Thursday, January 2, 2025

జూన్ 21ని ‘హ్యూమనిస్ట్ డే’ గా గుర్తుంచుకుందాం!

అన్ని రకాలుగా నాశనమవుతూ ఉన్న మనిషిని బతికించుకోవాల్సిన అవసరం వచ్చింది. తన అలసత్వం, అజ్ఞానం, మూర్ఖత్వం వల్ల మనిషి తన ఉనికికే ప్రమాదకారి అవుతున్నాడు. అందుకే ఈ 21 జూన్ ని మనం ‘హ్యూమనిస్ట్ డే’గా జరుపుకుంటున్నాం. మనిషి సజీవంగా ఉంటేనే ఏ ప్రభుత్వాలైనా కొనసాగుతాయి. ఏ విపక్షాలైనా ఉద్యమాలు చేస్తాయి. ఏ హక్కుల పోరాటానికైనా అర్థముంటుంది. మనిషి ఉనికే ప్రమాదంలో పడ్డప్పుడు అంతా శూన్యమే! మతస్థులైనా, మతరహితులైనా, ధనికులైనా, పేదలైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ జాతి వారైనా బతికి ఉంటేనే దీన్ని జీవప్రపంచం అని అంటాం.. ఇది-మాది పై చేయి అంటే మాది పై చేయని ఘర్షణలకు దిగాల్సిన సమయం కాదు. ఈ భూమిమీద మనిషే నశించిపోయే ప్రమాదస్థితిలో ఉన్నాడు కాబట్టి, ఎవరిది పై చేయి అనేది అర్థం లేని మాట! ముందు మనిషిని బతికించుకుందాం. అందుకు తగిన అవగాహన పెంచుకోవడానికే  ఈ ‘హ్యూమనిస్ట్ డే’!

Also read: మూఢనమ్మకాలపై కందుకూరి పోరాటం

పెరిగిపోతున్న కాలుష్యాలమీద, గ్లోబల్ వార్మింగ్ మీద అంతర్జాతీయ సదస్సులు జరిపి, ఈ ధరిత్రిని కాపాడుకోలేం. కార్యాచరణ కావాలి. తెలివితక్కువ పాలకుల ఆర్థిక విధానాల వల్ల చితికిపోతున్నా పట్టించుకోకపోతే, తప్పదు- జాతి(దేశ) వినాశనం! తిండి పెట్టే రైతుకే తిండి లేకుండా చేసే ప్రభుత్వాలు ఉన్నంతకాలం మనిషికి మంచి రోజులు రావు. పచ్చదనాన్ని, నీటి వనరుల్ని, ఖనిజాల్ని భద్రపరుచుకునే ముందు చూపు లేకపోతే, మనిషి ఎలా మనుగడ సాగిస్తాడూ? అందుకే మనిషిని బతికించుకోవాల్సి ఉంది. ఆ ఆలోచన సారాంశాన్ని సామాన్య జనానికి అర్థం చేయించడానికైనా మానవత్వం గురించి, మానవ వాదం గురించి, నిర్భయంగా మాట్లాడాలి. నిరంతరం మాట్లాడుతూనే ఉండాలి. అందుకే ‘హ్యూమనిస్ట్ డే’ జరుపుకోవాలి! ఎల్లావేళలా మనుషులంతా మానవత్వంతో మసలుకోవడం నేర్చుకోవాలి. విభజింపబడి ఉన్న మెదడు భాగాల్ని కలుపుకోవాలి. ముక్కలైన మనసుల్ని ఒక్కటిగా చేసుకోవాలి! మనుషుల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ, మనిషిని కాపాడుకునే విషయంలో అభిప్రాయ భేదాల్ని పక్కకు నెట్టాలి. తాము బతుకుతూ ఎదుటివారిని బతుకనివ్వాలి. ఆకలితో అలమటిస్తున్నవాడి ఆకలి తీర్చడం మానవత్వమే. ఆర్థికంగా కుప్పగూలిన వారికి చేయూత నివ్వడం మానవత్వమే. ఇవి మానవత్వానికి మనకు కనిపించే చిన్నపాటి ఉదాహరణలు. కానీ, సర్వ మానవాళికి పనికొచ్చే వైజ్ఞానికుల పరిశోధనలు మనకు కనపడవు. శతాబ్దాలుగా వారు కనిపెట్టిన వస్తువుల వల్ల, పరికరాల వల్ల, మందుల వల్ల జనజీవితం సుఖమయం అవుతూ వచ్చింది. బాధను  తగ్గిస్తూ, జీవితాన్ని పొడిగిస్తూ వారు అందించిన ఆవిష్కరణలు సమాజగతినే మార్చేశాయి.

