Sunday, November 24, 2024

చైనాతో ద్వైపాక్షిక సంబంధాల పెంపునకు రాజీవ్ కృషి

రాజీవ్  గాంధీ హత్య కారణంగా ఆయన రాజకీయాల వ్యవధి తగ్గింది కానీ ప్రధానమంత్రిగా పని చేసిన అయిదేళ్ళలో బోఫోర్స్ వంటి ఆరోపణలు ఉన్నప్పటికీ విదేశాంగవిధానంలోనూ, రక్షణ విధానంలోనూ గొప్ప విజయాలు సాధించారు. రాజీవ్ గాంధీ బీజింగ్ వెళ్ళినప్పుడు ఆయన వెంట నాటి విదేశాంగమంత్రి పీవీ నరసింహారావు కూడా ఉన్నారు. కానీ చైనా అధినేత డెంగ్ సియావో పింగ్ ను రాజీవ్ కలుసుకున్నప్పుడు తాను కూడా రాజీవ్ వెంట ఉండాలని పీవీ కోరుకున్నారు. కానీ రాజీవ్, డెంగ్ ఇద్దరే ముఖాముఖి మాట్లాడుకున్నారు. చైనా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు డెంగ్ ను చూడాలన్న పీవీ కోరిక తీరనేలేదు.

అలీనోద్యమాన్ని బలోపేతం చేయడం, వర్ణవివక్షను తొలగించడం, ఇరుగుపొరుగు దేశాలతో సఖ్యత పెంచుకోవడం, స్వావలంబన సాధించడంపైన రాజీవ్ దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా చైనాతో స్నేహాన్ని పునరుద్ధరించుకోవడానికి రాజీవ్ తీసుకున్న చొరవ, దానిని పీవీ నరసింహారావు పొడిగించిన నేర్పు చరిత్రాత్మకం. నేటి మోదీ ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాలతో  ఈ  రోజు చైనా, ఇండియా శత్రుదేశాలుగా తయారైనాయి.  చైనాతో,  పాకిస్తాన్ తో, శ్రీలంకతో స్నేహ సంబంధాలు విస్తరించడానికి రాజీవ్ ఏకాగ్రదీక్షతో కృషి చేశారు.

రాజీవ్ పర్యటనకంటే ముందు సరిహద్దు సమస్యపైన రెండు దేశాలు పట్టుపట్టి కూర్చున్నాయి. కానీ సరిహద్దు సమస్యను పక్కన పెట్టి ఇతర రంగాలలో మైత్రీసంబంధాలను విస్తరించుకోవాలని యువనాయకుడు రాజీవ్ గాంధీ ప్రతిపాదించారు. రాజీవ్  గాంధీ అయిదు రోజుల చైనా పర్యటన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 1988 డిసెంబర్ లో జరిగిన ఈ పర్యటన ఆసియా దేశాలలో అత్యంత ప్రధానమైన రెండు పెద్ద దేశాల మధ్య సంబంధాలను పునర్నిర్వచించింది. చైనా అధినేత డెంగ్ సియావో పింగ్ రాజీవ్ తో కరచాలనం చేస్తూ చాలా సేపటి వరకూ చేతులు పట్టుకొని ఊపుతూనే ఉన్నారు. మైయంగ్ ఫ్రెండ్ అని రాజీవ్ గాంధీని డెంగ్ సంబోధించారు. డెంగే ముందుగా విలేఖరుల గోష్టిలో చొరవతీసుకొని రాజీవ్ గాంధీ చేతులు పట్టుకొని ఊపుతూనే ‘గతం విస్మరిద్దాం. మీరు యువకులు. మీరే భవిష్యత్తు. మేము చరిత్ర గర్భంలో కలిసిపోతున్నాం. ఇప్పుడు కొత్తతరం నాయకులు వచ్చారు. ఘర్షణలు, శత్రుభావం తగ్గించుకొని శాంతిసుస్థిరతలను పెంపొందించుకోవాలని కొత్తతరం కోరుకుంటున్నది,’’ అని అన్నారు.

ముప్పయ్ నాలుగేళ్ళ తర్వాత చైనాను సందర్శించిన తొలి భారత ప్రధాని రాజీవ్. ఆయన తాతగారు జవహర్ లాల్ నెహ్రూ 1954లో చైనా సందర్శించినప్పుడు పది లక్షల మంది ప్రజలు వీధులలోకి వచ్చి స్వాగతం చెప్పారు.  21 డిసెంబర్ 1988న క్విన్గ్ హువా విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ రాజీవ్ గాంధీ భారత స్వాతంత్ర్యం, చైనా విమోచన వల్ల ప్రపంచంలో సంభవించిన మార్పుల గురించి ప్రస్తావించారు. చైనాతో జవహర్ లాల్ నెహ్రూ ఆశించిన స్నేహం మానవనాగరికతను మార్చేవేసేది అని అన్నారు.

  సరిహద్దు సమస్యకు సామరస్య పూరితంగా పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉన్నదని చెబుతూనే, పరస్పర విశ్వాసం, అవగాహన పెరిగినప్పుడే అది సాధ్య అవుతుందని వ్యాఖ్యానించారు.

బీజింగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జిన్ డిన్ఘాన్ రాజీవ్ తో ‘‘నేను మీ తాతగారిని 1954లో కలుసుకున్నాను. మీ అమ్మగారిని 1983లో కలుసుకున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయనే నమ్మకం నాకు ఉంది’’ అని అన్నారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఈ ప్రొఫెసర్ చాలా మనస్తాపం వెలిబుచ్చారు. ప్రపంచ శాంతికి దోహదం చేసే నాయకుడు చనిపోయారంటూ విషాదం వెలిబుచ్చారు. రాజీవ్ తర్వాత పీవీ, వాజపేయి, మన్మోహన్ సింగ్ లు చైనాను సందర్శించారు. రెండు దేశాల మధ్య సంబంధాల పెరుగుదలకు కృషి చేశారు. 1993లో పీవీ చైనా సందర్శన సందర్భంలో సరిహద్దులో శాంతి, స్నేహ ఒప్పందం (బార్డర్ పీస్ అండ్ ట్రాక్విలిటీ అగ్రీమెంట్)ను కుదుర్చుకున్నారు. 2012లో మన్మోహన్ సింగ్ వెళ్ళినప్పుడు భారత-చైనా సరిహద్దు వ్యవహారాల సలహాసంఘం నియామకం ఖరారు చేశారు.

ప్రధానిగా నరేంద్రమోదీ వచ్చిన తర్వాత ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు చెడిపోయాయి. ముఖ్యంగా 2019లో రెండో సారి విజయం సాధించిన అనంతరం పొరుగుదేశాలతో సంబంధాలు క్షీణించాయి. చైనాతో గాల్వాన్ లోయలో 15 జూన్ 2020లో సరిహద్దు ఘర్షణ జరిగింది. ఇరవై మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చైనా అదనంగా 2000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నది. ఇప్పటికీ ఆ భూభాగం చైనా అధీనంలోనే ఉన్నది.

(మే 21 రాజీవ్ వర్థంది)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles