- సప్తప్రతిభామూర్తి, మహాశక్తిసమన్వితుడు
- తల్లిదండ్రుల నుంచి అందుకున్న గాత్ర సంపద, సారస్వత సంస్కారం
మనమంతా ముద్దుగా పిలుచుకొనే బాలు పుట్టినరోజు జూన్ 4 వ తేదీ. చాలామందికి ఈ తేదీ గుర్తే ఉంటుంది. బాలును మరచిపోవడం సాధ్యమా? పాట ఉన్నంత కాలం, మాట ఉన్నంత కాలం ఆయన ఉంటారు. బాలు జీనియస్! పదహారణాల ఆంధ్రుడు, పదునారు కళల పరిపూర్ణుడు, బహుప్రతిభా భాస్వంతుడు, ఆ బహు ప్రతిభాసంపత్తిని ఒకమారు పరికిస్తే పులకిత గమకిత గాత్రులమవుతాం. అతని మొదటి ప్రతిభ ‘గ్రహణశక్తి’. ఏ అంశాన్నైనా వినిన వెంటనే, తెలుసుకున్న వెనువెంటనే అద్భుతంగా గ్రహించే లక్షణం. రెండో ప్రతిభ అసాధారణమైన ‘ధారణ’. అంటే జ్ఞాపకశక్తి. మూడోప్రతిభ ‘నటకౌశలం’. నాలుగో ప్రతిభ ‘అనుకరణ’. ఒక దృశ్యాన్ని, ఒక భావాన్ని, ఒక వ్యక్తిని అవలీలగా పునః ప్రతిష్ఠ చేయగలిగిన గొప్ప అనుకరణ శక్తి బాలు సొంతం. అది ధ్వని రూపంలో, వ్యక్తీకరణ రూపంలో, నటనా రూపంలో, పలు విధాలుగా సాగుతాయి. ఐదో ప్రతిభ అద్భుతమైన ‘గానం’. ఆరో ప్రతిభ’ స్వర రచన’. ఎన్నెన్నో గొప్ప పాటలకు గొప్ప సంగీతాన్ని అందించిన దర్శకత్వ ప్రతిభ ఆయన సొత్తు. ఏడోప్రతిభ ‘వాయిద్య విన్యాసం’. అనేక సంగీత వాయిద్యాలను అలవోకగా వాయించగలిగిన నాదమయ ప్రజ్న. ఇలా సప్త ప్రతిభలు సహజంగా ధరించిన ‘శక్తి’ స్వరూపుడుగా మనం బాలుని అభివర్ణించి తీరాలి.
ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం కలిస్తేనే ‘మహాశక్తి’ అవుతుంది. సహజ ప్రతిభతో, సమయోచితమైన అభ్యాసంతో, వ్యుత్పత్తిని (పాండిత్యం) సాధించిన రసజ్ఞ ప్రజ్ఞాధురీణుడు మన బాలుడు. తల్లిదండ్రుల నుంచి అద్భుతమైన సారస్వత సంస్కారాన్ని, గాత్ర సంపదను అందుకున్నారు. బాలుతండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తికి హరికథకులుగా ఆ కాలంలో గొప్ప పేరు. నెల్లూరులో ఆయన బిక్షాటనా పూర్వక త్యాగరాజ ఆరాధనలు నిర్వహించిన తీరు అమృతప్రాయం. వీటన్నిటిని బాలసుబ్రమణ్యం చిన్నప్పటి నుంచి పరిశీలించారు. పరికించడమే కాదు, ఆ సంస్కారాన్ని తండ్రి నుంచి వంట పట్టించుకున్నారు. బాలు పూర్వీకుల సొంత ఊరు ప్రకాశం జిల్లాలోని మాచవరం. అమ్మగారిది కోనేటంపేట. ఇది తెలుగువాళ్ళు, తమిళులు కలిసిమెలిసి ఉండే గ్రామం. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ ఊరు ఉంది. ఇది ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతం. ఇక్కడే ఈ బాలుడు పుట్టాడు. తండ్రి శైవ ఆరాధ్యులు, తల్లి 6000 నియోగులు. నేను ‘అర నియోగిని’ అంటూ బాలు చమత్కరిస్తూ ఉండేవారు. ఈ వైయుక్తిక అంశములను అలా ఉంచితే, బాలు నూటికి నూరు శాతం యోగి. గొప్ప యోగబలంచే జన్మించిన గొప్ప జన్మ ఆయనది. బాలు మ్యాథమెటిక్స్ లో ఎంతటి ప్రజ్ఞావంతుడో, సైన్స్ సబ్జక్ట్స్ లోనూ అంతే ప్రతిభ కల్గినవారు. మాథమాటికల్ థింకింగ్ సైంటిఫిక్ అప్రోచ్, ఈస్తటిక్ సెన్స్ ఆయనకు సహజ ఆభరణాలుగా భాసిల్లేవి. ఇవన్నీ తాను ఎంచుకున్న రంగంలో శిఖరసమానుడుగా ఎదగడానికి అద్భుతమైన నిచ్చెనలను వేశాయి. బాలుప్రతిభను ప్రత్యక్షంగా దర్శించే సౌభాగ్యం ఈ రచయితకు 20ఏళ్ళ క్రితం దక్కింది. రావి కొండలరావు దర్శకత్వంలో, గొల్లపూడి మారుతిరావు గిరీశం పాత్రగా ‘కన్యాశుల్కం’ సీరియల్ నిర్మించే సందర్భంలో మా ఇద్దరికీ మొట్టమొదటగా వ్యక్తిగత పరిచయం ఏర్పడింది. తదాదిగా వికసించి, క్షణక్షణ ప్రవర్ధమానమై విలస్లిలింది.
