Tuesday, December 3, 2024

భారద్వాజ ముని ఆశ్రమంలో రామదండు విడిది

రామాయణమ్ 222

‘‘సీతా, అదుగో అదే ఋష్యమూకము. సుగ్రీవునితో మైత్రికుదిరినది ఇక్కడే. వాలిని సంహరించి అతని భయము పోగొట్టగలనని మాట ఇచ్చినది ఇక్కడే. ఇదుగో  ఇక్కడే యోజనదూరము బాహువులున్న కబంధుడిని నేలకూల్చినది ఇక్కడే.

‘‘జానకీ, అదుగో ఆ పెద్ద వృక్షము చూసినావా? అక్కడే నీకొరకు రావణునితో పోరాడి పోరాడి జటాయువు అసువులు బాసాడు. అదుగదిగో మన పర్ణశాల. అక్కడే రావణుడు నిన్ను అపహరించినది.

Also read: పుష్కక విమానంలో సీతారామలక్ష్మణులూ, ఇతరులూ అయోధ్య ప్రయాణం

‘‘మైథిలీ, ఇదుగా ప్రకాశమానముగా కనపడుతున్నదే అదే సుతీక్ష్ణ మహాముని ఆశ్రమము. అదుగో శరభంగాశ్రమము. అక్కడే దేవేంద్రుడు ఆమునిని కలుసుకొన్నాడు. అదుగో గోదావరీ తీరము. అవిగో దట్టముగా పెరిగిన అరటి చెట్లు. అది మహానుభావుడు అగస్త్యముని ఆశ్రమము. అదుగో చిత్రకూటము. చూడుచూడు సీతా! ఇక్కడే భరతుడు నన్ను తిరిగి రమ్మని వేడుకున్నది. మనము భరద్వాజాశ్రమమును సమీపించుచున్నాము ….

‘‘అదుగో అల్లదిగో అయోధ్య. కనపడుతున్నదా? మరల మనము మన అయోధ్యకు వస్తున్నాము. చూడు సీతా, బాగా చూడు. నా హృదయము ఉప్పొంగుచున్నది. అది నా జన్మభూమి ….’’

రాముడు ఒక్కసారి భరద్వాజ మహామునిని కలిసి అయోధ్యకు వెళ్ళాలనుకొని అక్కడ ఆ మహర్షి ఆశ్రమము వద్ద పుష్పకము నిలిపినాడు.

Also read: దివ్యవిమానములో దశరథ దర్శనం

పదునాలుగు ఏండ్లు నిండినవి. ఆనాడు చైత్రశుద్ధ పంచమి  నాటికి పదునాలుగేండ్లు పూర్తి అయినవి. మరునాటికి తాను ఇచ్చిన మాట ప్రకారము భరతుడిని కలుసుకొనవలె.

అది భరద్వాజాశ్రమము. రాముడు మునికి శ్రద్ధాభక్తులతో అత్యంత వినయముతో నమస్కారము చేసి, ‘‘భగవన్! మా అయోధ్య వార్తలు మీకు తెలియుచున్నవా? మా భరతుడు ఎలా ఉన్నాడు? అతని పరిపాలన ఎలా సాగుచున్నది?  మా తల్లులు కుశలమేనా?’’ అని గుక్కతిప్పుకోకుండా ప్రశ్నించినాడు.

రాముని ఆతురత ,ఆంతర్యము గ్రహించిన మహర్షి, ‘‘రామా, అచట అందరూ కుశలమే. మా శిష్యులు అయోధ్యకు వెళ్ళి వచ్చినప్పుడల్లా అక్కడి సమాచారము సేకరించి నాకు తెలుపుదురు.

Also read: అగ్నిదేవుడి చేతుల మీదుగా సీతను స్వీకరించిన శ్రీరామచంద్రుడు

‘‘రామా, నీ తమ్ముడు భరతుడు మట్టికొట్టుకుపోయిన శరీరముతో మాసినబట్టలు వేసుకొని, జడలుకట్టినకేశములతో స్నానసంస్కారములేవీ లేక నిత్యము నీకై పరితపిస్తూ కన్నీరు కారుస్తూ కటిక నేలపై పరుండి జీవించుచున్నాడు. నీ పాదుకలకే సర్వము నివేదిస్తూ రాచకార్యములు చక్కపెట్టుచున్నాడు.

‘‘రామా, కట్టుబట్టలతో కాలినడకన అరణ్యమునకు వెళ్ళిన నీవేనా మిత్రగణముతో శత్రువును జయించి సమృద్ధార్ధుడవై తిరిగివచ్చినది?  నిన్ను చూసి నేడు నా హృదయముప్పొంగుచున్నది రామా. అడవులలో నీవు పడ్డ కష్టములు, తాపసుల రక్షణార్ధమై కంకణాబద్ధుడవైన నీకు ఎదురైన క్లేశములు, అవరోధములు, సీతాపహరణము సర్వము తెలుసుకొంటినయ్యా!

‘‘రామా, నేడు నా ఆతిథ్యము స్వీకరించి రేపు అయోధ్య వెడుదువుగాని’’ అని ముని కోరగా అందుకు సమ్మతించినాడు రామచంద్రుడు.

Also read: సీతమ్మ అగ్నిప్రవేశం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles