పల్లెటూరివాళ్లకు, నాగరీకులుగా భావించబడే పట్నవాసులకు తేడా వేష భాషల్లో, తినే ఆహారంలో, ఆచార వ్యవహారాల్లో, ఆలోచనల్లో, ఆచరణలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి తేడానే పాత తరానికి, కొత్త తరానికి మధ్య అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
మా బంధువుల కుటుంబాలు మూడు ఒక పల్లెలో ఉండేవి. పట్నవాసులమైన మా కుటుంబం ఏడాదికి ఒకటి రెండు సార్లు ఆ పల్లెకు వెళ్ళేది. ఊరి బయట బస్సు దిగి ఊళ్ళోకి నడుస్తున్నపుడు ఎదురైన ఒకరిద్దరు మమ్మల్ని ఆపి ఎవరు, ఎవరింటికి అని అడిగి మా సమాధానం విన్న తరువాతనే తమ దారిన పోయేవాళ్ళు. నాటి ఆ అలవాటు నేడు అనాగరికంగా, పనిలేని వాళ్ళ అనవసర జోక్యంగా కనిపించవచ్చు. అక్కడ అంతర్లీనంగా ఆ ఊరి వారందరూ ఒకటని, బయటి వారు తమలో ఎవరితోనో సంబంధం లేకపోతే ఎందుకు వస్తున్నారని తెలుసుకోవడంలో తమ భద్రత ఆధారపడి ఉందని ఈనాడు ఎంతమందికి తెలుసు?
Also read: “త్రిలింగ దేశంలో హత్య”
ఆ ఊళ్ళో మూడు పూటలు లేదా మూడు రోజులు మాత్రమే ఉండేవాళ్లం. ముగ్గురు బంధువుల్లో ఏ ఇంటిలోనన్నా ఒక పూట ఎక్కువ ఉన్నా గొడవలు, అలకలే. ఆ అనురాగాలు ఆప్యాయతలు ఊహించడం కూడా వీలుకాదు ఇప్పుడు.
ఒకప్పుడు రామా రావు, నాగేశ్వర రావు సినిమాల మధ్య పోటీ ఉండేది. రామా రావు సినిమా “ఉమ్మడి కుటుంబం” వచ్చింది. అన్నదమ్ములు, వారి బిడ్డలు అందరూ ప్రేమానురాగాలతో కలిసి ఉండడం మంచిదని సూచించింది. ఆ వెంటనే నాగేశ్వర రావు సినిమా “ఆదర్శ కుటుంబం” వచ్చింది. ఉమ్మడి కుటుంబంలో అందరూ సమానంగా కష్టపడని కారణంగా వచ్చే మనస్ఫర్ధలు లేకుండా విడి కాపురాలే సుఖంగా బ్రతికే మార్గమని చెప్పింది.
అదివరకు వివిధ వృత్తులు చేసేవాళ్ళకు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఉమ్మడి కుటుంబమే అన్నివిధాలా అనుకూలంగా ఉండేది. కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేసుకునేవాళ్ళు. కలసి ఉండడంతో ఒక కుటుంబమనే భావన ఉండేది. ప్రేమానురాగాలతో పరస్పరo సహకరించుకునేవారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండి ఆర్ధిక ఒడిదుడుకులు తట్టుకోగలిగేవారు. పొలాలు ముక్కలుగా మారక కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేవి.
కాని కాలం మార్పు తెచ్చింది. పారిశ్రామికీకరణతో పరిశ్రమలు ఏర్పడ్డాయి. వ్యవసాయం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా సంపద సృష్టించే పరిశ్రమలు ఏర్పడి ఉద్యోగాలు ఇచ్చాయి. రైతు కూలీలు కార్మికులుగా మారారు. ఉమ్మడిగా ఉండవలసిన అవసరం లేక జీతం మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరికి వారే విడిగా ఉండడం మొదలైంది. కలసి ఉన్నప్పుడు ఉండే ప్రేమాభిమానాలు విడిగా ఉన్నప్పుడు తగ్గడం సహజం. మనతో ఉన్న తమ్ముడికి, మరో ఇంట్లో పెరిగే మన పెనతండ్రి కొడుకుకి ఆత్మీయతలో తేడా ఉంటుందిగా. ప్రపంచమంతా పారిశ్రామీకరణతో వచ్చిన ఈ పరిణామం మంచైనా, చెడైనా ఎవరూ అడ్డుకోలేనిది. సమాజాన్ని ఉమ్మడి కుటుంబాలనుండి విడికుటుంబాలుగా మార్చింది. మనిషి మనసు పరిధిని చిన్నది చేసింది.
