భగవద్గీత – 7
స్థితప్రజ్ఞుడైన యోగికి పగలయితే, మామూలు ఇతర ప్రాణులకు అది రాత్రి, మామూలు ప్రాణులకు పగలయితే స్థితప్రజ్ఞులకు రాత్రి, ఒకరికి పగలు ఇంకొకరికి రాత్రి ఎలా అవుతుంది!
ఒకరికి రాత్రి మరొకరికి పగలు ఎలా అవుతుంది?
ఇక్కడ రాత్రి, పగలు అని ఈరెండు విషయాలు మనం అర్ధంచేసుకోవాలి, అంతరార్ధం తెలుసుకోవాలి పగలు వెలుతురుతో నిండిఉంటుంది వెలుతురులో అన్ని వస్తువులు కనపడతవి అంటే మన కన్ను చూడగలుగుతుంది. మన ఇంద్రియమొకటి పనిచేసే స్థితిని పగలు అని అనుకుంటున్నాము. మనం పగలు అంటే కన్ను చూడగలిగేదే కాకుండా, చెవి వినగలిగే స్థితిని, ముక్కు వాసన చూడగలగడం, నాలుక రుచి చూడగలగడం, చర్మం స్పర్శించగలగే స్థితి వీటన్నిటినీ పగలు అని అనుకుందాం! అంటే ఇంద్రియాలు తమతమ విషయాలను గ్రహించే స్థితి పగలు. మామూలు ప్రాణులన్నీ ఇంద్రియవిషయాల మీదనే దృష్టి కలిగి ఉంటయి కాబట్టి ఆ స్థితి వాటికి పగలు, మరి రాత్రి అంటే?
Also read: నిండిన చెరువు
మామూలు ప్రాణులు సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని చూడగలవా?
మామూలు దృష్టితో చూడలేవు! వాటికి ఇంద్రియాలను అదుపు చేసి,వాటి వ్యాపారాన్ని నిరోధించి ఆ పరమాత్మను దర్శించగలిగే స్థితి లేదు కాబట్టి. రాత్రి మరి స్థితప్రజ్ఞుడు ఇంద్రియవిషయాలేవీ చూడలేడు కాబట్టి అది ఆయనకు రాత్రి! పరమాత్మ స్వరూపాన్ని తన అంతర్నేత్రంతో దర్శించగలడు కాబట్టి అది ఆయనకు పగలు!
ఈవిధంగా మామూలు ప్రాణులకు పగలు స్థితప్రజ్ఞుడయిన యోగికి రాత్రి! మామూలు ప్రాణులకు రాత్రి మునికి అంటే మననశీలుడికి పగలు!
యా నిశా సర్వభూతానామ్ తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః
Also read: విషయవాంఛల విషవలయం