Sunday, December 22, 2024

ఇంకా తెల్లవారని రాత్రుళ్ళు

వ్యంగ్యం

పొద్దున్నే నిద్దర్లో కలవరించడం మొదలు పెట్టాడు కరుణాకరం.

అలనాడెప్పుడో నిన్ను అడవిలో వదిలేసి  రమ్మన్నాను కదా లక్ష్మణుడ్ని?

ఎంత మోసం? ఎంత మోసం? అన్న మాటనే ధిక్కరిస్తాడా? అన్నయ్యది తమ్ముడయ్యది, దున్నయ్యది, ఎవరైతేనేం, ఇది క్షమించరాని నేరం. ప్రజాభీష్టాన్ని నేరవేర్చలేని  ప్రభువుకి రాజ్యం ఉంటేనేం… లేకపోతేనేం? నిన్ను అడవికి పంపలేనప్పుడు నేనే అడవికి పోయి పంచభక్ష్య పరమాన్నాల్ని వదిలేసి, కందమూలాలు తింటూ బ్రతుకుతాను’’ అని ఉన్నపళంగా  అడవికి బయలుదేరాడు.

Also read: దరిద్ర నారాయణులకు దండాలు!

ఇది కలయో నిజమో తేల్చుకోలేక సీత మంచం మీద మోకాళ్ళని మడుచుకొని, ఆ మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని ఏడ్చింది.

సీత ఏడుపు విని నిద్రలేచి పోయాడు కరుణాకరం. కానైతే అతని కలలోని రాముడు అతనిలో పాటూ ఇలలోకి దిగిపోయాడు.

‘‘ఎందుకేడుస్తున్నావు సీతా’’ అని అడిగాడు.

‘‘లక్ష్మణుడు నన్ను అడవిలో వదిలెయ్యలేదని, మే తిరిగి అడవికి వెళతానంటున్నారు. నిద్దురలో మీకేమైనా ఆ రాముడు పూనాడా?’’ అని అడిగింది.

Also read: ఓటుకు జబ్బు చేసింది!

‘‘రాముడు పూనడమేంటి? నేనే నీ రాముడ్ని. ఆ మాటకొస్తే ప్రజలందరికీ నేనే రామున్ని. ప్రజాభీష్టాన్ని పాటించడమే రాజధర్మం. అందుచేతే నేనీ క్షణమే నిన్ను వదిలేస్తున్నాను. కాదని నిన్ను ఏలుకొంటే రాజ్యాన్నికోల్పోతాను. రేపటి ఎన్నికల్లో నాకు ఓటెయ్యడం సంగతి అలాగుంచి నా మొహాన కాండ్రించి ఉమ్మెయ్యడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు.

‘‘భార్యనైనా ఒగ్గెయ్యవచ్చు కానీ, రాజ్యాన్ని వదులుకో కూడదని ఆనాటి నించీ ఈ నాటి వరకూ నేను ఒట్టేసి చెబుతున్నాను. సీతా! ఆ రాముడుగా నాడు నిన్ను వదిలేసినా, ఈ రాముడుగా నిన్ను కాదన్నా, అది మన సుఖానికే, ఈ రాజ్యం, ఈ సౌభాగ్యం మన కోసం, మన బిడ్డల కోసమే కదా?’’

‘‘అయ్యో…అయ్యో…వద్దంటే ఈ ఎన్నికల బరిలో దిగారు. మొగుడు చచ్చినదాన్లా బొట్టూ, కాటుకా, మంగళసూత్రాలు తీసేసి బ్రతకొచ్చు. మొగుణ్ణి వదిలేసిన దాన్లా వీరవనితలా బ్రతకొచ్చు. కానీ మొగుడొదిలేసిన దాన్లా అవమానంతో బ్రతకలేను. అందుచేత మిమ్మల్ని చంపి, మీ టికెట్ మీద నే పోటీచేసి, మీ ప్రత్యర్థుల కోరిక నెరవేరుస్తాను’’ అని పొద్దున్నే సలసలా కాగుతున్న వేడి టీ నీళ్ళు తీసుకొచ్చి అతని మొహాన పోసింది సీత.

Also read: కార్పొరేట్ హ్యూమన్ ఫేస్

ఆ దెబ్బతో నిద్రమత్తు కాస్తా వదిలిపోయింది కరుణాకరానికి. లేచి పరిగెట్టుకొంటూ వెళ్ళి చన్నీళ్ళతో మొహం కడుక్కొని, ‘నీ మొహం మండా. నీకేం పోయేకాలం వచ్చింది’’ అని భార్యతో ‘‘సీతలేని రాముణ్ణి ప్రజలు ఆదరించారు. ఇంతటితో నాకూ, నీకూ చెల్లు. నేను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు బ్రహ్మచర్యం పాటిస్తాను’’ అని భార్యమీద అలిగి ఇల్లొదిలిపెట్టాడు.

ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో పోటీ చేశాడు.

‘‘నేను రావణాసురుణ్ణి చంపాను. రావణాసురుడి సైన్యాన్ని వధించాను. ఆనాడు మీరంతా వానరులై సహాయపడ్డారు. ఇంకా రావణకాష్టం కాలుతూనే ఉంది. ఆ రావణాసురిడి వారసులు మిగిలే ఉన్నారు. మిగిల్నవారందరినీ సంహరించాలంటే పామరులైనమీరు నాకు ఓట్లేసి గెలిపించండి. మీ సహాయంతో రావణాసురుడి వారసులు లేకుండా చేస్తాను. అప్పుడే మీరనుకొన్న, మీరు కోరుకున్న రామరాజ్యం వస్తుంది. మీ సహాయంతో ఇప్పుడు నేను సీతని చెరనించి విడిపించాను. ఇప్పుడు మీ కోసం సీతని వదులుకొంటున్నాను’’ అని జనాంతికంగా సీతకి విడాకులిచ్చాడు కరుణాకరం.

అది విన్న పామరులకి జాలేసింది.

రాజుల కష్టాలు రాజులకీ, పీతల కష్టాలు పీతలకీ ఉంటాయి. తప్పవు అనుకున్నారు.

ఆకలితో ఇంకా తెల్లవారలేదేంటబ్బా అని ఓ కోడి పైకెక్కి కూసింది. అయినా ఇంకా ఎందుకో తెల్లారలేదు?

Also read: కమ్యూనిస్టు గాడిద

Krishna Rao Nandigam
Krishna Rao Nandigam
నందిగం కృష్ణారావు ప్రముఖ నవలా రచయిత, కథకుడు. ప్రఖ్యాత న్యాయవాది. మొబైల్: 93930 33345

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles