వోలేటి దివాకర్
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పొరుగున ఉన్న కర్నాటక ఎన్నికల ఫలితాలు…ఇటీవల జన సేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రాకు మధ్య రాజకీయాలను పోలిక పెట్టాలన్న ఆలోచన వచ్చింది. కర్నాటక రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ జెడి-ఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. అదే తరహాలో ఎపి రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని జనసేన పార్టీ (జెఎస్పీ) ఉవ్విళ్లూరుతోంది. జెడి-ఎస్ కర్నాటకలోని దాదాపు 15శాతం పైగా ఓటు బ్యాంకు ఉన్న ఒక్కళిగ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అలాగే ఎపిలో కూడా దాదాపు అంతే ఓటు బ్యాంకు కలిగిన కాపులు ప్రస్తుతం జనసేన పార్టీని తమ పార్టీగా భావిస్తున్నారు. ఎన్నికల పొత్తులు, సంకీర్ణ రాజకీయ సమీకరణాల కారణంగా జెడి-ఎస్ కింగ్ మేకర్ గా మారి, కర్నాటకలో పలుసార్లు ముఖ్యమంత్రి పదవిని కూడా అధిష్టించగలిగింది.
అయితే, కర్నాటకలో సుమారు 20 శాతం ఉన్న లింగాయత్ వర్గం, వారి పాత్ర ఎంతో కీలకమైంది. అందుకే ఎన్నికలకు ముందు అన్ని పార్టీలూ లింగాయత్ లను ఆకట్టుకునేందుకు అనేక విన్యాసాలు చేశాయి
ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం చేసిన మైసూరు ప్రాంతంలో కూడా బిజెపి అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. అంటే లింగాయత్ ల ఐకమత్యం ముందు మోడీ కరిష్మా, జై బజరంగ్ బలీ నినాదాలు… ఆర్థిక, అంగ బలాలు బిజెపిని గెలిపించలేకపోయాయని కర్ణాటక ఫలితాలు సూచిస్తున్నాయి. ఇతర అంశాలు ఎలా ప్రభావితం చేసినా ముఖ్యంగా లింగాయత్ ల మద్దతు ఇవ్వడం వల్లే కాంగ్రెస్ పార్టీ 135 సీట్ల భారీ మెజారిటీతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. ఈ ఎన్నికల్లో ఎన్ని శక్తుయుక్తులు ఒడ్డినా …కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా సరే మరోసారి బిజెపి కర్నాటకలో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
పవన్ పవర్ లోకి వస్తారా?
ఇటీవల పవన్ కల్యాణ్ మాట్లాడుతూ…తమ బలాన్ని నిరూపించుకుని సిఎం పదవిని ఆశించడంలో తప్పులేదని, గత ఎన్నికల్లో 30-40 సీట్లు గెలిస్తే వచ్చే ఎన్నికల్లో సిఎం పదవిని డిమాండ్ చేసే అధికారం ఉండేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజీపీతో పొత్తులు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని లింగాయత్ ల తరహాలో ఎపిలోని కాపులు పవన్ కల్యాణ్ ను ఆదరిస్తారా?… కాపులు ఆశిస్తున్న విధంగా పొత్తులు, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జన సేనాని కింగ్ మేకర్ గా మారి పవన్ అధికార పీఠాన్ని అధిరోహిస్తారా? అన్నది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. కాపులు లింగాయత్ లాగా ఆలోచించి పవన్ ను ఆదరిస్తే ఎపిలో జెస్పీ మరో జెడి-ఎస్ గా మారుతుందనడంలో సందేహం లేదు. అయితే అప్పటి వరకు పవన్ తన పార్టీని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది.