Thursday, November 21, 2024

మహారాష్ట్రంలో మహానాటకం, భ్రష్టాచారానికి పరాకాష్ఠ

  • అజిత్ పవార్ షిండే ప్రభుత్వంలో చేరిక, ఎన్ సీపీలో భారీ చీలిక
  • భోపాల్ సభలో మోదీ అవినీతిపై దర్యాప్తు గ్యారెంటీలు బక్వాసేనా?
  • 70వేల కోట్ల కుంభకోణం చేసిన అజిత్ పవార్ కు ఎట్లా స్వాగతం చెబుతారు?
  • ఈడీ, ఐటీ, సీబీఐ దాడుల పలితమేనా ఇది?

ప్రధాని నరేంద్రమోదీ అవినీతిపైన మాట్లాడుతున్న మాటలు ఉబుసుపోకకు మాట్లాడుతున్నవేనా? అంతా వాచాలత్వమేనా? ఆయన మాట్లాడే మాటలకు విలువ లేదా? పోయిన  నెల 27వ తేదీ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మణిపూర్ పోకుండా మధ్యప్రదేశ్ కు వెళ్ళి భోపాల్ లో ఏమి మాట్లాడారో విన్నారా? ‘‘నేను నేషనల్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే  ఆ పార్టీ మీద 70 వేల కోట్ల కుంభకోణం ఆరోపణ ఉన్నది. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణం, మరెన్నో కుంభకోణాలున్నాయి. ఆ జాబితా చాలా పొడుగు ఉన్నది. ఈ పార్టీల కుంభకోణాల మీటర్ ఎప్పుడూ తగ్గదు’’ అంటూ హుంకరించారు. ఆ ప్రకటన చేయకముందు అజిత్ పవార్ పైనా, మరికొందరు మాహారాష్ట్ర నాయకులపైనా ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు చేయించారు. భుజబల్ ను అరెస్టు కూడా చేశారు. చివరికి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా కట్టకట్టుకొని శనివారంనాడు ప్రభుత్వంలో చేరిపోయారు. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మరి ఎనిమిదిమంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారందరికీ ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా స్వాగతం చెప్పినట్టే భావించాలి. వాని ఆమోదం లేకుండా ముంబయ్ లో ప్రమాణస్వీకారాలు జరుగుతాయా?

ఇటువంటి ప్రహసనం ఒక్క ప్రదానమంత్రి వల్లనే సాధ్యం. ఆయనకు తెలుసు ఆయన ఏమి చేసినా, ఏమి మాట్లాడినా ప్రజలు తననే బలపర్చుతారని. మతం దృష్టిలోనే ఆయనను చూస్తారనీ, ఆ దృష్టితోనే ప్రేమిస్తారనీ తెలుసు. వేలు చూపించి, గంభీర స్వరంతో అవినీతి ఆరోపణలు చేయడం, వారిపైన దాడులు జరిపించడం, వారు లొంగి తన పార్టీలో చేరితే వారికి స్వాగతం చెప్పడం, వారిపైన కేసులు  మాయం కావడం, దాడులు ఆగిపోవడం, ఆరోపణలు నిలిచిపోవడం గత తొమ్మిదేళ్ళుగా కనిపిస్తున్న నరేంద్రమోదీ మార్కు వింతరాజకీయమే. దీనికంటే అవినీతి రాజకీయం మరొకటి ఉంటుందా? ప్రజలు గెలిపించిన పార్టీలు కాకుండా ఇటువంటి టక్కుటమార విద్యలతో మెజారిటీ సంపాదించి మూడు పెద్ద రాష్ట్రాలలో ప్రభుత్వాలు నడుపుతున్న భారతీయ జనతా పార్టీకి కానీ, దాని నాయకులకు కానీ అవినీతి గురించి మాట్లాడే హక్కు ఉన్నదా? ఇంతకంటే అందరగండం రాజకీయం మరొకటి ఉన్నదా? మొదలు కర్ణాటకలో కాంగ్రెస్ నుంచీ, జేడీ(ఎస్) నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అక్రమంగా ఏర్పడిన ఆ ప్రభుత్వాన్ని ప్రజలు మొన్నటి ఎన్నికలలో ఓడించారు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియాను ఎగదోశారు. ఫిరాయించమని ప్రోత్సహించారు. ఆయన సుమారు మూడు డజన్ల మంది ఎంఎల్ఏలను వెంటేసుకొని బీజేపీలో ప్రవేశించారు. కమలనాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టారు.   శివరాజ్ సింగ్ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మొన్న ప్రధాని నాటకీయంగా అవినీతిని దర్యాప్తు చేయడం గురించి మాట్లాడుతుంటే ఇదే శివరాజ్ సింగ్ నిస్సిగ్గుగా చప్పట్లు కొడుతూ హర్షం వెలిబుచ్చారు. అనంతరం మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి ఎసరు పెట్టారు. శివసేనను రెండుగా చీల్చారు. సంవత్సరం కిందట ఉద్ధవ్ ఠాక్రేని గద్దెదింపి ఏక్ నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేశారు. ఇదివరకు ముఖ్యమంత్రిగా పని చేసిన ఫడ్నవీస్ ను ఉపముఖ్యమంత్రి చేశారు. ఆ ఫడ్నవీస్ సహాయంతోనే ఇప్పుడు ఎన్ సీపీ ని చీల్చారు. అజిత్ పవార్ ను ఉఫముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు డబుల్ ఇంజెన్ సర్కార్ కాస్తా త్రిబుల్ ఇంజన్ సర్కారయిందని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి షిండే అభద్రతాభావంతో బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాపం మహారాష్ట్ర ప్రజలు ఏమి చేయాలి? ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే అంటారు. ఈ రాష్ట్రంలో మాత్రం ప్రజలు ఏ పార్టీకి ఓటు వేసినా ప్రభుత్వం మాత్రం బీజేపీనే ఏర్పాటు చేస్తుంది. 2019లో అజిత్ పవార్ తెల్లవారు జామున ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు అప్పుడే చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ తో కలసి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తర్వాత కొన్ని గంటలకే ఇద్దరూ రాజీనామా చేయవలసి వచ్చింది. ఈ సారి మధ్యాహ్నం వెళ్ళారు. అజిత్ పవార్ మళ్ళీ ఉపముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణం చేశారు. అంతకు ముందు దేవేందర్ ఫడ్నవీస్ అజిత్ పవార్ పైన అంతులేని అవినీతి ఆరోపణలు చేశారు. అజిత్ పవార్ జైల్లో చిప్పకూడు తినక తప్పదని ఎన్నోసార్లు అన్నారు. ఇప్పుడు ఇద్దరూ ఉపముఖ్యమంత్రులుగా నవ్వుతూ చెట్టాపట్టాలేసుకొని మాట్లాడుకుంటున్నారు. ఏమి రాజకీయమిది?

