Thursday, November 21, 2024

ఒంటరిగా, గంభీరంగా రాజందండంతో మోదీ

కొత్త పార్లమెంటు భవనానికి అట్టహాసంగా ప్రారంభోత్సవం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున యాగంతో ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం  ప్రధాని ప్రసంగంతో ముగిసింది.  భారత పార్లమెంటరీ చరిత్రలో ఇది ప్రధాన ఘట్టమనడంలో సందేహం లేదు. బ్రిటిష్ పాలకులు నిర్మించిన పాత పార్లమెంటు భవనం వీడి కొత్త పార్లమెంటు భవనంలోకి అడుగిడిన శుభసందర్భం మరింత కలుపుకోలుగా, సమష్టిగా, సద్భావనాపూర్వకంగా జరిగి ఉంటే బాగుండేది. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలన్న కాంగ్రెస్, తదితర పక్షాల నిర్ణయం సమజంసమైనదా, కాదా అన్నది చర్చనీయాంశం. కానీ ప్రతిపక్షాలను ఒప్పించి, రప్పించడానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నించలేదన్నది వాస్తవం. ఆయన ప్రయత్నించినా ప్రతిపక్షాలు మొండికేసి ఉంటే అప్పుడు నింద పూర్తిగా ప్రతిపక్షాలపైనే ఉండేది. కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించడం మంచిదే. కానీ అంతకన్నాఅవసరమైనదీ, ప్రాణప్రదమైనదీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవించడం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి గండికొట్టకుండా ఉండటం. ఈ దేశం అందరిదీ, ఈ పార్లమెంటు అన్ని పార్టీలదీ, కొత్త పార్లమెంటు దేశప్రజల ఆశలకూ, ఆకాంక్షలకూ అద్దం పడుతుందనే భావన ప్రోదికొల్పడం అత్యవసరం.

ఒక్క ప్రధాని, కొంతమంది తమిళనాడు నుంచి వచ్చిన పండితులూ, పూజారులూ, సన్యాసులే వేదికపైన కన్పించారు. కొద్ది దూరంలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా బిక్కుబిక్కుమంటూ, మరికొద్ది దూరంలో సంపూర్ణ విధేయత ప్రదర్శిస్తూ ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కనిపించారు. ప్రధాని ప్రసంగ సమయంలో రాజ్యసభ ఉపాధ్యక్షుడు దర్శనమిచ్చారు. తక్కినవారంతా ప్రేక్షకులే. కొత్త పార్లమెంటులో కూర్చొని ఫొటోలకు పోజులిచ్చిన అమిత్ షా, స్మృతి ఇరానీ, కిషన్ రెడ్డి, తదితరులు మోదీ అభిమానసంఘం సభ్యులు. మోదీ విమర్శకులు బయట ఉన్నారు. దాదాపు ఇరవై ప్రతిపక్షాలు కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఉత్సవ విగ్రహాలుగా చేసి ప్రధాని పెత్తనమంతా చెలాయిస్తున్నారని విమర్శించాయి.

ప్రారంభోత్సవం జరుగుతున్న సమయంలో దేశానికి కీర్తికిరీటాలు తెచ్చిన రెజ్లర్లు (పహిల్వాన్లు) కొత్త పార్లమెంటు సమీపంలోని జంతర్ మంతర్ లో పోలీసు యంత్రాంగంతో కుస్తీపడుతూ కనిపించారు. సాక్షీమల్లిక్ నినాదాలు చేస్తూ, ఆర్తనాదాలు చేస్తూ హృదయవిదారకంగా రోదించారు. పహిల్వాన్లపైన అవమానకరంగా వ్యవహరించారన్న ఆరోపణలు మోస్తున్న బ్రిజ్ భూషన్ సింగ్ కొత్త పార్లమెంటులో దర్జాగా కూర్చున్నారు. ఆయనపైన ఈగ వాలడానికి కూడా మోదీ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. వస్తాదులను అరెస్టు చేసి వారి నిరసన శిబిరాన్ని ఎత్తివేశారు. అదే విధంగా పార్లమెంటు సమీపంలో మహిళా పంచాయత్ జరపాలనే సంకల్పాన్ని కూడా అధికారులు వమ్ము చేశారు. ఈ  సమస్యలను పరిష్కరించవలసిన ప్రధాని వస్తాదుల గురించి ఇంతవరకూ మౌనం పాటించారు. ప్రతిపక్షాలు రాకపోవడమే మంచిది అన్నట్టుగా వారిని ఒప్పించడానికి వీసమెత్తు ప్రయత్నం కూడా చేయలేదు. పైగా ప్రతిపక్ష నాయకులను నిందించడంలోనే అధికార పార్టీ ప్రముఖులు రోజంతా గడిపారు. ముఖ్యంగా రవిశంకర్ ప్రసాద్ బాగా నోరు చేసుకున్నారు.  కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నట్టు ఇది మోదీ పట్టాభిషేకం లాగానే ఉన్నది కాని ప్రజాస్వామ్యసౌధం ప్రారంభోత్సవంలాగా లేదు.

