వోలెటి దివాకర్
జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమ ఫలితాలను వివరించేందుకు ఐ ప్యాక్ దర్శకత్వంలో రాజమహేంద్రవరం పార్లమెంటు స్థాయిలో శనివారం విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వై ఎస్సార్సిపి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్ రామ్, జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని ముందుగానే తెలియజేశారు. ఎడముఖం పెడముఖంగా ఉన్న జక్కంపూడి రాజా, ఎంపి భరత్ ను చాలా కాలం తరువాత ఒకే వేదికపై చూసేందుకు ఆసక్తిగా వెళ్లిన వారికి నిరాశే ఎదురైంది.
Also read: రామోజీరావు కోసం ప్రార్థించిన ఉండవల్లి!
జక్కంపూడి రాజా, అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ మాత్రమే ఈసమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రాజా మాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, 2024లో కూడా అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
Also read: మోడీలకు అవమానం…. రాహుల్ కు రాజపూజ్యం!
చందన నాగేశ్వర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఎంపి భరత్ ను రాజా స్వయంగా ఫోన్లో ఆహ్వానించినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయినా భరత్ ఈసమావేశాన్ని ఎగ్గొట్టడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భరత్ ఈ సమావేశానికి హాజరవుతారా అని రాజాను ప్రశ్నించగా ఆయన సమీక్షా సమావేశానికి వెళ్లారని బదులిచ్చారు. అంటే పార్టీ కార్యక్రమం కన్నా రొటీన్గా జరిగే సమీక్షా సమావేశం ఎంపికి ముఖ్యమైందా?…లేక రాజాతో ఒక వేదికను పంచుకోవడం ఆయనకు ఇష్టం లేకపోయిందా అన్న చర్చ జరుగుతోంది.
ఏదిఏమైనా రాజమహేంద్రవరం రాజకీయాలపై ఆధిపత్యమే నాయకుల మధ్య విరోధాలకు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలను అడ్డుకోకపోతే అధికార పార్టీకి రాజమహేంద్రవరంలో రాజకీయ భవిష్యత్ లేదన్న విషయం స్పష్టమవుతోంది.
Also read: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరేనా?