యోగంలో చేశారు. ఎనిమిది సంవత్సరాలు ఆ ఉద్యోగంలో ఉండి హైదరాబాద్‌ కొచ్చి ‘లా’ పరీక్ష పూర్తిచేసి ప్రాక్టీసు పెట్టారు. వకాలత్‌ విడిచి పెట్టేనాటికి ఆయనకు నెలకు ఆరువందల ఆదాయం వచ్చేది. పంతులు సేవ రాజకీయ పార్టీల ద్వారా జరగలేదు. నిర్మాణాత్మకమైన సంస్థలద్వారా జరిగింది.

ఆంధ్రుల అభిమాన ర‌క్ష‌ణ‌కు వేదిక‌

ఒకానొక పరాభవాగ్నిలోంచి పుట్టింది నిజాం ఆంధ్రోద్యమం.  1921 సంవత్సరం నవంబరు 12వ తేది వివేక వర్ధనీ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్‌ హిందూ సంస్కార సభ జరుగగా,  ఆ సభలో అనేక మంది ఇంగ్లీషు, ఉర్దూ, మరాఠీ భాషలలో మాట్లాడు తున్నారు. ఆంధ్ర ప్రతినిధులు మాడపాటి హనుమంతరావు, ఆలంపల్లి వెంకటరామారావు, ఇద్దరూ హైకోర్టు న్యాయవాదులు. మహారాష్ట్ర బాహుళ్యమైన సభలో  తెలుగులో మాట్లాడారు. సభలోని వారు విసుక్కున్నారు. నిరసన ప్రకటించారు. అల్లరి చేసారు.  తమ వీపులు సభావేదిక వైపు తిప్పి వినమన్నారు. ఈ దుశ్చర్య, అవమానం ఆంధ్రులు భరించలేక పోయారు. ఆ రాత్రికి రాత్రే టేకుమల రంగారావు ఇంట్లో సమావేశమై కర్తవ్యం ఆలోచించారు. ఆంధ్రుల అభిమాన సంరక్షణ కోసం, ఆంధ్రుల వ్యక్తిత్వ నిరూపణ కోసం ఒక సంఘం స్థాపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సంఘం పేరు నిజాం రాష్ట్ర ఆంధ్రజన సంఘం. అధ్యక్షుడు రావు బహదుర్‌ సామల వెంకటరెడ్డి, కార్యదర్శి మాడపాటి హనుమంతరావు. తరువాత  మహారాష్ట్ర కన్నడ పరిషత్తులు కూడా ఏర్పాడ్డాయి. నాటి వరకు ఏ ఉద్యమమైనా నగరానికే పరిమితమై ఉండేది. ఆంధ్రులుగా గ్రామ సీమలకు వెళ్లారు. ఆంధ్రులలో ఐకమత్యం, చైతన్యం, విద్య, స్త్రీల వికాసం మొదలైన వాటికి కారకులయ్యారు. తాము మేల్కొని ఇతరులను మేల్కొలిపారు. ఆంధ్ర సంఘం పెద్ద ఆశయాలతో బయల్దేరింది.  గ్రామీణుల విజ్ఞానం వృద్ధి చేసి, వాళ్ళ కళ్ళు తెరిపించడానికి గ్రంథాలయాలు, రైతుల ఇక్కట్లు పోగొట్టడానికి రైతు సంఘాలు, వ్యాపార పరిస్థితులు బాగు పరచడానికి వర్తక సంఘాలను స్థాపించింది. పటేల్‌- పట్వారీల జులంతో, భూస్వాముల వెట్టిచాకిరితో, అధికారుల దౌర్జన్యంతో బాధపడుతున్న నిర్భాగ్యపు ప్రజల శ్రేయస్సుకోసం పనిచేసింది. ఆంధ్రజన సంఘం నాయకులు జిల్లాలు తిరిగి కర్తవ్య ప్రబోధం చేశారు.