ఇక అత్యాధునిక వైజ్ఞానిక వసతుల్ని పూర్తిగా అనుభవిస్తూ జనాన్ని మోసపూరితంగా వెనక్కి నడిపిస్తున్న రాజకీయ నాయకులు, మతపెద్దలు, పూజారుల, ప్రవచనకారుల, ముల్లాలు, ప్రీస్ట్ లు, వక్తలు. ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. వారి బారి నుండి మన జనాన్ని మనం రక్షించుకోవాలి. జనంలోని వివేకాన్ని జాగృతం చేయాలి. ఏమైనా మనిషిని కాపాడుకోవడం మన ధ్యేయం కావాలి!

Also read: సెంగోల్:  రాజ్యాంగం పై సర్జికల్ స్ట్రైక్

కొందరు పెద్దలు మానవత్వం, మానవతావాదం గురించి విరివిగా మాట్లాడుతుంటారు. కానీ, దానికి విరుద్ధమైన పనులు చేస్తుంటారు. దీనివల్ల అమాయకులైన సామాన్యులు అయోమయంలో పడుతుంటారు. అందుకే మానవత్వం అంటే ఏమిటో, అది ఎలా వాడుకలోకి వచ్చిందో టూకీగా తెలుసుకుందాం. దీన్నే ఇంగ్లీషులో ‘హ్యూమనిజం’ అంటున్నారు. ఇంగిత జ్ఞానంతో మొదలై, నైతిక విలువలతో కూడిన ఒక తాత్త్విక చింతన మానవత్వం! దానికి కొంత విచక్షణ, విశ్లేషణాజ్ఞానం తోడయితే అదే హేతువాదమవుతుంది. అది పూర్తిగా ప్రజాస్వామ్యపు పునాదుల మీద నిలబడి, మానవజాతిలో సమానత్వంకోసం సంఘర్షిస్తుంది. అన్ని దశల్లో అన్ని వేళలా మానవాభ్యదయాన్ని కాంక్షించేదే మానవతావాదం. ఫెడ్రిచ్ ఇమ్మాన్యుల్ నైథమ్మర్ (FRIEDRICH NIETHAMMER) తొలిసారి 1808లో ఈ ‘హ్యూమనిజం’ అనే పదాన్ని రూపొందించారు. నిజానికి ఇది లాటిన్ భాషలోని హ్యుమనిటస్ (HUMANITAS) అనే పదంలోంచి తీసుకున్నది. ఇలాంటి పదాలు ఇంగ్లీషులో ఇజంతో (ISM) ముగుస్తాయి గనక, దీనికి ఇజం కలిసి ‘హ్యూమనిజం’ అయ్యింది. దీనిలోంచే ‘హ్యుమానిటీ’ అనే పదం వచ్చింది. బవేరియన్ ఎడ్యుకేషనల్ కమీషనర్ అయిన ఫ్రెడ్రిచ్ నైథమ్మర్ తన అదికారాల్ని ఉపయోగించి, జర్మన్ సెకండరీ స్కూళ్ళలో ‘హ్యుమనిటస్’ ను ఒక పాఠ్యాంశంగా చేసి, బొధించే ఏర్పాటు చేశాడు. ఆ విధంగా 1936లో ‘హ్యుమనిటస్’ అనే పదం ఇంగ్లీషు భాషలో చేరింది. 1765లోనే ఒక పేరు తెలియని రచయిత ‘మానవాళిని ప్రేమిద్దాం!’ అని రాశాడని ఆ తరువాత పరిశోధనల్లో బయటపడింది. ఏది ఏమైనా, ప్రెంచ్ విప్లవానికి ముందు వెనకలుగా వెలువడ్డ చరిత్ర, తాత్త్విక చింతన, సామాజిక, రాజకీయ, సాహిత్య గ్రంథాలు మానవాళిని కేంద్రకంగా చేసుకొని వెలువడ్డాయి.