గత తొమ్మిదేళ్ళలో మోదీ ఒక్కరే వేదికపైన కనిపిస్తూ వచ్చారు. కీలకమైన నిర్ణయాలన్నిటినీ మోదీనే ప్రకటించారు. విలేఖరుల గోష్ఠులుండవు. మన్ కీ బాత్ లు ఉంటాయి. పౌరహక్కుల నాయకులనూ, పత్రికాసంపాదకులనూ దుండగులు దారుణంగా హత్య చేస్తే ప్రధాని ఖండించరు. రాజస్థాన్ లో ఒక మతోన్మాది హిందూ మతస్థుడైన ఒక దర్జీ తల నరికినా ప్రధాని మౌనం వీడరు. కాశీ విశ్వనాధుడి గుడిలో కొత్తగా నిర్మించిన వరండాలో మోదీ ఒక్కరే పచార్లు చేస్తూ కనిపిస్తారు. రామాలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంలోనూ మోదీ ఒక్కరే ప్రధానంగా ఉంటారు. పార్లమెంటు భవనం శంకుస్థాపనలోనూ మోదీ ఒక్కరే. తక్కినవారు పురోహితులు లేదా సన్యాసులు. పెద్దనోట్ల రద్దును నాటకీయంగా ఆకస్మికంగా ఒక్కరే ప్రకటిస్తారు. కోవిద్ మహమ్మారి దేశంమీద విరుచుకుపడితే గంటలు వాయించమనీ, లైట్లు వేయమనీ ప్రధాని స్వయంగా దేశ ప్రజలకు సందేశం ఇస్తారు. శాస్త్రీయ అవగాహనకు పాతరవేస్తారు. కీలకమైన సందర్భాలలో మోదీ ఒక్కరే కనిపిస్తారు. తన పార్టీ నాయకులు కానీ, ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కానీ ఉండనే ఉండరు. అసలు సమష్టితత్త్వం లేనేలేదు. లోగడ ఇందిరాగాంధీకి నియంతగా వ్యవహరించారు. ఆత్యయిక పరిస్థితి ప్రకటించి దేశాన్నినిరంకుశంగా పాలించారు. కనీసం ఆమె విలేఖరుల గోష్ఠులలో మాట్లాడేవారు. ఆమె వెంట విధేయులైనా కొందరు ఇతర నాయకులు ఉండేవారు. ఒక్కరే అన్ని పనులు చేస్తూ కనిపించే ప్రయత్నం చేసేవారు కాదు. తన వెంట మరికొందరు నాయకులు ఉండాలని కోరుకునేవారు. ఆత్యయిక పరిస్థితి విధించడం సరైన నిర్ణయం కాదని ఆమె రెండేళ్ళలోనే గ్రహించి ఎన్నికలు జరిపించారు. మూల్యం చెల్లించారు. ఘోరపరాజయం చెందారు.  మోదీ అట్లా కాదు. తొమ్మిదేళ్ళు పూర్తవుతున్నా ఆయన నియంతృత్వ ధోరణులు మారడం లేదు. తానొక్కడే ఈ దేశాన్ని నడిపిస్తున్నారనే అభిప్రాయం ఆయనకు ఉన్నట్టు ప్రతి కదలిగా స్పష్టం చేస్తున్నది. అమిత్ షా కానీ, నితిన్ గడ్కారీ కానీ మరెవరైనా కానీ తన సరసన ఉండటానికి వీలులేదు. ప్రతిపక్షాలు సరేసరి. అందరూ ప్రేక్షకులే. అందరూ భజనపరులే. మోదీ ఒక్కరే కర్త, కర్మ, క్రియం. ఆయనపైనే కెమేరాల ఫోకస్. న్యూస్ చానళ్ళ, పత్రికల గురి. ఇందిరా ఈజ్ ఇండియా అని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ బారువా అంటే అందరం ఆక్షేపించాం. ఇప్పుడు మోదీ ఈజ్ ఇండియా అనే విషయాన్ని నిర్ద్వంద్వంగా మాటలలో కాకుండా చేతలలో చాటుతున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం.

