భగవద్గీత – 63
‘‘దేవుడిని దేవుడికోసమే ప్రార్ధించు. ఆయన మూర్తి ఎదురుగా నీవు దేవాలయములో ఉన్నప్పుడు వేరే కోరికలమీద నీకు ధ్యాస ఎందుకు?
నాకు అదివ్వు, నాకు ఇదివ్వు, అది ఇస్తే నీ హుండీలో ఇంతవేస్తా, ఇది ఇస్తే ఇంతవేస్తా అని మొక్కులు మొక్కకు’’ అని మా గురువుగారొకరు నాకు చెప్పిన గురుతు.
నిజమే కదా! సకలభువనాలను పరిపాలించే పరమేశ్వరుడికి నీవు ఇవ్వగలది ఏముంది. అసలు అంతా ఆయనే, అంతా ఆయనదే కదా. నిర్మలమైన మనస్సుతో ధ్యానించు. నిన్ను సృష్టించిన వాడికి నీకు ఏమి ఇవ్వాలో తెలియదా?
Also read: మానసిక తపస్సు అంటే ఏమిటి?
కష్టాలు పడుతున్నా స్వామీ అని మొరపెట్టుకుంటాము. అసలు ఏ బంధనాలనుండి నిన్ను దూరంచేసి విడిపించడానికి ఆ కష్టాలో నీకు తెలియదు.
ప్రసవవేదన లేకుండా తల్లి బిడ్డడికి జన్మనివ్వగలదా? ఆ వేదనే పుత్రోత్సాహానికి నాంది కదా?
లోపలినుండి పెంకును పగలగొట్టుగొని బయటకు రావటానికి ఆ చిన్ని పక్షిపిల్ల ఎంత అవస్థలు పడుతుందో, ఆ అవస్థలే దాని ముక్కును, దాని రెక్కలను దృఢంగా చేస్తాయి కదా?
Also read: శారీరిక తపస్సు అంటే?
పడే కష్టాలు మనలను మానసికంగా దృఢంగా చేసి ముందుకు నడిపించడానికే. ఏదో కావాలని, ఏదో ఇమ్మనమని భగవంతుడిని ప్రార్ధింపక ఫలాపేక్షలేకుండా, వాచిక తపస్సు, శారీరిక తపస్సు, మానసిక తపస్సు అనే ఈ మూడువిధాలైన తపస్సులను యోగులు పరమశ్రద్ధతో ఆచరిస్తారు. ఇలాంటి తపస్సులను ‘‘సాత్త్విక తపస్సులు’’ అని అంటారు.
శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే (17-17)
ఫలాన్ని ఆశించక యోగులచేత పరమశ్రద్ధతో ఆచరింపబడు పైమూడు తపస్సులను (వాచిక, శారీరిక, మానసిక) సాత్త్విక తపస్సులు అని అంటారు.
Also read: సరి అయిన మాట భవిష్యత్తుకు పెట్టని కోట