ఆలుస్ జెల్లియస్ (AULUS GELLIUS)సి.ఇ. 125-180  నాటి భాషా శాస్త్రజ్ఞుడు హ్యూమనిటస్ కు దాదాపు సరిసమానమైన పదం గ్రీకులో ఫిలాంత్రఫీ (PHILANTHROPY)అవుతుంది గనక, దాని లక్షణాలు కూడా కలిపి ఆ రెండింటి అర్థాల్ని స్వీకరించాలన్నాడు. లోకోపకారిగా తన తోటివారిపై దయాగుణం ఉండడం, అవసరమైనప్పుడు వారికి తగిన రీతిలో సేవ చేయడం లాంటివన్నీసమాజానికి అలవాటు చేయాలన్నాడు. ఈ ఆలోచనను, ఈ పదాల్నీ, వాటికున్న అర్థాల్నీ, వాటి చుట్టూ అల్లుకున్న విస్తృత అర్థాల్నీ రోమన్ తత్త్వవేత్త, కవి సిసిరో(106-43 బీ.సీ.ఇ) జనంలో ప్రచారం చేశాడు. దయాగుణం, సేవాభావమే కాదు, తగిన విద్వత్తు కూడా ఉంటేనే అతణ్ణి ‘హ్యుమనిటస్’గా గుర్తించాలన్నాడు సిసిరో – ఆ విధంగా చాలా శతాబ్దాలు మతవిశ్వాసాలతో పాటు ‘మానవత్వం’ చలామణి అయ్యింది. క్రమక్రమంగా 18, 19 శతాబ్దాల కాలంలో మానవ అవసరాల మీద శ్రద్ధపెట్టడం, పనికిరాని విశ్వాసాల్ని పక్కకు నెట్టడం, ప్రతిదానికీ కారణాన్ని అన్వేషించడం ప్రారంభమై ‘మానవతావాదం’ ఒక ఆలోచనా ధోరణిగా రూపుదిద్దుకోవడం మొదలయ్యింది. ఆ ఆలోచనా ధోరణి అన్ని కళల్లోకీ వ్యాపించింది. మావనవాద దృక్పథంలోంచి లలితకలలు, కవిత్వం, విద్య, వైద్యం వంటి రంగాలన్నీ బలపడుతూ వచ్చాయి. ప్రతిచోట, ప్రతిరంగంలో ప్రశ్నకు విలువ పెరుగుతూ వచ్చింది. ఆ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించుకునే క్రమంలో హేతువాదంతో కూడిన మానవతావాదం, శాస్త్రీయ అవగాహనావ్యాప్తి చెందాయి.

Also read: ‘జైహింద్’ ఆలోచన మన హైదరాబాదువాడిదే!

