ఒక గురుపూర్ణిమ సందర్భం గా కాబోలు నేను మా హైస్కూల్ తెలుగు మాష్టారు వడలి లక్ష్మీ నరసింహం గారిని గురించి విపులంగా రాసేను , ఇదే సందర్భంలో ఆయనని మనసారా తలుచుకుంటూ . ఆయన ప్రస్తావన లేకుండా నేను తెలుగు సాహిత్యం మీద నాకేర్పడిన మక్కువని గురించి ప్రస్తావన ఎప్పుడూ చేయనే లేను మరి. ఎంకి పాటల్ని పాడుతూ … మా మాస్టారు క్లాసులో పాఠం చెప్పిన తీరు, పద్యాన్ని ఆయన చదివే తీరు ఇవన్నీ దృశ్యమానం చేసేందుకు ఎలాంటి ఉపమానాలు చాలవు. ఆ తరవాత నిజంగా నేను గురుస్థానంలో స్వీకరించిన వ్యక్తులు అంటూ నిజంగా పెద్దగా లేరు.
బహుశా నాకు ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు మా అమ్మ నాకు నేర్పిన శ్లోకం గురుబ్రహ్మ గురుర్విష్ణుః – అన్నది . ఆ తరవాత మా నాన్నగారు , సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ , ఇంకా , గజాననం భూతగణాధి సేవితం లాంటివి నేర్పేరు . ప్రతీ గురుపూర్ణమికి ఎవరినో ఒకరిని తలుచుకుని నమస్కారం చేయడం ఈ జాతికి ప్రాచీనమైన ఒక అలవాటు. ఈ గురుపూర్ణిమ సందర్భంగా ఇవాళ నేను మన కవి పఠాభిని [తిక్కవరపు పట్టాభిరామి రెడ్డి గారు] తలుచుకుంటున్నాను. నమస్కారం చేస్తున్నాను. ఆయన నాకు కవిత్వంలో గురువు కాదు కానీ నేను ఆయనని నా పుస్తకానికి ముందుమాటగా “కవన కుతూహలరాగం” ని రాయించి తెలుగుతో దాదాపుగా సంబంధం లేకుండా కన్నడ దేశంలో బతుకుతున్న ఆయన ని తిరిగి తెలుగు వైపు దారిమళ్లేలా చేసేను. తెలుగు వారితో మళ్ళీ పఠాభికి లంకె ఏర్పరచెను. చాలా సంవత్సరాల తరవాత కేవలం నా కోసం అని ఆయన తెలుగు సాహిత్య ప్రపంచంలోకి వచ్చారు మళ్ళీ. అందుకు గాను నేను బాగానే కష్టపడ్డాను కూడా! ఆ రోజుల్లో ఒక్కనాడూ ఒక్కర్తినీ ప్రయాణం చేసి బయటకి వెళ్ళినదాన్ని కాను నేను. అలాంటిది 1986 లో మొదటిసారి ఒంటరిగా రైలెక్కి ఎవరు తెలియని
బెంగుళూరుకి పఠాభిని కలవడానికి చేసిన ప్రయాణం నాది. అంతటి పట్టుదలని నాలో కల్గించింది ఆయన కవిత్వం మీద నాకు కలిగిన అమిత ఇష్టం. ఆయన నాకు పితృసమానులు. లోహియా అనుచరుడైన పఠాభి రాజకీయంగా కూడా నాకు గౌరవింపదగిన ముఖ్యులు. ఆ రోజు మొదటిసారిగా కలిసిన మేము ఎన్ని సంవత్సరాల అనుబందాన్నో అలా నిలుపుకోగలిగాము. ఆయన ఇంక పోతారనగా రెండురోజుల ముందటి దాకా ఆయన నాతో ఫోను లో మాట్లాడుతూ ఉన్నారు – అతి నెమ్మది గొంతుకతో!
