జాన్ సన్ చోరగుడి
మణిపూర్ మహిళల మీద జరుగుతున్న దాష్టీకం గురించి వెలువడుతున్న వార్తలు వింటున్నప్పుడు, రెండు వేర్వేరు సమూహాల మధ్య ఉద్రిక్తతలు, ఘర్షణలు లేదా యుద్దాలు వంటివి జరుగుతున్నపుడు; స్త్రీ గౌరవం కాపాడే విషయంలో- సమాజం పాటించవలసిన నియమం గురించి ప్రాచీన చరిత్ర ఏమి చెబుతున్నది తెలుసుకోవడం అవసరం అనిపిస్తున్నది. ఇప్పుడు మణిపూర్ లో జరుగుతున్నది- దాన్ని మనం యుద్ధం అనుకున్నప్పటికీ, లేదా అది యుద్ధం కాకున్నప్పటికీ- స్త్రీ విషయంలో పాటించాలని చెబుతున్న ‘కోడ్’ అయితే ఇక్కడ కూడా వర్తిస్తుంది.
Also read: విభజనతో సరళమైన కమ్మతెమ్మెరలు!
మానవ నాగరికతలో మొదటిసారి ఇటువంటి ప్రస్తావన వచ్చిన సందర్భం ఏమిటి? ఈజిప్టు బానిసత్వం నుంచి ఇజ్రాయేలీయులకు విముక్తి కల్పించి, వారిని తీసుకుని వాగ్దాన భూమి అయిన కానాను బయలుదేరిన మోజెస్ ప్రయాణం నలభై ఏళ్ళు అరణ్యమార్గంలో సాగింది. అప్పటి వరకు ఒక జాతిగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు, కానాను అనే ప్రాంతాన్ని ఆక్రమించుకుని అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడం వారి ముందున్న లక్ష్యం. అటువంటి లక్ష్యం పూర్తికావడానికి ముందు వారి నాయకుడిగా మోజెస్ ఇటువంటి ‘కోడ్’ను ప్రకటిస్తాడు.
Also read: ఆ సంస్కారం మనకు అలవడినప్పుడు…
దారి మధ్యలో మోజెస్ వారికి- ‘టెన్ కమాండ్ మెంట్స్’ ఇస్తాడు. గమ్యం చేరడానికి కొద్దిగా ముందు జోర్దాన్ నది ఒడ్డున మోజెస్ వారిని ‘అడ్రెస్’ చేస్తూ మళ్ళీ మరొక 630 అంశాలతో- ‘సివిల్ కోడ్’ ప్రకటిస్తాడు. అది పదకొండవ నెల మొదటి రోజు అని బైబిల్ ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయం చెబుతున్నది. అయితే, ఏడాది విషయంలో చరిత్రలో చాలావాటి మాదిరిగానే దీని విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. కీ. పూ. 5 లేదా 7 శతాబ్ది అని ఒక వాదన.
అదలా ఉంచితే, ఒక చారిత్రిక ఆధారంగా దీనికున్న సాధికారికత ఎంత? అనే సందేహానికి ఇదే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో పూజారి వర్గం గురించి చేసిన ప్రస్తావన; మన దేశంలోని బ్రాహ్మణ సమాజం విషయంలో యధాతథంగా ప్రతిఫలించడంతో- దీని యథార్థతను మనం నమ్మవలసి వస్తున్నది. అక్కడ 1-5 వచనాలు మధ్య ఇలా ఉంటుంది- “యాజకులైన లేవీయులకు, అనగా లేవీ గోత్రీయులు అందరికీ ఇశ్రాయేలీయులతో పాలైనను, స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను అతని కియ్యవలెను. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవచేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతనిని అతని సంతతివారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని యున్నాడు.” సరే, విషయం దీని గురించిన చర్చ కాదు కనుక, దీన్ని ఇక్కడ వదిలి ఈ వ్యాసానికి ప్రధానమైన అంశం గురించి చూద్దాం.
Also read: నీలం అడుగుజాడలు ఇంకా కొనసాగుతున్నాయి…
ఇదే ద్వితీయోపదేశ కాండము 20 అధ్యాయంలో ఇలా ఉంది- యుద్ధమునకు పోయిన దేశముతో ముందుగా సంధికి కబురు పంపాలి. సంధి కుదరకపోతేనే యుద్ధము. యుద్దములో- “మగవారినందరిని కత్తివాత హతము చేయవలెను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ పురములో నున్నది యావత్తును దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును. యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడివేయునప్పుడు, దాని చెట్లు గొడ్డలి చేత పాడుచేయకూడదు; వాటి పండ్లు తినవచ్చునుగాని వాటిని నరికివేయకూడదు; నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా? అట్టి చెట్లను నీవు కొట్టకూడదు”
ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయంలో- “చెరపట్టబడిన వారిలో రూపవతి యైనదానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసికొన మనస్సయి నీ యింట ఆమెను చేర్చుకొనిన తరువాత, యొక నెలదినములు వేరుగా ఉంచి ఆమె (యుద్దములో మరణించిన) తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలెను. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొనవచ్చును. ఆమె నీకు భార్యయగును. నీవు ఆమెవలన సంతుష్టి నొందని యెడల ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలెనే గాని, ఆమెను ఎంతమాత్రమును వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమానపరచితివి గనుక ఆమెను దాసివలె చూడకూడదు.”
ఆధునిక రాజనీతిలో- ‘కాన్ ఫ్లిక్ట్ రిజల్యూషన్’ ఎటువంటి కీలకమైన అంశమో తెలిసిందే. అటువంటి అంశానికి అనుసరణీయమైన సూత్రాలు బైబిల్లో కీ. పూ. 5-7 శతాబ్దాల మధ్యనే కనిపిస్తున్నాయి. అటువంటిది, ‘బైబిల్’ పవిత్ర గ్రంథంగా పరిగణించే- ‘క్రైస్తవులు’ విదేశీ మతస్తులు అని, కొందరు ‘చర్చి పాస్టర్లు’ ఆర్ధిక ప్రయోజనాల కోసం చేసే ‘అతి’ని మొత్తం క్రైస్తవ సమాజానికి ఆపాదిస్తూ, వారిని హింసకు లక్ష్యం చేయడం ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో చూస్తున్నాము. అయితే మణిపూర్ విషయంలో జరుగుతున్నది, ఇటువంటి హ్రస్వదృష్టికి పరాకాష్ట.
Also read: వానపాముల కదలికలు, వారి ఉక్కపోతకు కారణం!