అంతా ఈడీకి మాయ. ఎవరైనా పలుకున్న ప్రతిపక్ష నాయకులను లొంగదీసుకోవాలంటే ఈడీ ని ప్రయోగించాలి. వారి నివాసాలపైనా, వ్యాపారసంస్థలపైనా దాడులు చేయించాలి. అనుకూలమైన మీడియాలో వారికి వ్యతిరేకంగా భయంకరమైన ఆరోపణలు చేస్తూ సుదీర్ఘంగా వార్తలు రాయించాలి. ఒత్తిడి తట్టుకోలేక వారు పార్టీ ఫిరాయించి బీజేపీ లో చేరితే వారికి స్వాగతం చెప్పాలి. అప్పుడు ఈడీ మాట్లాడదు. దాడులు చేయదు. చార్జిషీటు దాఖలు చేయదు. ఆ కేసుల ఊసే ఎత్తదు. తక్కిన ప్రతిపక్ష నాయకులను దారిలోకి తెచ్చేందుకు దాడులు చేయడంపైన దృష్టి పెడుతుంది. 2019 ఎన్నికలలో అజిత్ పవార్ పైన 70 వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు బీజేపీ నాయకులు చేశారు. ఎన్నికలు కాగానే అజిత్ పవార్ గవర్నర్ కార్యాలయానికి వెళ్ళారు. ఆయనకు దేవేందర్ ఫడ్నవీస్ కౌగలించుకొని స్వాగతం చెప్పారు. ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. అది అరవై గంటలు కూడా నిలవలేదు. ప్రతిపక్ష కూటమి సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. మర్నాడు సాయంత్రంకల్లా బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బలం లేదు నిరూపించుకోవడానికి. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి రాజీనామా చేశారు. ఫడ్నవీస్ బీజేపీలో ఉన్నారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడైనారు.  అజిత్ పవార్  ఎన్ సీపీలోకి వెళ్ళారు. షిండే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రతిపక్ష నాయకుడుగా వ్యవహరించారు. కానీ ప్రభుత్వంపైన విమర్శలు చేయవలసినంతగా  చేయలేదు. ఫ్రెండ్లీ మ్యాచ్ గానే సాగింది వ్యవహారం. అజిత్ పవార్ ప్రతిపక్ష నాయకుడిగా పేలవంగా పని చేస్తుంటే శరద్ పవార్ ఎందుకు ఊరుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలికగా లభించదు. శరద్ పవార్ లోతు తెలుసుకోవడం కష్టం.  ‘‘ప్రతి కుంభకోణంపైనా దర్యాప్తు జరిపిస్తానన్న గ్యారెంటీ ఇస్తున్నాను. పేదలనూ, సమాజాన్నీ, దేశాన్నీ దోచుకుతినేవాళ్ళను ఉపేక్షించేది లేదు. వారి మీద దర్యాప్తు చేయించి లెక్కలు తేల్చుతాను’’ అంటూ భోపాల్ లో ప్రధాని గర్జించారు. ఇవి ఉత్తుత్తి గర్జనలేననీ, ప్రత్యర్థులు బీజేపీతో చేతులు కలిపితే కేసులన్నీ మాఫ్ అవుతాయనీ గత తొమ్మిదేళ్ళ రాజకీయంలో మోదీ నిరూపించారు. ప్రధానికి రాజీకీయాలే పరమావధి. అవినీతిని ఉపేక్షించగలరు. అక్రమాలను చూసీచూడనట్టు పోగలరు. బీజేపీలో చేరితే కేసులు మాఫీ గ్యారెంటీ అని మోదీ చెప్పినట్టు భావించాల్సి ఉంటుంది. మోదీ గ్యారెంటీ  గురించి మాట్లాడుతుంటే సభ్యులు కేరింతలు కొట్టారు. గోదీ మీడియా ఆ దృశ్యాలను పదేపదే చూపించింది. వారం రోజులు కూడా కాలేదు కదా భోపాల్ లో అంత గంభీరంగా జూన్ 27న వాగ్దానం చేసి, ఇప్పుడు జులై రెండున అజిత్ పవార్ కు స్వాగతం ఎట్లా చెబుతారని ప్రధాన స్రవంతికి చెందిన ఒక్క పత్రిక కానీ, ఒక్క చానెల్ కానీ ప్రధానిని ప్రశ్నించలేదు. మిజోరంలో కూడా ఇదే జరిగింది. ఏ పార్టీపైన ఎన్నికల ప్రచారంలో కుంభకోణాల ఆరోపణలు చేశారో ఎన్నికలు పూర్తయిన తర్వాత అదే పార్టీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles