రామాయణమ్ – 219
సత్యపరాక్రమము గల ఓ రామచంద్రా! సత్యమైన నా వాక్యము వినవయ్యా!
అప్రమేయా! స్వప్రకాశా! అవును రామచంద్రా అవి నీవే!
ఆద్యంతరహితా, వినాశరహితా! ధర్మవ్రతా! పురుషోత్తమా!
నీవే బుద్ధి
నీవే ఓర్పు
నీవే సృష్టి
నీవే ప్రళయము
వేదము నీవే
వాదము నీవే
నాదము నీవే
నీవే యజ్ఞము
నీవే వషట్కారము
అంతా నీవే
అన్నిటా నీవే
జగత్తు నీవు
మహత్తు నీవు
Also read: సీతమ్మ అగ్నిప్రవేశం
నీవు కన్నువాలిస్తే అది రాత్రి
నీవు కన్ను తెరిస్తే అది పగలు
.
రామా నీవు విష్ణుమూర్తివి
సీతమ్మ సాక్షాత్తూ లక్ష్మీదేవి.
.
ధర్మపోషకా రామా ! రావణ వధకోసము పుడమిపై అవతరించిన ఆదిదంపతులు మీరు …
ఇది సత్యము. ఇది సత్యము. ఇదియే సత్యము రామచంద్రా! దయాసాంద్రా!!
అనుచూ బ్రహ్మదేవుడు శ్రీరాముని స్తుతించి ఆయన నిజస్వరూపమును ఎరిగించెను
బ్రహ్మదేవుడు శ్రీరాముని స్తుతిచేసిన పిదప చితి అంతా అటుఇటూ చిమ్మివేస్తూ ఒక్కసారిగా అందులోనుండి స్వర్ణకాంతులు వెదజల్లుతూ అగ్నిదేవుడు సీతమ్మను వెంటబెట్టుకొని పైకిలేచెను. సీతమ్మను తనకూతురువలె పొదివిపట్టుకొని శ్రీరామునకు అర్పించెను.
Also read: రాముడి పలుకులకు బిత్తరబోయిన సీతమ్మ
అగ్నిదేవుడు ,రామచంద్రునితో
‘‘రామా !ఇదుగోనయ్యా నీ సీత !పరమపునీత!
ఏ పాపము అంటని సచ్చీలము ఈమె సొత్తు
ఈమె తన నడవడితో
ఒరవడిదిద్దినది
ఈమె దీనురాలై పరాధీనురాలైనప్పటికీ రావణాంతఃపురమున నిర్బంధింపబడినప్పటికీ
నిన్ను తప్ప వేరొకరిని భావనకూడా చేయలేదయ్యా!
నీవే లక్ష్యము!
ఆమెతలపులన్నీ నీకొరకే రామా!
ఆమె మహాసాధ్వి!
Also read: రాముడి పలుకులకు బిత్తరబోయిన సీతమ్మ
ఆమెను పల్లెత్తుమాట పలుకుటకు కూడా వీలు లేదు!
‘‘రామచంద్రా, నేను ఆజ్ఞాపించుచున్నాను పరమపావని సీతను స్వీకరించు!’’ అని అగ్ని దేవుడు పలుకగానే….
రాజీవనేత్రుని కన్నులు నీటితో చిప్పిల్లినవి. ఆమెఎడ ఎడదనిండా నింపుకొన్న ప్రేమ …..శివజటాజూటములో బందీయై విడుదలగావింపబడినప్పుడు బయల్పడిన గంగాప్రవాహము వలె ఉబికి ఉరికినది.
‘‘అగ్నిదేవా నీవుచెప్పినది
నిజము! నిజము!!
నాకు తెలుసు
ఈ అయోనిజ అగ్నిశిఖ,
రావణుడు సమీపించనుకూడా సాహసించలేడు.
సూర్యునివిడిచి సూర్యకాంతియుండునా?
అటులే! నన్నువిడిచి నా సీత హృదయముండదు.
ఆత్మాభిమానము కలవాడు కీర్తిని వదలలేనట్లు నేను నా సీతను వదిలిఉండలేను’’ …అని పలికిన రామచంద్రుని చూచి జనులందరూ జయజయధ్వానములు చేసిరి.
Also read: విభీషణ పట్టాభిషేకం
వూటుకూరు జానకిరామారావు