జననీస్తన్యము గ్రోలి అర్భకుడు వక్ష స్థానమున్ వీడి మె
త్తని ప్రేమాంకము నందొరింగినటు, సంధ్యారాగ లోకైక పా
వన సంస్పర్శను బాసి, నల్లవడి, రెప్పల్ మోడ్చి నిద్రించె ధా
రుణి, ఆనంద విభావరుల్ పొడమి యేఱుల్ వాఱి వ్యాపింపగన్!
పులుగు జవమ్ముతో మరలిపోయెను గూటి కెలుంగునెత్తి, లే
గల దరిజేర్చు ధేనువుల కన్నులు వ్రాలెను తన్మయంబునన్;
జలజల పాలవెన్నెలలు జాగృతమయ్యెను, చూతశాఖలన్
ఫలభర డోలలూపెను కృపారజనీ సుషుమా సమీరముల్!
అల కాళిందియు, స్వచ్ఛ జాహ్నవియు, శ్వేతాశ్వేత తారళ్య ధా
రల విశ్వంభర స్నానమొందుగతి, క్షీరాంభోనిధుల్ పొంగుచున్
పులినాత్మల్ పులకించి పోవుగతి, పెంపొందించెనే తల్లి వ
త్సల దుగ్ధంబులు ముగ్ధచంద్ర దరహాసంబిట్లు వర్ధిల్లగన్!
శిలలు పరున్న రేయి గిరిశృంగపు శాంత భుజాగ్ర సీమ, జా
బిలి కరుణాంతరంగమున వెన్నెల దుప్పటి కప్పురేయి, ది
వ్వెలు దవులందు పల్లె కనుబిందువులై వెలుగొందు రేయి, ని
శ్చల శశికాంతితో మెఱయు స్వప్నసరస్సు కలంత జెందెనే!
కూనపై కూనతో క్షీణించె నొకదివ్వె
కనలేక పసిదివ్వె కన్నుమూసె
ప్రాణేశు తొలిప్రొద్దు పసుపు కుంకుమలతో
ఇరులలో చిరుతార లింకిపోయె
ఒకదివ్వె తనయింటి ఉదరాగ్ని చల్లార్చి
చిచ్చులో రగిలెను పిచ్చితల్లి
ఒకదివ్వె గోదేవి ఉరము పోటులు పొంది
కడతేరె కటికల కన్నతల్లి
తరతరాలుగ పల్లెలు పురములందు
పేదగుండెల చమురులు పిండిపోసి
గడపగడపలు వెలుగొందు గాథలెఱిగి
కనుల బొటబొట కన్నీరు కారిపోవు!
పున్నమరేడు దుఃఖమున, మూగిన మబ్బుల డాగె, యవ్వనో
త్పన్న సుగంధ బంధుర లతాంతము లెల్లెడ పారవశ్యతన్
కన్నులు విచ్చి చూచుతరి కమ్మని స్పర్శలు గొల్పి తెమ్మెరల్
కన్నెరికాలు కొల్లగొని కంటికి కానక పారిపోయినన్!
ఒకని దయార్ద్ర బోధనల ఉల్లము లూగెను పల్లెపల్లెలో:
“సకల గుణాభిరాముడును సాధ్విని శీలపరీక్ష గోరె, కా
నకు వెలిలైచె, ధర్మజుడు నాతిని సైతము పందెమొడ్డె! – కీ
చకుని నివాసమేగి మనసా! మధుపాత్ర సుధేష్ణ యిమ్మనెన్!”
“ఒక డనుమాన పీడితు డహోనిశలన్ నరకమ్ము కొంపలోన్;
ఒకడు గడించె పాతకము నుత్తమ పత్నిని గెంటి భ్రష్టుడై!”
“ఒకతె వియోగ శోకమున నుండియు, గోముల చంటి బిడ్డకున్
సకలము తానె యైనది నిశాంధమునన్ వెలిగించె దీపమున్!”
“ఒకడు పరాభవించె మదనోద్ధతితో తన కన్న బిడ్డనే!
ఒకతె, మహాప్రభూ! వినవె! ఉగ్రమతిన్ కడతేర్చె కోడలిన్!”
“వికలము నా మనస్సు! పుర వీధి క్షుధానల మోర్వలేక బా
లిక విలపించుచుండె, దయలేక త్యజించిన తల్లి యెవ్వరో!”
“నచ్చిన దారి కాదె! మలినాశ్రువులేల రుజా సహోదరీ?
రొచ్చున మ్రగ్గుదానివలె రొప్పుచు రొమ్ముల పల్కె సానియున్!
“చచ్చిరి తల్లి తండ్రియును, సాకెడు వారలు లేక, పొట్టకై
బిచ్చము నెత్తలేక, చెడు వృత్తి, దయామయ! స్వీకరించితిన్!”
**
కనుగొని వ్యర్థ బాష్పములు కార్చెడు జాతి, అనాధపుష్ప మా
న నిహతి, వ్యాఘ్రదంష్ట్ర హరిణాహుతి, మాతృదయా విహీన జీ
వన నరజాతి గుండియలపై బడి, భీకర భద్రకాళి! న
ర్తన మొనరింపుమా! ప్రళయ తాండవ భేరి త్రిశూల ధారివై!
ఒక దివ్వెన్ క్రిమి కీటకాళి మసిజేయున్ మూగి కామంబుతో;
ఒక దివ్వెన్ చెలరేగి గాలి పడద్రోయున్ గర్భ విచ్ఛిన్నమై;
ఒక రేయిన్ బలిపీఠమెక్కి తలపోయున్ మండు క్రొవ్వొత్తి: “చా
లొకటే పుట్టుక, ప్రీతితో నిడు కృపాళూ! జన్మ రాహిత్యమున్!”
కలవలె గంటి, పచ్చి పసికందులు స్తన్యము వీడురేయి, కు
క్కలు గుమిగూడి భీకరముగా జగతిన్ భయపెట్టు రేయి, ని
ర్మలమగు దీపకాంతి పెనుమంటలు గ్రక్కున రేగి పాప పం
కిల బధిరాంధ లోకముల నెల్ల దహించెడు రేయి, నేస్తమా!
Also read: వ ర్ష సం ధ్య
నివర్తి మోహన్ కుమార్