Also read: ఓంకారం
రైతుకు, భూమికి ఒక అవినాభావ సంబంధం. కుటుంబ సభ్యులతో ఉన్నట్లుగానే ఒక ఆత్మీయ బంధం. ఉమ్మడి కుటుంబాలు పోయి మనుషులు కార్మికులుగా మారినపుడు పరిశ్రమ యాజమానులతోగాని, తోటి కార్మికులతోగాని ఆత్మీయ బంధాలు లేక పోవడం సహజం. పైగా ఈ పారిశ్రామిక సంబంధం కేవలం డబ్బుతో ముడిపడింది మాత్రమే. అంటే ఆత్మీయ బంధాలు పోయి మనిషి మనసుకు అంటని ఆర్ధిక సంబంధం మాత్రం మిగిలింది. మనుషులకు ప్రాధాన్యత పోయి డబ్బుకు మాత్రమే విలువ వచ్చింది. మనషులు దూరమై డబ్బు దగ్గరైంది. ఈ కారణంగానే నేడు రెసిడెన్షియల్ పాఠశాలలు, విడాకులు, వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి.
మనషులమధ్య భావోద్వేగ ఆప్యాయతలకు మూలం కుటుంబం. మతం, సామాజిక కట్టుబాట్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సుమతీ శతకాలు, వేమన పద్యాలు, చందమామ కథలు, తాతయ్య అనుభవాలు కూడా మనుషులను అర్థం చేసుకోవడానికి, అనుబంధం పెంచుకోడానికి ఉపయోగపడేవే. ఇవి వేసే బలమైన ముద్రలే వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి. నలుగురితో మెలగడం నేర్పిస్తాయి. కానీ ఇవన్నీ మన జీవితాలనుండి పక్కకు తప్పించేస్తున్నారు. సైన్స్, లెక్కలు నేర్చుకుంటే చాలంటున్నారు. వాటితో డబ్బు వస్తుంది కానీ మంచి, మానవత్వం రావు. అవి వచ్చే తీరున సమాజం నడవడం లేదు. పరీక్షల్లో కాపీ కొట్టించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాలయాల యాజమాన్యాలు ఉన్నప్పుడు ఆ రేపటి పౌరుడు నిజాయితీ కలవాడుగా ఎలా తయారవుతాడు? చెడు చిన్నపుడే అలవాటు చేస్తే మంచివాడుగా ఎలా ఉంటాడు? లంచగొండిగానో, దేశద్రోహిగానో తయారు కావచ్చు.
డబ్బు ఎక్కువగా సంపాదించగలిగిన వాడు, సరిపడా సంపాదించుకోలేనివాడికి సహాయ పడాలంటే అతనికి స్వార్ధం తగ్గి, ఎదుటి మనిషి కష్టాన్ని అర్ధం చేసుకునే మనసుండాలి. అలాంటి పరిస్థితి తల్లిదండ్రుల పెంపకం కానీ, విద్య కానీ, సామాజిక మేధ కానీ కల్పించడం లేదు. పెద్ద చదువు కొoదరిని సమాజాన్ని దోచుకునే గొప్ప రాక్షసులుగా చేస్తున్నది. డబ్బు సంపాదించడంతోపాటు మంచితనాన్ని, జీవితపు విలువలని నిలుపుకునే విధంగా మనుషులు తయారయినపుడు ఉమ్మడి కుటుంబమైనా, విడి కాపురమైనా ప్రేమగా ఆనందంగా బ్రతికే అవకాశం ఉంటుంది. అందుకే మనం సెంటిమెంట్లు లేని మరమనుషులుగా మారకుండా ఉందాం. డబ్బుతోపాటు ప్రేమను కూడా సంపాదించుకుని మనుషులుగా మిగులుదాం.
Also read: ‘‘వరం’’