ఇది దారి
గతి తప్పిన రైలు దారి
నరకానికి రహదారి !
దారి పొడుగు నా
యముడి మహిషపు లోహ గంటలే ధ్వని !
చెట్టా పట్టా లేసుకొని
సాగాల్సిన జీవితాలు
పట్టాల పై చెల్లా చెదురై
ఎవరి పాపమో
జీవితాలకు శాపమై !
నేతల
మొసలి కన్నీరు
క్షత గాత్రుల కన్నిటితో
పోటి!
భద్రత లోపమో
మానవ తప్పిదమో
ఛిద్ర మైన జీవితాలకు
వెల కట్ట గలమా?
నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారికి
ఒక్క ప్రమాదానికి
పదవి రాజినామా
ఇప్పటి గుండెలు ఎన్ని
జరిగినా చలించక
పదవినే చుట్టుకుంటాయి
మూలాల్ని సంస్కరించక పోతే
ఇదే కధ
చర్విత చర్వణమవుతుంది !
(ఒరిస్సా ఘోర రైలు ప్రమాదం చూశాక )
–వీరేశ్వర రావు మూల
04.06.2023
Also read: ఆంధ్రభూమి
Also read: డైన్ మైట్