అప్పటికి మొబైల్ ఫోన్ కొత్తగా చేతిలోకి వచ్చింది. ఆయన కూతురు నందన ఆయనకి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చింది. ఆయనకి దాన్ని వాడడానికి అర్ధం అయ్యేది కాదు మొదట్లో. మెసేజెస్ ఇవ్వడం గట్రా! చికాకు పడేవాళ్ళు. అప్పటికే రెండు సార్లు ఆయన బాత్రూమ్ లో జారిపడి … రెండు సార్లు ఎముక సన్నగా బీట వారడం వలన మంచం మీదనించి కదలకుండా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేది. మొదటిసారి పడినప్పుడు బాగానే తేరుకున్నారు, కానీ మళ్ళీ అలాగే బాత్రూం లో జారిపడినప్పుడు రెండోసారి కూడా అదే చోట ఫ్యాక్చర్ అవడంతో ఆయన మునుపటి అంత నమ్మకంతో ఉండలేదు మరి. అత్యంత స్వాభిమాని అయిన పఠాభికి ఆ సమయంలో తన స్థితి తన మనసుని బాగానే ఇబ్బంది పెట్టింది. అలాంటప్పుడు కూడా ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడడం చేసేవాళ్ళు. మొబైల్ ఫోన్ రాక ముందటి దాకా … పఠాభి నాకు రాసిన ఉత్తరాలన్నీ ఇన్లాండ్ కవర్ మీద రాసినవే. కార్డు మీద ఒక్కోసారి, కవరు మీద తెల్ల కాగితాల్లో ఒక్కోసారి రాసేవారు. ఆయన చేతిరాత చాలా విలక్షణమైనది. ఆయన కవర్ ని పోస్ట్మాన్ చేతిలో చూసీ చూడగానే గుర్తుపట్టేసేదాన్ని నేను. ఆ ఉత్తరాల్లో మేము కాలక్షేపం కబుర్లు నించి, కవిత్వం గురించి… పఠాభి తీసిన సినిమా ఇతివృత్తాల దాకా , ఆయన దర్శకత్వం మీద దాకా బాగానే చర్చలు చేసుకున్నాము. స్వేచ్ఛగా విభేదించుకున్నాము. అందువలన పఠాభి ఉత్తరం ఎప్పుడూ ఉత్తేజంగానే ఉండేది. జవాబుగా నేను రాసే ఉత్తరాలు సైతం ఆయన ఉత్తరాలకి అంతే ఉత్సాహాన్ని పంపిస్తూ సాగేవి.
అన్ని సంవత్సరాలలో నేను పఠాభిని గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన కవిత్వాన్ని మహా ఇష్టపడి చదివిన నాకు, ఈయనేనా ఆ ఫిడేల్ రాగాల డజన్ ని రాసిందీ అని చిన్నగా నవ్వు వచ్చేది. ఆయన బహు నెమ్మది గా ఉండేవారు. గాలి కందిపోతుందా అన్నట్టుగా సున్నితంగా మాట్లాడేవారు. మంచి భారీ విగ్రహం ఆయనది. గంభీరమైన వ్యక్తి పఠాభి. చాలా హుందాగా ఉండేవారు. తమిళుల గూడకట్టు మీద, సభలకి వచ్చినప్పుడు పట్టు కమీజు వేసుకుని ఉండేవారు పఠాభి. నా ‘వామనుడి మూడోపాదం’ కవితాసంకలనాన్ని ఆవిష్కరించడానికి ఆయన హైదరాబాద్ కి వచ్చినప్పుడు మొదటిసారిగా ఆయన ఎలా తయారై వచ్చారో … మళ్ళీ 2006 లో (లేక 2007 లోనా?) నెల్లూరులో ఆయనకి పౌర సన్మానం జరిగినప్పుడు ఎనభైపదులు దాటిన వయసులో పఠాభి వేషధారణ అదే! ఆయన కవిత్వం మీద మాట్లాడడానికి నెల్లూరుకు నేను వెళ్ళాను. ఆనాడు నేను పఠాభిమీద చేసిన ఉపన్యాసం అక్కడకి వచ్చిన అందరినీ చాలా ఆకట్టుకుంది. ‘అమ్మా! నువ్వు చేసావు నిజంగా ఆయనకీ సన్మానం, నీ మాటలతో’ అని నా దగ్గరికి వచ్చి మనసారా మెచ్చుకున్నారు, విశ్వనాథ సత్యనారాయణగారి ప్రియశిష్యులైన పేరాల భరత శర్మ గారు! ‘ఎంత బాగా మాట్లాడావో జయా! నేనే రాసానా ఇవన్నీ?!’ అని నెమ్మదిగా నా పక్కకి వచ్చి కూర్చుని, నాతో అన్నారు పఠాభి. ఇవి వారు నాకు చేసిన సన్మానాలు ఒకరకంగా! అన్ని సంవత్సరాలుగా ఆయన బెంగుళూరులో ఉన్నా … ఆయన తేట తెలుగులో ఏమాత్రం మార్పు రాలేదు .