ఈ కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం నిజానికి రాష్ట్రపతి చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది. ఆమె రాజ్యానికి అధిపతి. ప్రధాని ప్రభుత్వ  నిర్వహణ బృందంలో ప్రథముడు. క రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం లేదు. ఆమె పేరుతో విడుదలైన ప్రకటనను రాజ్యసభ ఉపాధ్యక్షుడు చదివి వినిపించారు. ప్రధాని ప్రారంభోత్సవం చేయడం సమంజసంగా ఉన్నదనీ, తాను ఇందుకు సంతోషిస్తున్నాననీ రాష్ట్రపతి తన సందేశంలో తెలియజేశారు. ఉపరాష్ట్రపతిని కూడా ఆహ్వానించలేదు. ఆయన సందేశాన్ని కూడా రాజ్యసభ ఉపాధ్యక్షుడు చదివి వినిపించారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్  కోవింద్ ను ఆహ్వానించారు. ఆయన మాజీ ప్రధాని దేవెగౌడ సరసన మొదటి వరుసలో కూర్చున్నారు.

ప్రధాని మోదీ రాజదండం పట్టుకొని సగర్వంగా, గంభీరంగా అడుగులు వేస్తున్న తరుణంలో జంతర్ మంతర్ లో రెజ్లర్ల హక్కులను కాలరాస్తూ పోలీసులు బరితెగించారు. మహిళలు తమపైన అత్యాచార యత్నం జరిగిందని మొత్తకుంటూ ఉంటే, నెలరోజులకు పైగా జంతర్ మంతర్ లో ప్రదర్శనలు ఇస్తూ ఉంటే ఆ సమస్య గురించి నోరు మెదపని ప్రధాని మన్కీ బాత్ ల వల్ల ప్రయోజనం ఉంటుందా? ఇది ఒక దేశ ప్రధాని వ్యవహరించవలసిన పద్ధతేనా?

భవ్య, దివ్య అనే మాటలను ప్రధాని మాటమాటకీ ఉపయోగించడం, హిందూమతానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం, రాజదండం మహాపవిత్రమైన  వస్తువన్నట్టు పట్టుకోవడం, దానికి సాష్టాంగ ప్రణామం చేయడం సనాతన ధర్మం విలసిల్లిన కాలాన్ని గుర్తు చేసింది. ధార్మికాంశాలు చట్టసభలకు దూరంగా ఉండాలన్న రాజ్యాంగ నియమాన్ని పక్కన  పెట్టారు. సెంగోల్ (రాజదండం) సనాతన ధర్మాన్ని నిలబెడుతుందని మోదీ అనుకూల చానళ్ళు ఉద్ఘోషించాయి.

సింగోల్ గురించీ, సావర్కర్ గురించీ అర్ధసత్యాలను సంపూర్ణ సత్యాలుగా చెలామణి చేయడానికి కంకణబద్ధుడైన ప్రధాని, ఆయన సహచరులూ కొన్ని రోజులుగా అదే పని మీద ఉన్నారు. ఉంటారు. సింగోల్ నెహ్రూకు వాకింగ్ స్టిక్ గా ఉపయోగపడిందని నిందలు వేస్తున్నారు. అలహాబాద్ లో ఒక మ్యూజియంలో ఆ సెంగోల్ పడి ఉన్నదని చెబుతున్నారు. దాన్ని తమిళ పండితులు తీసుకొని వచ్చి నరేంద్రమోదీకి ప్రసాదించారు. బ్రిటిష్ వలసపాలకులతో రాజీపడి, క్షమాపణ పత్రాలు రాసిన సావర్కర్ ను ఆత్మగౌరవానికి ప్రతీకగా మోదీ ప్రస్తుతించడం విడ్డూరం. సావర్కర్ బ్రిటీష్ వలస పాలకులను వ్యతిరేకించి,వారిపైన దాడులు నిర్వహించినంతవరకూ వదాన్యుడేననీ, అండమాన్ జైలులో అర్నెళ్లు ఉన్న తర్వాతా ఆయనవైఖరి మారిందనీ నిజం చెప్పి ఉంటే ఆయనకు ఏమీ లోటు రాదు. గాంధీనీ, నెహ్రూను పూర్వపక్షం చేసి సావర్కర్ ను నెత్తిన పెట్టుకోవడం అనవసరం.

ఈ కార్యక్రమంలో మహిళలు కనిపించరు. అందరూ సంత్ లూ, సన్యాసులే  కనిపిస్తారు. పాత పార్లమెంటు భనవం బానిస వాసనలు ఉన్నాయంటూ బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. అదే భాషను మోదీ మీదియా ప్రతినిథులు కూడా ఉపయోగించారు. నరేంద్రమోదీ ఒంటరిగా భారత దేశంలో వ్యవహారం నడిపిస్తున్నారనడానికీ, ఒంటి చేత్తో రాజ్యం చేస్తున్నారనడానికి కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం జరిగిన తీరు తాజా నిదర్శనం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles