భగవద్గీత–102
ఆకలయ్యింది కాబట్టి ఆహారం తీసుకోవాలి. ఎదురుగా ఒక అరటితోట ఉంది. చక్కటి పళ్ళు కనపడుతున్నాయి. ఆహారం తీసుకోవటానికి కారణం (హేతువు) ఆకలి. కాబట్టి తినాలి. అంతే. తోటలోకి వెళ్ళి నాలుగు పళ్ళు తినాలి. తినేశాడు. ఆకలయ్యింది కాబట్టి ఆకలి తీర్చుకోవడానికి తినేశాడు. తన ఆకలి తీర్చుకోవడానికి ఎవరి అనుమతో ఎందుకు? తోట యజమానికి కోపంవచ్చి నాలుగు తిట్టాడు. ఎందుకు? అది తన తోట. తన ‘‘అనుమతి’’ లేకుండా తన చెట్లమీద చెయ్యివేస్తాడా.
Also read: అర్జునుడిని యోగివి కమ్మంటాడు పరమాత్మ
శరీరం సుఖం కోరుతుంది కాబట్టి సుఖం శరీరానికి అందించాలి. నా ఇష్టమైనట్లుగా సుఖిస్తాను. ఎందుకు? శరీర అవసరం తీర్చాలి కాబట్టి. నా శరీర అవసరం తీర్చుకోవడానికి ఎదుటివాడి అనుమతి ఎందుకు? అవసరం అనేది కారణం. దానికి అనుగుణంగానే నడుస్తాను.
ఇది వ్యక్తి స్వాతంత్య్రం. దీనిని స్వేచ్ఛ అని అంటున్నాము. తన కోరిక తన ఇష్టం. సమాజంలో కుదురుతుందా? మనం చేసే పని మనతోపాటు జీవించే ప్రాణులకు ఇబ్బంది కలుగచేస్తున్నదా? లేదా? ఈ స్పృహకలిగి ఉండటమే నీతి. మొదటిది హేతువాదము, వ్యక్తి స్వేచ్ఛ అయితే… రెండవది నైతికత. ఇది సమాజ విశాలహితానికి సంబంధించినది.
Also read: ఒత్తిడి లేని బతుకుకోసం భగవద్గీత!
భగవద్గీత సాంఖ్యయోగము హేతువాదం గురించి చెప్పి ఆ తరువాత నైతికత గురించి మనిషి గుణాలు అవి ధరించే రూపాలు, దైవీప్రవృత్తి, ఆసురీప్రవృత్తి వీటి గురించి చెప్పింది. ఆ తరువాత ఈరెండికి ఆవలున్న ఆధ్యాత్మికత గురించి వివరంగా తెలియచేసింది.
గీతను అధ్యయనంచేస్తే హేతువాదము, నైతికత, ఆధ్యాత్మికత. ఈ మూడింటి గురించిన సమగ్రమైన అవగాహన ఏర్పడుతుంది అని నా అభిప్రాయం.
Also read: యుక్తాయుక్త విచక్షణ పరమావధి