నేను రాసిన ప్రతీదీ ఆయన చదివే వారు. నాకవిత్వం ఆయనకి ఇష్టం. నా విమర్శనా వ్యాసాలు ఆయనకి ఇష్టం. ఆయన ఇక్కడి పత్రికలకి ఇచ్చిన దాదాపు ప్రతీ ఇంటర్వ్యూ లోను ఆయనకీ నా కవిత్వం అంటే చాలా ఇష్టం అని చెబుతూ ఉండేవారు. చాలా మంది విడిగా చెప్పొచ్చు కానీ పత్రికలకి వచ్చేసరికి అనేక రకాల మౌనం పాటిస్తారు. లౌక్యాలని ప్రదర్శిస్తూ ఉంటారు. అవన్నీ నేను ఎరుగుదును మనుష్యుల నించి. అలాంటి లక్షణాలేవీ పఠాభి దగ్గర నేనెప్పుడూ చూడలేదు.
ఆయన కవిత్వం మీద నేను రెండు విమర్శనా వ్యాసాల్ని రాసి ప్రచురించాను. అవి నా విమర్శనా వ్యాసాల సంకలనం “మార్గము – మార్గణము” లో అచ్చయి ఉన్నాయి. చదవని వారు చదవండి వాటిని. పఠాభి ఎంతటి నవీనుడో భాషలో ఎంతటి సాంప్రదాయకుడో అలాగే ఎంతటి ప్రయోగశీలో ఎంతటి ప్రేమికుడో ఎంత సామాజిక స్పృహ కల్గిన కవో మీకు అర్ధమౌతుంది. రాజకీయంగా తన సోషలిస్టు పంథాని ఆయన చివరివరకూ దాటలేదు. మా తిలక్ గారిలాగానే! మా జువ్వాడి గౌతమరావు గారి లాగానే! వీరంతా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి వ్యతిరేకులుగా నిలబడినవారు ఆజన్మాన్తమ్ !
పఠాభికవిత్వంలోని భాష, పదబంధాలు, కవితావాక్యాలు, ఉపమానాలూ సమస్తమూ నాకిష్టం. ఏకాంతంగా కూర్చుని నేను ఆయన పద్యాలని చదువుకున్న వేళల్లో — ఒక్కోసారి బయటికే నవ్విన సందర్భాలు ఉండేవి. పెదవిమీద చిరునవ్వులు పూయించగల కొంటెదనం కవిత్వ రచనలో మా పఠాభికి సొంతం. అదెలా ఉంటుందో ఆయన మీద నేను రాసిన వ్యాసాలు మీకు చెబుతాయి. తెలుగు భాషలో … భావ వ్యక్తీకరణలో చేయితిరిగిన వాడాయన. అలాంటి పఠాభిని ఈ గురుపూర్ణిమ నాడు నేను ఇష్టంగా మనస్ఫూర్తిగా తలుచుకుంటూ … ఆయనకి నమస్కారం చేస్తున్నాను మరోసారి!
జయప్రభ
27 – 07 – 2018