గ్రంథాల‌యోద్య‌మంలోనూ విశేష కృషి

మాడపాటి గ్రంథాలయోద్యమం లోనూ చెప్పుకోదగ్గ కృషి సాగించారు.  ఆయన తనకు సన్మానం ద్వారా లభించిన సొమ్మును కూడా గ్రంథాలయాల అభివృద్ధికే అంద జేశారు. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, హనుమకొండ లోని రాజరాజ నరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం కూడా ఆయన అభివృద్ధి చేసినవే. వీటిలో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం నిజాం పాలిత తెలుగు ప్రాంతంలోని తొలి తెలుగు గ్రంథాలయంగా చారిత్రిక ప్రశస్తి పొందింది. ఆ రోజుల్లో గ్రంథాలయాలు నడ పడం అంత సులభమైన పనికాదు. నాటి ప్రభుత్వ దృష్టిలో గ్రంథాలయాలంటే విప్లవకేంద్రాలే. అయినా పాలకులతో ఉత్తరాల ద్వారా అనుమతులు పొందారు. 4వ ఆంధ్ర మహాసభ కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో 1935 సంవత్సరం జనవరి 26, 27, 28 తేదీలలో జరిగింది. గద్దె నెక్కించడమేకానీ తాను ఎక్కే స్వభావం హనుమంతరావులో లేదు. సభ్యులు పట్టుపట్టాక, పంతులు అధ్యక్ష పీఠం వహించక తప్పలేదు. అప్పుడే అక్కడే జరిగిన మహిళాసభకు పంతులు అర్ధాంగి అధ్యక్షత వహించారు. భర్త, మరొక వైపు భార్య ఒకేసారి ఒక స్థలంలో జంటగా సాగుతున్న ఆంధ్రమహాసభకు, ఆంధ్రమహిళా సభకు అధ్యక్షత వహించడం అపూర్వం, అపురూపం. మాడపాటి షష్టిపూర్తి ఉత్సవం 1946 ఫిబ్రవరిలో రెడ్డి హాస్టల్‌ ఆవరణలో మహావైభవోపేతంగా జరిగింది. దీనికి రాజ్‌ బహదూర్‌ వెంకట్రామిరెడ్డి ఆహ్వాన సంఘాధ్యక్షులు కొండా వెంకటరంగారెడ్డి కార్యదర్శి. ఇందులో  పంతులుకు తులాభారం జరుపగా, సంబంధిత రూ.6400  డబ్బును ఆయన మహిళా కళాశాలకు విరాళంగా ఇచ్చారు. హనుంతరావు బాలికల కోసం నారాయణ గూడలో స్థాపించిన పాఠశాల ఆయన స్మారక కళాశాలగా నడుస్తున్నది.

ఉస్మానియాకు సెనేట్ స‌భ్యులుగా నియామ‌కం

బూర్గుల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతులు  ఉస్మానియాకు శాశ్వత సెనెటు సభ్యులుగా నియమితులైనారు.  తరువాత నాలుగేళ్ళు సిండికేటు సభ్యులుగా ఉన్నారు. భారత దేశములో ప్రప్రథమ బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులో  నారాయణగూడలో స్థాపించాడు. బాలికల కోసం ఆయన ఎన్నో పాఠశాలలను నెలకొల్పారు.  ఆయన విద్యారంగానికి చేసిన సేవలను పురస్కరించుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయం  1956లో డాక్టరేటు బిరుదు నిచ్చి సత్కరించింది. 1955లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మ భూషణ’ బిరుదు ప్రసాదించింది. ఆ బిరుదు పొందిన తెలుగు వారిలో ఆయనే ప్రథములు. అనారోగ్య కారణాలతో  ఢిల్లీ వెళ్ళలేక పోగా, మరుసటి సంవత్సరం రాష్ట్రపతి డా.బాబు రాజేంద్రప్రసాద్‌ హైదరాబాద్‌ విచ్చేసినప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో స్వహస్తాలతో మాడపాటి కి ‘పద్మ భూషణ్‌’ బహూకరించారు. మాడపాటి మంచి కవి, రచయిత.  మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు, ఎవరికి, విధి ప్రేరణం అనే కథలు ‘మల్లికాగుచ్చం’ పేరుతో 1911 లో పుస్తక రూపం దాల్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంథం ‘తెలంగాణా ఆంధ్రోద్యమం’.
 
హైద‌రాబాద్ కార్పొరేష‌న్ తొలి మేయ‌ర్‌గా..

రాష్ట్రానికి స్వాతంత్య్రం లభించిన తరువాత 1951లో హైదరాబాద్‌ నగర పాలక సంఘానికి పంతులుగ  తొలి మేయరుగా ఎన్నికయ్యారు. ఆ పదవికి మూడు సార్లు ఎన్నికవుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్‌ అధ్యక్షునిగా ఆయన ఆరేళ్ళు పదవిలో ఉండి, ఉన్నత ఆదర్శాలతో సభ్యులందరికి మన్ననలు పొందారు. మాడపాటి  దూరదృష్టి, స్వార్థ రాహిత్యం, క్రమశిక్షణ, నిర్వహణలో దక్షత వంటివి కలిగిన వ్యక్తి. అందరినీ కలుపుకుపోయే లక్షణం, ఉద్వేగం లేని స్వభావం వల్ల ఆయన అజాత శత్రువుగా నిలిచారు.రాజకీయాల్లో ఆయన మితవాది, అయినా ఆయన రాజకీయాదర్శాలను వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా  ఎంతగానో గౌరవించేవారు. శాసన మండలి అధ్యక్ష పదవీ విరమణ అనంతరం విశ్రాంతి జీవితాన్ని గడుపుతూ 1970 నవంబరు 11వ తేదీన తమ 86వ ఏటా  మరణించారు.

(న‌వంబ‌ర్ 11న మాడ‌పాటి వ‌ర్థంతి)

Related Articles

2 COMMENTS

  1. Im not sure why but this weblog is loading incredibly slow for me. Is anyone else having this problem or is it a issue on my end? Ill check back later on and see if the problem still exists.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles