మోహన్ గారు – నీరజ్ రాజ్ అనే డాక్టర్ కలిసి మాయా అనే అనిమేషన్ స్టూడియో పెట్టబోతున్నారని శుభవార్త తెలిసి, అందులో ఉద్యోగం దొరుకుతుందేమోనని హైద్రాబాదు వచ్చాను. ఉద్యోగం దొరికే ఘనకార్యం జరగలేదు కానీ మోహన్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన భలే ఫిదా కబుర్లు చెప్పేవాడు. పైగా ఆయన కంపెనీ పేరు మాయ కూడానూ. “ఇక్కడ తెలుగు అనిమేషన్ వింగ్ ఉంటుంది అబ్బా! అక్కడ నేషనల్ లెవెల్ అనిమేషన్ డిపార్ట్మెంట్ పెడతాం. తెలుగు అనిమేషన్ డిపార్ట్మెంట్ ని బాపు వచ్చి ఇనాగురేట్ చేస్తాడు. నేషనల్ దానికి ఎమ్ ఎఫ్ హుస్సైన్ రిబ్బన్ కట్ చేస్తాడు’’ అని ఆయన చెప్పగానే నాకైతే నోట్లో నీళ్ళు ఊరాయి. బాపు గారూ, మగ్బుల్ ఫిదా హుస్సైనా? ఏమిటిది? అదృష్టాలు ఇల్లా తన్నుకుంటూ ఎదురుగా నిలబడి ఒకవేలి కొనతో మీసం తిప్పుకుంటూ, మరో చేత్తో సిగరెట్ పొగలూదుకుంటూ మాటాడుతాయా? ఎంత పెట్టి కాకపోతే మనం ఇట్లా పుట్టినాంరా స్వామీ!
అన్నీ కబుర్లే…
అబ్బే! అన్నీ కబుర్లే. ఎమ్ ఎఫ్ లేదు, బాపూ లేదు, ఆ వింగూ లేదూ, ఈ డిపార్టుమెంటు లేదూ. అసలు ఏ పంగు లేదూ. బాపు గారిని చూడాలనే కోరిక మాత్రం ఎంత బలంగా ఉండేదో చెప్పలేను. వీళ్ళ వల్ల ఏమీ కాదులే, ఎప్పటికీ అవదులే అని అర్థం అయిపోతున్న రొజుల్లో అప్పుడు 1998వ సంవత్సరం. కథారచయిత ఖదీర్ బాబు ఒకసారి నేను పని చేస్తున్న సుప్రభాతం అనే పత్రికకి వచ్చి నన్ను పరిచయం చేసుకుని ఆ మాటా ఈ మాటా చెప్పి ‘మా ఇంటికి పోదాము రా గురూ’ అని పిలిచాడు. ఆ రోజు సాయంత్రం ఖదీర్ బాబు ఇంట్లో మకాం. రాత్రి అన్నాలు ముగించి వాడయ్యా, బోడయ్యా కబుర్లు ముగించి నిద్ర పోయి తెల్లవారి లేచేసరికి ఖదీర్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నేను కళ్ళు మూసుకుని, చెవులు తెరుచుకుని ఉన్నా. ఆ వచ్చిన వారు ఖదీర్ ప్రెండని ఆయన మాటీవి లో పని చేస్తారని వారి మాటల్లో తెలిసింది. ఆ మాటల మధ్య వినపడింది కదా ” నిన్న స్టూడియోకి బాపు గారు వచ్చారురా, పాపం మునుపటిలాగా లేడు, మనిషి బాగా సన్నబడిపోయాడు” అది వినగానే అదిరిపడి లేచి కూచున్నా. ఇక్కడ బాపు గారిని చూసిన మనిషి ఒకడున్నాడా అనే ఆలోచన నన్ను అలా పడక మీద ఉండనివ్వలేదు. లేచి కూచుని ఆయన్న దగ్గరికి వెళ్లి ఆయన కళ్లల్లోకి చూస్తూ ఉండిపోయాను. బయటికి చెప్పలేదు కానీ నా మనసులో దండం పెట్టుకున్నా. బాపు గారిని చూసిన కనులివి.
