డాక్టర్ దేవరాజు మహారాజు
అడవులలో క్రూర మృగాలు
జంతువుల్ని తమ గుంపుల నుంచి విడదీస్తూ
వేటాడుతూ హీనంగా, అనాగరికంగా బతుకుతున్నాయి
సమాజంలో మనుషులుగా మారని జంతువుల పరిస్థితి అదే!
అధ్యయనం కోసం వెళ్ళిన శాస్త్రవేత్తలు
బైనాక్యులర్స్ తో, కెమెరాలతో
వాటి కదలికల్ని విశ్లేషిస్తున్నారు.
ప్రతి సామాన్యుడూ ఒక సైన్సు కార్యకర్తగా
మారిపోయిన విషయం క్రూరజంతువులు గ్రహించవు
అధికారం తమదేననుకుని
రక్తపు నాలుకలతో పెదాలు తడుపుకుంటూ
కళ్ళు మూసుకొని భ్రమల్లో తేలుతుంటాయి
________________________________
తమ రహస్యాలు తెలుసుకోవడానికి
జనం తమ మెడలోనే కెమెరాలు వేలాడేసిన విషయం
అవి గ్రహించవు.
________________________________
ఇంకా మనిషిగా మారని ఒక ప్రధాన జంతువు
మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమానికి డాబుగా వెళ్ళింది
మనుషులైతే కదా అక్కడ విషయాలు అర్థమయ్యేది?
మేథోపరంగా ఎదిగితే కదా పరిణామాలు అవగతమయ్యేది?
దొరికిన ప్రచారానికి మురిసిపోతూ
కెమెరా పిచ్చి ఉన్న ప్రధాన జంతువు
రాజధానికి తరలి వెళ్ళింది
దృశ్యం ఏదో మారినట్టుంది
జంతువుల్ని మనుషులు అధ్యయనం చేయడం కాదు,
మనుషుల్నే ఇప్పుడీ దేశంలో
జంతువులు పరిశీలిస్తున్నాయి-పైగా
ఈ అరణ్యానికి చెందినవారెవరో
చెందనివారెవరో తేల్చుకోమంటున్నాయి.