మాడభూషి శ్రీధర్
అంబేడ్కర్ కేవలం భారత రత్న కాదు, భారత రత్న ఎవరు ఇస్తున్నారు? ఒక పార్టీ, కొందరు మంత్రులు, ఒక ప్రధానమంత్రి ఆయనను భారత రత్న అంటున్నారు. వీపీ సింగ్ ప్రభుత్వం 1990లో అంబేడ్కర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను మరణాంతరంప్రకటించింది. భారతరత్న అనడం తప్పు కాదు. కాని ఆయన అంతకన్నా చాలా గొప్ప అంతర్జాతీయ వ్యక్తిత్వం కలిగిన వాడు. అందరికన్నామించి ప్రపంచ ఉత్తముడని అంగీకరించాలి. లేకపోతే కేవలం రత్నఅంటే సరిపోదు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో ‘అవుట్ లుక్’ మ్యాగజైన్ నిర్వహించిన ‘ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్’ లో అంబేడ్కర్ మొదటి స్థానంలో ఎంపికైయ్యాడు. అయినా సరే, ఈ బిరుదులు అన్నీ ఈ అద్భుతమైన రాజ్యాంగ శాస్త్ర రాజకీయవేత్తను వర్ణించడానికి సరిపోవు.
ఒకవైపు దేశాన్ని బానిసత్వం నుంచి పోరాడుతున్న లక్షలాది మంది ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నవారున్నారు. మరోవైపు ఒక దేశాన్ని ఏవిధంగా నిర్మించాలి అని నిరంతరం ఆలోచించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వారిలోఅగ్రగామి భారతదేశానికి మార్గదర్శి అంబేడ్కర్.
సాదా సీదా జన్మ
బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మస్థలం, భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో ఉంది. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని (MHOW) మౌ (మోవ్) అంటే Military Head Quarters of War అనే ఇంగ్లీషు మాటలకు కుదించిన పేరు. (ప్రస్తుతం అంబేడ్కర్ నగర్)లో రామ్‌జీ మలోజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు అంబేడ్కర్ జన్మించారు. ఆయన తండ్రి రామ్‌జీ ఒక మిలిటరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ గొప్ప స్మారక చిహ్నాన్ని అంబేద్కర్ 100వ జయంతి సందర్భంగా – 14 ఏప్రిల్ 1991న అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సుందర్ లాల్ పట్వా ప్రారంభించారు. స్మారక చిహ్నం యొక్క నిర్మాణాన్ని ఆర్కిటెక్ట్ ఇడి నిమ్‌గాడే నిర్మించారు. దాదాపు 4.52 ఎకరాల భూమి స్మారకంలో ఏర్పాటుచేశారు. అయితే, ఆ సామాన్యుడి పాత ఇంటిని రక్షించడానికి ఎవరూ ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యం,
అంబేడ్కర్ ఒక ప్రొఫెసర్, పత్రికా రచయిత, న్యాయవాది, శాసన కర్త, రాజ్యాంగ నిర్మాత, అంతకన్నా మించి మానవతావాది.
ప్రొఫెసర్: అంబేడ్కర్ 1918లో ముంబయిలోని ఒక కళాశాలలో ప్రొఫెసర్‌గా చేరారు.1935 నుంచి 1938 వరకు లా కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.1907లో అంబేడ్కర్ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఏడాది ముంబయిలోని ఎల్ఫిన్‌స్టన్ కళాశాలలో చేరారు. ఆ కళాశాలలో చేరిన తొలి దళిత విద్యార్థి అంబేడ్కర్. 1912లో బాంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు. తర్వాత బరోడా రాజ్యంలో ప్రభుత్వం ఉద్యోగం పొందారు. 1913లో బరోడా మహారాజు సాయాజీరావ్ గైక్వాడ్ ప్రభుత్వం ఉపకార వేతనంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించేందుకు అంబేడ్కర్ వెళ్లారు. మూడేళ్లపాటు బరోడా ప్రభుత్వం స్కాలర్‌షిప్ ఇచ్చింది. 1913లో ఎంఏ పట్టా అందుకున్నారు.
పత్రికారచయిత: 1920లో ఛత్రపతి షాహు మహరాజ్, కొల్హాపూర్ మహారాజా సాయంతో ‘మూక్‌నాయక్’ అనే వార పత్రికను ప్రారంభించారాయన.
న్యాయవాది: 1923లో బొంబాయి(ముంబయి)లో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు.
లెజిస్తేటివ్ కౌన్సిల్ సభ్యుడు: 1927లో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా నామినేట్ అయ్యారు. 1942 నుంచి 1946 వరకు వైస్రాయి కౌన్సిల్‌లో లేబర్ మెంబర్‌గా ఉన్నారు. 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.
దేశ మొదటి న్యాయశాఖ మంత్రి.
రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు: రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీకి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అంబేడ్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. ఏ విధంగా ఇప్పుడు పనిచేస్తున్నదా లేదా అని జనం ఆలోచించాలి. జవాబులు తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవాలి.
ఇప్పటి ప్రజల బాధ్యత: ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి? దాని గురించి కూడా అందరూ తెలుసుకోవాలి. కార్యాచరణకు పూనుకోవాలి.
ప్రపంచంలోకెల్లా ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్ లో
అటువంటి మహనీయుడు అంబేడ్కర్ పుట్టిన రోజు 14 ఏప్రిల్. ఈ సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్డులో అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం అసాధారణమైనది. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం అది. 125 అడుగుల ఎత్తైన సమున్నత శిఖరం. వెడల్సు నలభై అడుగులు. బేస్ మెంట్ ఎత్తు 50 అడుగులు. ట్యాంక్ బండ్ కు ఎదురుగా నెక్లెస్ రోడ్డుపైన ఎన్ టీఆర్ గార్డెన్ పక్కన నిర్మించిన ఈ విగ్రహం దేశంలోని అంబేడ్కర్ విగ్రహాలల్లోకెల్లా పెద్దది. మొత్తం రూ, 146కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. బేస్మెంటులో అంబేడ్కర్ మ్యూజియం, లైబ్రరీ, ఆడియో-విజువల్ కాన్ఫరెన్స్ హాలు. బేస్ మెంట్ నమూనా దిల్లీలోని పాతపార్లమెంటు ఆకృతిలో ఉన్నది.