ఆ తరువాత ఇదిగో బాపూ, అదిగో పరిచయం అని భరోసా ఇచ్చిన జనమే లేకపోయిరి. కార్టూనిస్ట్ జయదేవ్ గారికి బాపు గారితో మంచి స్నేహమే ఉండింది. అవి 2000 సంవత్సరపు రోజులు, బాపు గారికి కూడా తెలీనీ విషయం, మా పరిచయం కాని రోజుల్లోనే నేను ఆయనకు దగ్గరగ కావడానికి కొన్ని విషయాలలో చాలా వెట్టి చాకిరి చేసాను. ఎంతలా అంటే అంతలా. నన్ను బాపుగారు తెలుసుకుంటారని, దగ్గరకు తీసుకుంటారని ఆశించా. అబ్బే అదీ అడియాశే అయ్యింది. అదంతా చెప్పుకోతగ్గ మరో కథ. చెబుతా కూడా. అటు పిమ్మట నాకు ఒక ఎడిటర్ గారితో పరిచయం అయ్యింది ఆయన బాపు గారికి బాగా క్లోజ్ అని సకల ప్రపంచం కోడిలా పగలు, మద్యాహ్నం, రాత్రిళ్ళు కూడా తెగ ప్రచారం జరిగేది . ఆయన నాకూ కొంచెం క్లోజ్ అయ్యారు. “ఒక దినం మా ఇంటికి భోజనానికి వచ్చిన ఆయనని, ‘‘సార్, మీకు బాపు గారు బాగా తెలుసును కదా, ప్లీజ్ సర్ ఒకసారి నాకు ఆయన్ని పరిచయం చేయండి సర్’’ అని రిక్వెస్ట్ అయ్యా. ఆయన నన్ను చూశాడు చూడు , పలుకు చూపుల వాడి ఆయన కన్నుది “బొసుడికె నాకొడకా! నీ బతుక్కు బాపు పరిచయం కావాలా” అర్థమయింది. మూసుకుని కూచున్నా.
శ్రీరమణతో కబుర్లు
2002 ప్రాంతాల్లో ‘జయం’ అనే పత్రికలో జయదేవ్ గారూ, నేనూ కలిసి పని చేసేవాళ్లం. ఆ పత్రికాఫీసు శ్రీనగర్ కాలనీలో, మా ఇల్లు ఉండేది మెహిదిపట్నం. రోజూ జయం పత్రికలో లో పని ముగించుకుని ఇంటికి వెడుతూ వెడుతూ వెళ్ళే దారిలోనే ఆంధ్ర జ్యోతి ఆఫీస్ కదా . అక్కడ ఆగి కార్టూనిస్ట్ శంకర్ ని, శ్రీరమణ గారిని కలిసేవాడిని. శ్రీ రమణ గారు బాపు గారి గురించి బోలెడు కబుర్లు చెప్పేవారు. ఆ రోజుల్లో చిత్రకారులు గంధం గారు బాపు బొమ్మలన్నింటిని సేకరించి డిజిటలైజ్ చేస్తున్నారని, అవి ప్రస్తుతానికి నలబయ్ డివీడీలు అయ్యాయని, అవి తనదగ్గరికి వస్తాయని, నాకు కూడా ఇస్తానని చెప్పేవారు. బాపు గారి గురించి చదివినా ఆయన ఇంటర్యూలు పట్టినా ఆయన నిత్యం ఒకటే మాట అనే వారు “స్కెచ్చింగ్ చేయాలండి” చేస్తూనే వుండాలండి అదే బలం” అని. అదేంటో కనుక్కుందామని చిత్రకారుడు మోహన్ గారిని చేరి “ఏవండి, బాగా స్కెచ్చింగ్ చేస్తే బొమ్మలు బాపు గారి లాగా బాగా వస్తాయట కదా! నేనూ అలాగే అదేపనిగా స్కెచ్చింగ్ చేద్దామనుకుంటున్నా” అని సలహా కనుక్కుంటే ఆయన నా అజ్ఞానం మీద జాలిపడి ‘‘అదంతా పిచ్చి మాటలబ్బా! బ్రాహ్మణులకు, పద్మశాలి లకు, ఆచారులకు, క్రైస్తవులకు వారి వారి రక్తంలోనే ఆర్ట్ వుంటుంది. వారు ఏం సాధన చేసినా ఏం అభ్యాసం చేయకున్నా వాళ్ళకు అలా వచ్చేస్తుంది. అంతే కానీ నీలాంటి ప్రతి అడ్డమైన సాయబులకు బొమ్మలు రాసి పెట్టలేదబ్బా! ఊరికే అట్లా శ్రమ పడబోకబ్బా!’’ అని సలహా ఇచ్చారు . నాకు మోహన్ గారంటే విపరీతమైన ఇష్టం. మోహం కూడా. 23 ఏళ్ళ కుర్రాడిగా ఆయన్ని చేరుకున్నా ఆరాధనగా. ఆయన మహా మేధావి. ఆయన నోటినుండి ఏదైనా వచ్చిందా అది అంతే! అదే నిజం సత్యం యథార్థం. అప్పట్లో నా ప్రాణానికి ఆదిత్య మండలాంతర్గత పురుషుడు అంటే ఆయనే. అందుకని ఆయన చెప్పిన మాటని తూచా తప్పకుండా మనసుకు తీసుకున్నా.
