భగవద్గీత – 57
ఒక మనిషికి ఎంత కావాలి?
ఈ ప్రశ్న నన్ను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. నా మెదడును పురుగులాగా తొలుస్తూనే ఉంటుంది. ఉండటానికి ఒక ఇల్లు, తినడానికి లోటులేకుండా ఆహారం, కట్టుకోవడానికి బట్ట, రోగమొస్తే చికిత్సకోసం ఇన్స్యూరెన్స్, బయటకు వెళ్ళవలసివస్తే ఒక కారు.
ప్రపంచం తెలుసుకోవడానికి ఒక టివి, ఒక స్మార్ట్ ఫోను. ఇంట్లో సౌకర్యంగా ఉండటానికి ఇంట్లోవాళ్ళకు అవసరమయిన పరికరాలు… ఇవి ఆధునిక మానవుడి అవసరాలు…
సరే ఇవ్వన్నీ ఉన్నాయి!
Also read: విశ్వరూపము దర్శించగలమా?
ఏదో ఒకరోజు పనిబడి పక్కింటికెళ్ళాడు. వాళ్ళ ఇల్లు ఇంద్రసభలా ఉంది. వాళ్ళ టివి లేటెస్ట్ మోడల్, ఆయన ఫోను latest I-Phone,… అన్నీ లేటెస్టే… ఇంటికొచ్చిన తరువాత తనకున్నవి చూసుకుంటే, అబ్బే వాటంత బాగలేవు… అంతే అవి మార్చాలనే బుద్ధిపుట్టింది. అప్పుడు డబ్బు అవసరమయింది…
ఇన్ స్టాల్ మెంటు రూటుబట్టాడు. కోరికగలిగినవి సమకూర్చుకున్నాడు. ఇప్పుడు విపరీతమైన ఒత్తిడి వాయిదాలు కట్టడానికి.
అదనపు సంపాదన ఎట్లా?
ఇలాంటి కోరికలవలననే లంచాలబాట పట్టాడు మనిషి. ఎంతకీ కోరిక తీరట్లే… ఒత్తిడి ఒత్తిడి… ఆ ఒత్తిడి psycho somatic disordersకు కారణమయి, అన్ని రకాల రోగాలు చుట్టుముట్టి మనిషిని అతలాకుతలం చేసి అధోగతిపాల్జేసి పీల్చిపిప్పి చేసింది. దీనికి కారణం ‘‘కోరిక.’’ కామం.
Also read: కాలస్వరూపం
ఒకరితో పోల్చుకొని వాడికంటే తక్కువయితే ‘‘చిన్నతనపు భావన‘‘…. ఎక్కువయితే వాడంటే ‘‘చిన్నచూపు’’… ఇలా చిత్తడి భావాల ఒత్తిడిలో కోరికల ఊబిలో ఇరుక్కుపోయాడు మనిషి.
అందుకే పరమాత్మ అంటారు
కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః
మోహాద్ గృహీత్వాసద్ గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః
అంతులేని కోరికలను ఆశ్రయించి దంభం, అభిమానం, గర్వాలతో ఉంటూ మోహానికి లొంగిపోయి దురాగ్రహంతో ఉంటూ అకార్యాలలో మునిగి ఉంటారు…
తనకు లేనిదానిని ఉన్నట్లుగా ప్రదర్శించటం దంభం!
తాను అందరికన్నా గొప్పవాడిని అని భావించటం గర్వం సమాజంలో శాంతి పరిఢవిల్లాలంటే వీటిగురించి తెలియచెప్పే విద్య అవసరం. ఇదే నిజమయిన వ్యక్తిత్వవికాసం. అంతేగానీ గుట్టలుగా డబ్బుపోగేసుకునే మార్గాలు కాదు.
Also read: విశ్వరూప సందర్శనం