వోలేటి దివాకర్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ పేరు ఎత్తకుండా ఆయన పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే ఇక్కడ లేరని విమర్శిస్తున్నారే గానీ ఇప్పటివరకు ఆమెకు వైసిపి ప్రభుత్వం ఏ పాటి గౌరవం ఇచ్చిందని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన ఈ నెలన్నర గురించి ప్రస్తావించడం శోచనీయమన్నారు. కరోనా సమయంలో సైతం ఆమె పర్యటన చేరని గుర్తుచేశారు. ఏదైనా ప్రారంభోత్సవం కానీ, శంకుస్థాపన కానీ, ప్రోగ్రామ్ కానీ పెడితే ముందు రోజు రాత్రి 10గంటలకు ఫోన్ చేసి చెప్పడంలో ఆంతర్యమేమిటని ఆయన నిలదీశారు. మీరు మీరు అనుకుని ప్రోగ్రాంలు పెట్టేసుకుంటే సరిపోతుందా? ఎమ్మెల్యేని సంప్రదించ నవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. తాము షాడో ఎమ్మెల్యేగా తిరగడానికి తమ పార్టీ అధికారంలో లేదని ఆయన పేర్కొన్నారు. ఎంపీ అంటే పార్లమెంట్ నియోజక వర్గం అంతా తిరగాలి గానీ, రాజమండ్రి సిటీ, రూరల్ చూస్తే సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు. 2014నుంచి 2019వరకు లేని బ్లేడ్ బ్యాచ్ ఆ తర్వాత ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ తెలుగుదేశం హయాంలో ఉంటే ఉక్కుపాదంతో అణచివేసే వారమన్నారు. కబ్జాదారులు, సెటిల్ మెంట్లు చేసేవాళ్ళు తమ పార్టీలో లేరని ఆయన అన్నారు.
Also read: మా పార్టీలోనూ గ్రూపులున్నాయి:వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి
రాజమహేంద్రవరం రోడ్లపై స్విమ్మింగ్ ఫూల్స్!
రాజమహేంద్రవరంలో ఇక ఎక్కడబడితే అక్కడ రాళ్లు వేసి, డివైడర్లు కట్టేస్తూ, టైల్స్ వేసి ఎత్తు చేయడం వలన వర్షం నీరు వెళ్లే మార్గం లేక నీరు నిలిచిపోయి రోడ్లు చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్స్ ని తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇదే అభివృద్ధి అనుకుంటున్నారని విమర్శించారు. ప్రణాళికా బద్ధంగా పనులు చేయడం లేదనీ, కేవలం పబ్లిసిటీ పిచ్చి తప్ప మరొకటి కనిపించడం లేదనీ పరోక్షంగా ఎంపీ భరత్ ను విమర్శించారు. పైగా ఈ నిధులు కూడా కార్పొరేషన్ వనీ, ఇంకా చెప్పాలంటే 14, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులే తప్ప ఎక్కడ నుంచో వచ్చినవి కాదనీ ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భవిష్యత్తుకు గ్యారెంటీ – ఆదిరెడ్డితో అడుగేద్దాం” కార్యక్రమం చేపట్టి ఇప్పటీకే 1, 50 వార్డుల్లో పర్యటన పూర్తిచేశామని, ఏదో ఆషామాషీ వ్యవహారంగా కాకుండా ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. ప్రజల్లో వైసిపి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని, తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.
Also read: అందుకే పోలవరం నిధులు ఆపేశారు: పురందేశ్వరి వ్యాఖ్య