ఆ రోజుల్లొ రమణ గారితో కబుర్లాడుకుంటూ కూచునేవాడిని కదా, అప్పుడప్పుడు నా బొమ్మలు ఆయనకు చూపించే వాణ్ణి. ఆయన బాపు గారికి బాగా దగ్గరి వారు కదా బొమ్మల గురించి బాగా తెలుసు. బాగా కుదరని నా బొమ్మలు చూసి పెద్దరికం కొద్ది నాకు ఇలా చెప్పేవాడు ” బొమ్మలు బాగా రావాలంటే చాలా సాధన చెయ్యాలండి, బాపుగారిని చూడండి ఈ రోజుకి ఎంత సాధన చేస్తారో”! నేను రాయల సీమ వాణ్ణి. ఎవరి ముందు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఈ రోజుకు ఎరిగి చావని అజ్ఞాన అలౌక్యులం. అందుకని రమణ గారి మాటలకు అందుకుని “ఆ! మీరు బలే వుండారు లేండి సార్, సాధనా నా బొందా! బాపు గారు బ్రాహ్మణులు కదా! బ్రాహ్మణులకు ఇటువంటి విద్యలు పుట్టుకతో వచ్చేస్తాయి. వారి రక్తంలోనే కళ వుంటుంది కదా” అని నేను నా వినికిడి జ్ఞానం ఆయన ముందు కక్కా. అసలు విషయం ఏవిటంటే నాకు రమణ గారు ఏమట్లో కూడా తెలీదు.
బ్రాహ్మణైతే మాత్రం కొమ్ములతో పుట్టారా?
అందుకు ఆయనకు బాగా కోపం వచ్చింది “మీరు చిన్నవాళ్ళు, ఎవరండీ మీకు ఇట్లాంటి మాటలు నేర్పింది? బ్రాహ్మణులైతే మాత్రం కొమ్ములతో పుట్టారా? పుట్టుకతోనే అన్నీ వచ్చేస్తాయా? పిచ్చి మాటలు కాకపోతే. అసలు బాపు గారి గురించి మీకు ఏమి తెలుసని ఆయన విద్యని తీసుకెళ్ళి పుట్టుకకు ముడి పెట్టేస్తారు?’’ అంటూ ఆ రోజు ఆయన నాకు కొన్ని సంగతులు చెప్పారు. మేధో శ్రమ, శారీరక శ్రమ కంటే అతి కఠినమైనది. పనిలో వళ్ళు అలిసిన మనిషి కనీసం పని పూర్తయ్యాకా ఒడలు తెలీకుండా నిద్రయినా పోతాడు. బుర్ర పని చేసేవాళ్ళకు ఎప్పటికీ నిద్ర వుండదు. నిద్రలో, కలలో కూడా కూర్చవలసిన కాంపొజిషన్లు, ఐడియాల ఆలోచనలు చిరాకు పెడుతూనే వుంటాయి. ఈ బాపు అనే వారు అత్యంత కఠినంగా శరీరాన్ని, బుద్ధిని , సమయాన్ని బొమ్మలకు అప్పగించిన మనిషి. బొమ్మ పూర్తయ్యాకా అర్జంటుగా పత్రికాఫీసుకు పంపెయ్యాలి. బొమ్మని కవర్లో వుంచి పోస్ట్ డబ్బాలో వేసి ఇంటికి వచ్చి కూడా స్థిమితంగా వుండలేక పోయేవారట. అయ్యో అనుకున్నంత బాగా బొమ్మ కుదరలేదే, అది అలా వెయ్యాల్సింది కాదే! అని ఆలోచన ముల్లులా గుచ్చుతుంటే గబా గబా వెళ్ళి పోస్ట్ డబ్బా దగ్గర నిలబడే వారు. వచ్చిన పోస్ట్ మేన్ బతిమిలాడి చేతిలో యాభయ్యో వందో పెట్టి లోపల వేసిన కవర్ వెనక్కి తీసుకుని మళ్ళీ మళ్ళీ బొమ్మ కుదిరే వరకు వేసేవారుట . ఇది ఒక్క సారి కాదు, ఎన్నో సార్లు. బాపు గారికి సంభందించిన ఇటువంటి ఎన్నో విషయాలు చెప్పేవారు. బాపు వంటి పెద్ద పర్వతంతో నీవంటి గులకరాయికేమిటి పని అనేవిదంగా నన్ను ఎప్పుడూ చూడలేదు ఆయన.
