కలగను కంటి రెప్పలకు కమ్మగ వేకువ లాగమించినన్
తెలియదు, మంచువోలె శశి తెల్లని జాడ కరంగి పోయినన్
తెలియదు, బాహ్యశబ్దములు తీసిన తల్పుల లోన జొచ్చినన్
తెలియదు, గాఢనిద్ర గణుతింపదు మార్పులు జెందు కాలమున్!
——
చలి వడకించు రేయి, సతి చల్లని నీటను స్నానమాడినన్
తెలియదు, వంటయింటి పొగ దేవి దృగంచల మెఱ్ఱవారినన్
తెలియదు, చంటిబిడ్డ కిడి తీయని స్తన్యము జోలపాడినన్
తెలియదు, రెప్పమోడుపుల తీరని కోరికలే స్ఫురించుచున్!
——-
“తెలతెలవారె లెండనుచు” తేనియ గొంతున తట్టి పిల్చినన్
పలుకడు, “లెండు లెండనుచు” పంజరమందు శుకమ్ము పిల్చినన్
పలుకడు, కర్ణభేరి కడ “ప్రాణసఖా!” యని శంఖమూదినన్
పలుకడు, “మొద్దు నిద్దురను పక్కను వీడరు కుంభకర్ణులే?”
——-
నలిన దళాయతాక్షి చిరునవ్వులు చిందుచు తెచ్చి గుప్పిటన్
సలిలము వాని మోముపయి చల్లును, వాడవురా క్షణంబులో
పెళపెళ గొంతు చించుకొని భీతిని గొల్పును భీకరాకృతిన్!
కలకలలాడు కన్నుల సఖా! జలపాతము లెన్ని యున్నవో!
Also read: దీపకథ
Also read: వ ర్ష సం ధ్య
Also read: లోక బాంధవా!
నివర్తి మోహన్ కుమార్