- చంద్రుడిపై దిగవలసిన తేదీ ఆగస్టు 23
- చంద్రయాన్-2 విఫలమైన నాలుగేళ్ళకు మరో ప్రయత్నం
భారత దేశం ప్రయోగించిన చంద్రయాన్-3 అఖిల భారత ప్రజల సకల కలలను మోసుకుంటూ శుక్రవారం మధ్యాహ్నం శ్రీహరికోట కేంద్రం నుంచి నింగివైపు దూసుకెళ్ళింది. చంద్రుడిపైన అనుకున్నట్టు విజయవంతంగా దిగితే భారత్ ఈ ఘనకార్యం సాధించిన నాలుగో దేశం అవుతుంది. మిగిలిన మూడు దేశాలు రష్యా, అమెరికా, చైనాలు. బాహుబలి రాకెట్ గా పిలుచుకుంటున్న ఈ వాహనం విక్రమ్ చంద్రుడిపైన ఆగస్ఠు 23న దిగవలసి ఉంది. అక్కడ దిగిన తర్వాత ఒక లూనార్ దినం (అంటే మనకు 14 దినాలు) పని చేస్తుంది.
చంద్రయాన్-3లో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి. ఒక లాండర్, ఒక రోవర్, ఒక ప్రొపల్షన్ మోడల్. చంద్రమండలంలో ఇప్పటికే ఉన్న చంద్రయాన్-2 కి చెందిన ఆర్బిటర్ ను వినియోగిస్తుంది. చంద్రుడిపైన దక్షిణధ్రువంలో విక్రమ్ దిగుతుంది. 2008లో చంద్రుడిపైకి మొదటిసారి వ్యోమనౌకను భారత్ పంపినప్పుడు అక్కడ నీరు ఉన్నట్టు కనుగొన్నది. విక్రమ్ చంద్రుడిపైన మెల్లగా దిగిన తర్వాత రోవర్ ప్రజ్ఞను విడుదల చేస్తుంది. అది ఒక లూనార్ దినమంతా చంద్రుడి ఉపరితలంపైన తిరుగాడి పరీక్షలు నిర్వహిస్తుంది.
ఇదివరకు చంద్రయాన్ ను చంద్రుడి మీదికి పంపేందుకు భారత్ చేసిన ప్రయత్నం విఫలమైంది. అది నాలుగేళ్ళ కిందటి సంగతి. 2019లో చంద్రుడిపైన దిగే ప్రయత్నం చేస్తున్న దశలో చంద్రయాన్-2 విఫలమైంది. ఈ సారి వైఫల్యం చెందకుండా నివారించేందుకు అవసరమైన ఏర్పాట్లను చంద్రయాన్-3లో చేశామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.