- తెలంగాణ ప్రజల కలల సాకారానికి కేంద్ర ప్రభుత్వం దీక్షాబద్ధయై ఉన్నది
- రాష్ట్రప్రభుత్వ సహకారలేమి కారణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో జాప్యం
సికిందరాబాద్: తన ప్రభుత్వం తెలంగాణ ప్రజల కలల సాకారానికి కట్టుబడి ఉన్నదనీ, కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనీ ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ లో శనివారం మధ్యాహ్నం ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్నీ, అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావునీ, ఆయన కుటుంబవాదాన్నీ, భ్రష్టాచారాన్నీ నిశితంగా విమర్శించారు.
సికిందరాబాద్ పరేడ్ గ్రౌడ్స్ లో రూ.11,000 కోట్లు విలువ చేసే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. ముందుగా సికిందరాబాద్ స్టేషన్ లో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో బీబీనగర్ లో నిర్మించబోయే ఎయిమ్స్ ఆస్పత్రి భవనసముదాయానికి శంకుస్థాపన చేశారు. పరేడ్ గ్రౌండ్స్ సభలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఉన్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ తెలుగులో అందరికి వందనాలు చెప్పారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు. మరగుదొడ్ల నిర్మాణం వల్ల ఎన్నికోట్ల మంది మహిళలు ప్రశాంతంగా జీవిస్తున్నారో తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే కేంద్రంలో ఎన్ డీఏ ప్రభుత్వం ఏర్పడిందనీ,అప్పటి నుంచి తెలంగాణకుమేలు చేయాలనే అనేక విధాల తన ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనీ, కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకారం సకాలంలో అందకపోవడంతో సంక్షేమ కార్యక్రమాల, అభివృద్ధి కార్యక్రమాల అమలులో జాప్యం జరుగుతోందని ప్రధాని విమర్శించారు.
‘‘కేంద్ర పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం నాకు బాధ కలిగిస్తున్నది. ఈ సహాయనిరాకరణ తెలంగాణ ప్రజల కలల సాకారం కావడంలో జాప్యం జరుగుతోంది,’’ అని మోదీ అన్నారు. ‘‘తెలంగాణ ప్రజల అభివృద్ధి క్రమానికి అంతరాయం కలిగించవద్దని నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ప్రధాని అన్నారు. పరివారవాదం, అవినీతీ వేరేవేరు కాదు.పరివారవాదం ఉన్న చోట అవినీతి ఊడలు వేస్తుంది అని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో పరివారవాదం, బంధుప్రీతి, అవినీతి పెనవేసుకుపోయాయని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజల కలలను నిజం చేయడం ఎన్ డీ ఏ ప్రభుత్వం తన కర్తవ్యంగా భావిస్తున్నదని ప్రధాని వ్యాఖ్యానించారు.