సుస్థిర వృద్ధి, అభివృద్థిలో యువత పాత్రను విధాన నిర్ణేతలు నొక్కి చెప్పారు
భువనేశ్వర్ లోని కేఐఐటీడీయూ (కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ)లో జీ-20 ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే Y-20 కన్సల్టేషన్స్ కార్యక్రమం శుక్రవారం ఎంతో ఉత్సాహంగా ప్రారంభమమైంది. సుసంపన్నమైన, శాంతియుతమైన సమాజాన్ని నిర్మించడంలో యువత కీలక పాత్రను నొక్కి చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా విధానకర్తలు సమావేశమైనారు.
ఈ కార్యక్రమాన్ని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి అశ్వినీకుమార్ చౌబే ప్రారంభించారు. యువతరం స్వామి వివేకానంద జీవితాన్నీ, సూత్రాలనూ అనుకరించాలనీ, 21వ శతాబ్దంలో భారత దేశాన్నిఅగ్రగామిదేశంగా మార్చడానికి కృషి చేయాలనీ కోరారు.
అభివృద్ది ప్రక్రియలో యువత పాత్రనునొక్కి చెప్పిన చౌబే, ‘‘ఈ గొప్ప దేశం భవిత యువత చేతిలో ఉంది. సమాజంలో శాంతి, సౌభాగ్యం తీసుకురావడంలో వీరిది కీలకపాత్ర’’ అని అన్నారు. వివిధ రంగాలలో కేఐఐటీ, దాని విద్యార్థులు సాధించిన విజయాలను ఆయన కొనియాడారు.
కఐఐటీడీ, కిస్ వ్యవస్థాపకులు డాక్టర్ అచ్యుత సమంత సభకు అద్యక్షత వహించి, స్వాగతం పలికి, అతిథులను సన్మానించారు.
వై20 జీ 20 దేశాలకు చెందిన విద్యార్థులనూ, విద్యావేత్తలనూ, వ్యాపారనాయకులనూ, ఆధ్యాత్మికనాయకులనూ ఏకతాటిపైకి తెచ్చింది. యువతకు ప్రపంచ సమస్యలపైన అవగాహన పెంచడానికీ, ఆలోచనలను పంచుకోవడానికీ, సృజనాత్మకమైన ఆలోచనలను పంచుకోవడానికీ, చర్చలు, సంప్రతింపులలో పాల్గొనడానికీ, ఏకాభిప్రాయం సాధించడానికి ఈ ఫోరం ఒక వేదికను అందించింది. ఈ చర్చల ఫలితాలను ఈ ఏడాది చివర్లో భారత ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే జి-20 సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
ఒడిశా ప్రభుత్వ హోం, క్రీడలు, యువజన సర్వీసుల సహాయ మంత్రి తుషార్కంటి బెహరా వై 20 సంప్రతింపుల థీమ్ అయిన వసుధైవ కుటుంబకం (ప్రపంచం ఒకే కుటుంబం) యెక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. సంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి,జాతీయ సమగ్రతను పెంపొందించడానికి యువత కలసి పని చేయవలసిన ఆవసరాన్నినొక్కి చెప్పారు. అమెరికాలో జరుగుతున్న నాసా రోవర్ చాలెంజర్ 2023లో పాల్గొనేందుకు మొత్తం ఆరుగురు విద్యార్థులలో రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపికైనారని బెహరా చెప్పారు.
కేంద్ర యువజన వ్యవహారాలూ, క్రీడల కార్యదర్శి మీతా రాజీవ్ లోచన్ మాట్లాడుతూ కేవలం 25 ఏళ్ళలోనే కేఐఐటీడీయూని దేశంలో అత్యుత్తమ సంస్థలలో ఒకటిగా తీర్చిదిద్దడం అభినందనీయమని అన్నారు. వై 20 సంప్రతింపులను నిర్వహించడానికి కేఐఐటీయూ ‘‘తగిన సంస్థ’’ అని ఆమె అన్నారు.ఎందుకంటే యువజనులు వివిధ మార్గాల్లో భవిష్యత్తును రూపొందిస్తున్నారు. చర్చల ఫలితాలను ఆగస్టులో వారణాసిలో జరిగే వై 20 సదస్సులో సమర్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో యూకే పార్లమెంటు సభ్యుడు వేరేంద్రశర్మ వంటి ప్రముఖుల ప్రసంగాలు సాగాయి.నార్త్ కరోలినాకు చెందిన అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యుడు రాబర్ట్ పిటింగర్, స్విట్జర్లాండ్ పార్లమెంటు సభ్యుడు డాక్లర్ నిక్లాస్ శామ్యూల్ గగ్గర్, మూడు సార్లు గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్, కేఐఐటీడీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సుస్మితా సామంత మాట్లాడారు. కేఐఐటీడీయూ ప్రొవైస్ చాన్సలర్ శరణ్ జిత్ సింగ్ ధన్యవాదాలు చెప్పారు.