ఒక రోజు జయం ఆఫీసులో జయదేవ్ గారు నన్ను పిలిచి “అన్వర్, శ్రీ నగర్ కాలనీ నవత ట్రాన్స్పోర్ట్ లో నా పేరు మీద ఒక పార్సెల్ వచ్చింది వెళ్ళి తీసుకు రండి’’ అన్నారు. నేను వెళ్లా . జయదేవ్ గారి పేరిట ఒక కార్టన్ వచ్చి ఉంది . దాని పైన ప్రం అనే చోట బాపు , ఓల్డ్ 4 గ్రీన్ వేస్ రోడ్ ఎక్స్ టెన్షన్, ఆర్ ఏ పురం, చెన్నయ్ -28 అని అడ్రస్. మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నదంటారే అలా ఆ రోజు నా ప్రాణమంతా ఆ అట్టపెట్టెలో ఉంది. “పెట్టెలో ఏముంది? ఏముందా పెట్టెలో? జయదేవ్ గారు పెట్టె విప్పారు. దాని నిండా పుస్తకాలు , బొమ్మల పుస్తకాలు, కార్టూన్ల పుస్తకాలు. నా కంట్లో నీళ్ళు. సాయంత్రం ఇంటికి వెడుతూ వెడుతూ రమణ గారి దగ్గర కూచుని నా అక్కసంతా కక్కాను. ఏమండి జయదేవ్ గారు పెద్దవారయి పోయారు కదా, బొమ్మలు బాగా వచ్చిన వారై పోయారు కదా, ఆయనకు ఎందుకండీ అన్నన్ని పుస్తకాలు, ఆ బొమ్మల పుస్తకాలు. అవి నాకు కదా కావాల్సింది. నేను కదా ఈ వయసులో బొమ్మలు తెగ అభ్యాసం చెయ్యవలసింది?” నాకు తెలీదు కానీ నేను బాపు గారి గురించి మాటాడేవి, అనుకునేవి, కూసేవి అన్నీ శ్రీరమణ గారు బాపు గారికి చెప్పేవారు “బాపు గారు ఒక కుర్రవాడు ఉన్నడండి , అతగాడి పేరు అన్వర్, బాగా చదవాలని, బాగా బొమ్మలు నేర్చుకోవాలని అతని కోరిక, మీరంటే భక్తి….’’ గడిచి గడిచి అన్ని నాళ్లకు బాపు గారి చెవులకు నేను చేరాను. ఒకరోజు సాయంకాలం రమణ గారు చెప్పారు. ‘‘బాపు గారు సోమాజీ గూడలో ఈటివీ రికార్డింగ్ స్టూడియో ఉంటారు. మధ్యహ్నం పదకొండూ- పన్నెండు ప్రాంతాలలో మిమ్మల్ని కలవమని చెప్పారు’’ అని. భయం భయంగా వెళ్ళా. ఫలానా నేను వచ్చాను అని కబురు అందగానే డబ్బింగ్ రూమ్ నుండి బాపు గారు రివ్వున వచ్చేశారు. చేతిలో ఒక కాగితాల కట్ట తో. ఎప్పటినుండో తెలిసి ఉన్నంత నిండుగా నవ్వుతూ ఆ కాగితాలు నా చేతిలో పెట్టి, తలమీద చేయి వేసి దీవించారు. ఆయన నాకు ఇచ్చినవి పాత మ్యాడ్ పత్రికలోని డ్రకర్ బొమ్మల పేజీలు , అవి ఇచ్చి అన్నారు కదా… “ఇది చాలా గొప్ప స్కూల్ అండి, తెల్లవారుజామునే లేచి ఈ బొమ్మలు కళ్లకద్దుకుని ఉన్నది ఉన్నట్టు ప్రాక్టీస్ చెయ్యండి. వీరు మహానుభావులు, మనలాంటి వారికి గురువులు.”
అది మొదలు, కల నిజమై వచ్చి చేతిలో కూర్చున్న రోజది. మంచి మహూర్తపు రోజు, మంచి మనిషి ఒకరు నాకు బాపుగారి స్నేహం ఇచ్చిన రోజు. ఆ రోజు మొదలు బాపు గారు మనవద్ద సెలవు తీసుకునే రోజు వరకు బాపు గారు నాకు స్నేహంతో ఉండి పోయారు. ఎంతగా ఉండి పోయారు అంటే ఈ చిన్న ఆర్టిస్ట్ ని పట్టుకుని ఆ పెద్ద బాపుగారు తన అతి పెద్ద బొమ్మల పుస్తకానికి ముందుమాట వ్రాసి ఇవ్వమని అడిగేంత వరకు. నా జీవితంలో బాపు అనే గొప్ప భాగ్యాన్ని తన చేతులరా శ్రీరమణ గారు బంగారు రంగు సిరాతో సంతకం చేసి ఇచ్చారు. కొన్ని సంతకాలు చెరగవు, కొంతమంది మనుషులు మనల్ని వీడిపోరు. వారినే బాపు అంటారు. శ్రీ రమణ అని అంటారు.