రామాయణమ్ – 215
‘‘స్త్రీలను ఓదార్చి రావణునకు అంతిమ సంస్కారములు గావింపుము’’ అని రాముడు విభీషణునికి చెప్పెను.
వినయముతో ఆ మాటలు విని విభీషణుడు, ‘‘రామా అంతిమసంస్కారములు గావించుటకు నా మనస్సు అంగీకరించుటలేదు. ఈయన ధర్మభ్రష్టుడు. క్రూరుడు. పరభార్యల పొందు కోరువాడు. ఇలాంటి మనిషికి అంతిమ సంస్కారము నేను చేయజాలకున్నాను.
Also read: మండోదరి విలాపము
‘‘అన్నగా ఇతడు నాకు పూజ్యుడు. కానీ ఇతడు నా వలన పూజలొందదగిన వాడు కాడు!… ఈయన దుర్గుణములు తలచినప్పుడు నన్ను నేను సమాధానపరచుకోలేకున్నాను.’’
‘‘విభీషణా, ఈ రాక్షసరాజు సంగ్రామ శూరుడు. మహాయోధుడు. మహాబలుడు. మహాతేజస్వి. ఇంద్రాదులు సైతము గడగడవణకినారు ….ఈ నిశాచరుడు అధర్మపరుడే కావచ్చును. ఇప్పుడు మన ప్రయోజనము తీరినది కదా? ఇంక వైరమెందులకు? నీవే ఈయన అంతిమ సంస్కారము గావించవలెను. దానివలన నీకు కీర్తి లభించును.’’
రాముడు చెప్పిన తరువాత విభీషణుడు నగరములోనికి వెళ్ళి రావణుని అగ్నిహోత్రములు ఒక రధముపై తీసుకొని వచ్చి దక్షిణ దిక్కుగా రావణుని శరీరము ఉంచిన పేటికను తీసుకొని వెళ్ళి గంధపు చక్కలతో చితిని పేర్చి సోదరుని శరీరమునకు అగ్నిప్రదానముగావించి రాముని వద్దకు వచ్చెను.
Also read: రావణుడి అంత్యక్రియలు చేయడానికి విభేషణుడికి రాముని అనుమతి
అంత రాముడు లక్ష్మణుని చూసి, ‘‘సోదరా నీవీతనిని నగరములోనికి తీసుకొని వెళ్ళి అభిషేకింపుము’’ అని చెప్పగా లక్ష్మణుడు అటులే అని విభీషణ సహితముగా లంకకు చేరెను.
(రావణ మరణానంతరము ఇరువురి విలాపములు మనము చూచినాము.
మొదట విభీషణునిది. తరువాత మండోదరిది.
విభీషణుడు, తనను ఇంతకాలము పోషించి పెద్దచేసిన అన్న ఇలా ఒక దుర్వ్యసనము కారణముగా మరణించినాడే అన్నబాధ, ఆ వ్యసనమే లేకున్న త్రిలోకాధిపత్యమునకు కూడా అర్హుడైన మహితాత్ముడు ఈ విధముగా చనిపోయినాడే అనే బాధ మనకు కనపడుతుంది.
అదే మండోదరీ విలాపములో, భర్తమరణము క్రుంగదీసినందువలన, మరియు.. ఇంతబ్రతుకు బ్రతికి చివరకు విభీషణుని పంచన పడి బ్రతకాల్సిన దుస్థితి దాపురించినది కదా ఇందుకు కారకుడైన భర్తమీద కోపము …ఈ రెండూ కలగలసిన శోకము ఆమెది!)
Also read: రావణ సంహారం, విభీషణుడి విలాపం
….
లక్ష్మణుని ఆజ్ఞమేరకు నానా తీర్ధములనుండి వానర వీరులు జలములుతెచ్చిరి.
మంగళతూర్యారవముల మధ్య, వేదపండితులు ఆశీర్వచనములు సేయుచుండగా, వందిమాగధులు గుణగానము సలుప, మనోజ్ఞమైన ఆస్థాన మండపమునందు గల రత్నఖచితహేమసింహాసనముపై విభీషణుని కూర్చుండబెట్టి లంకారాజ్యపట్టాభిషేక క్రతువు జరిపించి రామాజ్ఞ పాలించినాడు రామానుజుడు.
అటుపిమ్మట విభీషణుడు రాముని వద్దకు తిరిగి వచ్చి తదుపరి కర్తవ్యమేమిటి అన్నట్లుగా నిలుచున్నాడు.
అప్పుడు రామచంద్రుడు తన చేరువనే అంజలిఘటించి నిలుచున్న ఆంజనేయుని చూసి, “ఓ హనుమా, నీవు విభీషణుని అనుమతి తీసుకొని లంకానగర ప్రవేశము చేసి సీతకు నా క్షేమ సమాచారము, మన విజయవార్తలు ఎరిగింపుము” అని పలికెను.
Also read: తెగి మొలచిన రావణు శిరస్సులు
అంత విభీషణుని అనుమతి గైకొని లంకాపురమునందు గల అశోకవనములో హనుమ ప్రవేశించెను.
స్నానసంస్కారములు ఏవీలేక భయపడుతూ రాక్షస స్త్రీల మధ్య ఒదిగి కూర్చున్న సీతమ్మను సమీపించి అంజలి ఘటించి నిలుచున్నాడు మారుతి.
మెల్లగా తల పైకెత్తి చూసింది సీతమ్మ! ఎప్పుడో చూసిన గుర్తు!
మరల కనులు దించి మనోఫలకమున ఒకసారి వీక్షించి హనుమను గుర్తుపట్టిన వెంటనే సూర్యోదయమున విచ్చుకున్న పద్మమువలే ముఖము ప్రకాశమానమైనది.
హనుమను మౌనముగానే పలుకరించెను.
సీతమ్మ గుర్తు పట్టిన వెనువెంటనే హనుమస్వామి రామ సందేశమును ఆమెకు వినిపించెను.
“అమ్మా! నీ రాముడు దైత్యులను సంహరించి గొప్ప విజయము సాధించినాడు. నీవిప్పుడు దుఃఖములను విడిచి స్వస్థత పొందుతల్లీ” అని పలికినాడు హనుమంతుడు.
ఆ మాటలు విన్న సీతమ్మ ఆనందాతిశయము చేత మౌనముద్రదాల్చి ఏమీ మాటాడలేకపోయెను.
“అమ్మా ఏమి ఆలోచిస్తున్నావు” అని హనుమ సీతమ్మను ప్రశ్నించెను.
Also read: రాముడికి ఆదిత్య హృదయం ప్రబోధించిన అగస్త్య మహర్షి
వూటుకూరు జానకిరామారావు