Also read: శతాధిక సార్వభౌముడు ఎన్ టీ ఆర్
గొప్ప సహస్రావధాని కాగల ధారణశక్తి
‘కన్యాశుల్కం’ కోసం ఒక శీర్షికా గీతం రాయించాల్సి వచ్చింది. ఆకాశవాణి ప్రయోక్త రాంభట్ల నృసింహశర్మ ఆ గీతాన్ని రాశారు. ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ స్వరకల్పన చేశారు. అది చాలా పెద్ద పాట. “తెలుగు కథకు శ్రీకారం- మెరిసే ముత్యాలసరం- అక్షరాల అడుగుజాడ -అతనే మన గురజాడ”- ఇలా సుదీర్ఘంగా సాగుతుంది. పాడటానికి బాలు వైజాగ్ లోని ఒక స్టూడియోకు వచ్చారు. ట్రాక్ సింగర్ నుంచి ఆ పాట కేవలం రెండు సార్లు మాత్రమే విన్నారు. అంతే!! అలవోకగా, అవలీలగా, పరమాద్భుతంగా ఆ పాట పాడేశారు. ఆయన పాడుతూ ఉంటే? అక్కడున్నవారికి ఒళ్ళు గగుర్పొడిచింది. కళ్ల నుంచి ధారాపాతంగా ఆనందభాష్పాలు రాలాయి. అదీ ప్రతిభ! అద్గదీ రసప్రవాహం! ఆయన పద్యసాహిత్య రంగంలోకి వచ్చి ఉంటే గొప్ప సహస్రావధాని అయ్యిఉండేవారు. అంతటి ధారణాబలం ఆయనది. అంతే స్థాయి భావప్రకటనా ప్రతిభ. రసప్లావితంగా పాడే గానమయప్రజ్ఞ గురించి ఇక చెప్పనక్కర్లేదు. బాలుతో ప్రత్యక్ష అనుభవాలు వున్నవారందరికీ ఆ విషయాలు, ఆ విశేషాలు బాగా తెలుసు. బాలు పూర్తిస్థాయి నటుడుగా చేసి ఉంటే? మనకొక మరో మహానటుడు సొంతమై ఉండేవాడు. ఆ చేతికి కవితామయ శక్తి కూడా ఉంది. అది అప్పుడప్పుడు దర్శనమవుతూ ఉంటుంది. ప్రయోక్త ప్రతిభ కూడా అట్టిదే. బాలును జ్ఞానపీఠాధిపతులు డాక్టర్ సి.నారాయణరెడ్డి ప్రయోక్తగా మారిరమ్మని స్వాగతించారు. ప్రయోక్తగా మారినప్పుడు బాలు విన్యాసం కని విని తీరాల్సిందే. ‘ప్రతిభ’ నవ నవోన్మేషశాలిని, అంటారు కదా? ఆ వాక్కులు ప్రవహిస్తున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు ఒక పదానికి మించిన పదం ఇంకొకటి వచ్చి చేరుతూ ఉండేది. అది వాగ్వైఖరీ ప్రతిభ. బాలు గానంలో ముఖ్యంగా హాస్య, శృంగార, వీర రసాలు పరమోన్నతంగా ఆవిష్కారమవుతాయి. స్నేహశీలం,ప్రేమతత్వం, కృతజ్ఞత, దాతృత్వం పితృదేవతల నుంచి వరాలుగా పొందిన సద్గుణ సంపన్నుడు బాలు. తోబుట్టినవారితో పాటు స్నేహితులకు,ఆత్మీయులకు తన ప్రేమను, చేయూతను విరివిగా పంచిన సంగతి తెలిసినవారికి తెలుసు. సహనాన్ని ఎంతగానో సాధన చేశారు. అట్లే కోపాన్ని జయించారు. కోట్లాది హృదయాలను కొల్లగొట్టారు. భౌతికంగా తొందరగా వెళ్లిపోయి మన గుండెలు పిండేశారు. బాలును తలచుకున్నప్పుడల్లా కన్నీళ్లు ఆగవు. ఆ ప్రతిభా ‘మణి’కి, ఆ రసధునికి, ఆబాలగోపాల’ బాలు’నికి, ఆ గానానంద,జ్ఞానానంద స్వరూపునికి, పామర, పండితారాధ్యుని దివ్యస్మృతికి వందన శతాలు సమర్పిద్దాం. రస సిద్ధుడుగా సుప్రసిద్ధుడైన బాలు ‘చిరంజీవి’.
Also read: అమ్మకు ఒకరోజు!
(జూన్ 4 బాలసుబ్రహ్మణ్యం జయంతి)