వోలేటి దివాకర్
మీడియా మొఘల్ రామోజీరావుకు చెందిన మార్గదర్శి సంస్థలపై న్యాయపోరాటం ప్రారంభించిన తరువాత ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి చెందిన రామోజీరావు వీరభక్తులు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పై ‘‘ఆయనకేమీ పని లేదా?… ఫిర్యాదులు లేకుండా చక్కగా నడుస్తున్న మార్గదర్శిపై పడ్డారు. జగన్ పాలనలో ఆయనకు తప్పులు కనిపించడం లేదా?’’ అంటూ విరుచుకుపడుతున్నారు. దీనిపై స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం విలేఖర్ల సమావేశంలో స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ‘నాకు పని లేదని… చట్టవిరుద్ధంగా నడుస్తున్న మార్గదర్శి వ్యవహారానికి ముగింపు పలకడం….. రాష్ట్ర విభజన ద్వారా ఎపికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు న్యాయపోరాటాన్ని కొనసాగించడమే తన పని’ అని స్పష్టం చేశారు. ఆ తరువాతి నుంచి తాను ఎలాంటి అంశాలపైనా స్పందించనని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా వైఎస్సార్సిపి విఫలమైందని, అందుకే తాను టిడిపి పాలనా విధానాలను ఎక్కువగా విమర్శించాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు అధికార వైసిపి ప్రభుత్వాన్ని టిడిపి దీటుగా ఎదుర్కొంటోందని వివరించారు.
Also read: జనసేనను బ్రష్టుపట్టిస్తున్న టిడిపి?!
సారా కేసు త్వరలో వివరిస్తా
మార్గదర్శిపై పోరాటం ప్రారంభించిన తరువాత 1996లో తనపై నమోదైన సారా కేసును సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ట్రోల్ చేస్తున్నారని, ఆసక్తి కరమైన ఈకేసును త్వరలో ప్రజలకు వివరిస్తానన్నారు. ఈ కేసులో దేశ చరిత్రలోనే అరుదుగా జరిగే సాయంత్రం 6 తరువాత సెంట్రల్ జైలును తెరిచి, తనను జైలుకు తరలించారన్నారు. గతంలో గుర్తేడులో ఐఏఎస్ అధికారుల కిడ్నాప్ సందర్భంగా నక్సలైట్ల డిమాండ్ మేరకు సాయంత్రం 6 తరువాత జైలు తెరిచి నక్సలైటును విడుదల చేశారన్నారు. ఆతరువాత తన కేసులోనే జరిగిందన్నారు. మార్గదర్శి వ్యవహారాన్ని 1980 దశకంలో పెద్దఎత్తున జరిగిన బ్రాకెట్ వ్యాపారంతో పోల్చారు. దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల టర్నోవర్లో నడిచిన బ్రాకెట్ వల్ల రిక్షా కార్మికుడి స్థాయి నుంచి ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయేవారని, అది గుర్తించిన నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు బ్రాకెట్ను నిషేధించారని గుర్తుచేశారు. బ్రాకెట్ పై ఎవరూ ఫిర్యాదు చేయలేదని అయినా చర్యలు తీసుకున్నారన్నారు. మార్గదర్శి లాంటి సంస్థలు తప్పులు చేస్తే వ్యవస్థలు గాడి తప్పి చిన్నా చితకా ఆర్థిక సంస్థలు సామాన్య, మధ్య తరగతి ప్రజల జేబులు కొల్లగొట్టే అవకాశం ఉంటుందన్నదే తన ఆందోళన అని ఉండవల్లి అన్నారు. తనకు వ్యక్తిగతంగా రామోజీరావుపై ఎలాంటి ద్వేషం లేదని పునరుద్ఘాటించారు.
Also read: పిన్న వయస్సులోనే పిహెచ్.డి పూర్తి చేసిన టిటి క్రీడాకారిణి
ఆ కోరిక ఉండిపోయింది!
తనకు రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించాలని, ఒక్కసారైనా రామోజీరావుతో మార్గదర్శి అంశంపై చర్చించాలన్న కోరిక ఎప్పటి నుంచో తీరకుండా ఉండిపోయిందని ఉండవల్లి వెల్లడించారు. రామోజీరావుతో కాకపోయినా కనీసం ఆయన సమక్షంలో చర్చ జరిగితే చాలన్నారు. ఇందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చొరవ చూపించాలని కోరారు.
వచ్చే నెలలో మార్గదర్శిపై టిడిపితో చర్చ
మార్గదర్శి వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ చర్చకు సిద్ధమైందని ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. టిడిపి అధికార ప్రతినిధి, న్యాయవాది జివి రెడ్డి హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్లో తనతో చర్చకు సిద్ధమని ప్రకటించారన్నారు. మే నెలలో 8వ తేదీ తరువాత జివి రెడ్డితో చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. అయితే రామోజీ సమక్షంలో కానీ… తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గానీ ఈ చర్చకు ఏర్పాటు చేసిన తన కోరికను తీర్చాలని ఉండవల్లి విజ్ఞప్తి చేశారు. ఈ చర్చకు రావడం ద్వారా రామోజీరావుకు తెలుగుదేశం మద్దతు ఇస్తున్నట్లు స్పష్టంగా తేలిపోయిందన్నారు. కేవలం మార్గదర్శి వ్యవహారంపైనే ఈచర్చ జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఆర్థిక కుంభకోణాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని, తగిన సమయంలో వాటిని బయటపెడతానని చెప్పారు.
Also read: రామోజీరావు కోసం ప్రార్థించిన ఉండవల్లి!
పవన్ పై ఉండవల్లి ఆశలు
తాను ఏపార్టీకి చెందని, ఏ పదవులు ఆశించని తటస్థుడినని అందుకే టిడిపి, వైసిపికి ప్రత్యామ్నాయంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎదగాలని ఆశించానని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అయితే తన ఆశలు అడియాశలుచేస్తూ ఆయన బిజెపి పంచన చేరిపోయారన్నారు. ఎపిలో అధికార వైఎస్సార్ సిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపిని సమర్ధించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సిబిఐ కేసుల కోసం బిజెపిని సమర్థిస్తున్నారని చెబుతున్నారని, టిడిపి అధినేత చంద్రబాబుకు బిజెపిని సమర్థించాల్సిన అవ సరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
Also read: మోడీలకు అవమానం…. రాహుల్ కు రాజపూజ్యం!