తొలిసారిగా 1933లో ‘హ్యూమనిస్ట్ మానిఫెస్టో’ చికాగో విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో   విడుదల అయ్యింది. ఆ మానిఫెస్టో ప్రధానంగా కారణం, నైతికత, సామాజిక-ఆర్థిక న్యాయం, సమన్వయం అనే సూత్రాల మీద ఆధారపడింది. వీటన్నిటితో పాటు మరొక విషయం ప్రత్యేకంగా చర్చించబడింది. అదేమిటంటే, ఆధారం లేని విశ్వాసాలు, ముఢనమ్మకాలు పక్కకు నెట్టి, వైజ్ఞానిక అవగాహనను పెంపొందించాలని, దానిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందని కూడా మానిఫెస్టోలో రాశారు. మానవవాదం గురించి అవగాహన పెరుగుతున్న దశలో అక్స్ ఫర్డ్ ఇంగ్లీషు నిఘంటువు ఒక వ్యతిరేకమైన అర్థాన్ని ప్రచురించింది. దాన్ని రూపొందించిన బృందంలో ఒక ఇంగ్లీషు వాడు, హ్యూమనిస్ట్ అంటే చులకన భావం గలవాడు  ఆ అర్థాలు రాశాడు. హ్యూమనిస్ట్ అంటే ‘‘దైవభావనను ధిక్కరించేవారు,’’ ‘‘ఉట్టి మానవతావాదులు,’’ ‘‘అరాచకవాదులు,’’ ‘‘ఆస్తులను దోపిడి చేయువారు’’- అని రాశాడు. బహుశా అతను విశాలమైన భావజాలంతో ప్రగతిశీల ధోరణిలో ఆలోచించలేనివాడై ఉంటాడు. అందువల్ల అతను తన అక్కసును అలా వెళ్ళగక్కుకున్నాడు. అది మాత్రమే కాదు, అలాంటి మరికొన్ని సంఘటలను జరుగుతూ రావడం వల్ల సహజంగా మతతత్వవాదులకు వెయ్యేనుగుల బలం చేకూరింది. అదే సమాజంలో వేళ్ళూనుకుని పోయింది. తరతరాలుగా ప్రపంచ వ్యాప్తంగా దైవభావన బలం పుంజుకుంది. దాని పర్యవసానంగానే మతాన్ని, దైవాన్ని ప్రశ్నించినవారు దుర్మార్గులు, పాపాత్ములు, చెడ్డవారు అనే ముద్ర వేయబడుతూ వచ్చారు. అందుకే చూడండి…పరిస్థితి ఈ నాటికీ పూర్తిగా మారలేదు. మతవిశ్వాసాలలో పడి కొట్టుకుపోయేవారిని మామూలు మనుషులుగా పరిగణిస్తున్నారు. స్వేచ్ఛాలోచనతో హేతుబద్ధంగా మాట్లాడేవాళ్ళను ‘పిచ్చి’వాళ్ళ కింద జమకడుతున్నారు. అయితే అడ్డుకునేవారూ, విషయం వివరించేవారూ ప్రతితరంలో ఎవరూ ఉండడం లేదని కాదు.ఉంటున్నారు. కాని ఏ కొద్దిమందో ఉంటున్నారు.

విశాల హృదయంతో ఆలోచించలేనివారిని దైవభావనలో పడి కొట్టుకు పోతున్నవారిని, ఈ దేవుడు కాదు, ఆ దేవడని, ఈ మతంకాదు ఆ మతమని కొట్టుకు చచ్చేవారిని- సమాజంలో అక్కడక్కడ అప్పుడప్పుడు కొందరు మహానుభావులు హెచ్చరిస్తూనే వచ్చారు. అలాంటివారిలో ఎర్నెస్ట్ రెనన్ (ERNEST RENAN) పేరు తప్పక చెప్పుకోవాలి. ‘జ్ఞానం యొక్క భవిత: 1848 నాటి ఆలోచనలు’- అనే గ్రంథంలో ఆయన ఇలా రాశాడు. ‘‘భవిష్యత్తులో మతమేదైనా ఉంటే, అది మా‘నవ’వాదం – అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. శాఖోపశాఖలుగా ఉన్న ఈ విశ్వాసాలన్నీ ఒక్క తాటిపైకొచ్చి, నైతిక విలువలతో కూడిన ‘మా‘నవ’వాదం-గా రూపుదిద్దుకుంటుంది-తప్పదు!’’

సంప్రదాయం పేరుతో చాదస్తాలు వ్యాప్తి చేస్తున్న అబద్ధపు పండగల్ని, అసంబద్ధపు ఉత్సవాలన్ని నిరసిద్దాం! మనిషి గౌరవాన్ని, ఔన్నత్యాన్నీ నిలిపే ప్రత్యామ్నాయ వేడుకలకు సిద్ధపడదాం. ప్రత్యామ్నాయ కార్యక్రమాలకు రూపకల్పన చేద్దాం. మనుషులం గనక, మనిషిని గుర్తిద్దాం. గౌరవిద్దాం. మనిషిలోని మనిషితనాన్ని నిలుపుకుందాం. మనిషిలా బతుకుతూ, మనిషిని బతికించుకుందాం! రండి!! 21 జూన్ రోజున మానవత్వపు దినాన్ని ఎక్కడికక్కడ ఘనంగా జరుపుకుందాం! మనం మనుషులమన్నది చాటుకుందాం!!

దుర్మార్గాల్ని ఆపే శక్తి సంప్రదాయాలకు లేదు-

వైజ్ఞానిక అవగాహన పెరిగితేనే మానవత్వం వికసిస్తుంది!

Also read: గుర్తిస్తే, మానవవాదులు మన‘లోనే’ ఉన్నారు!

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, మానవవాది)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles