రామాయణమ్ – 204
పూచిన మోదుగలా?
విరిసిన ఎర్రమందారాలా?
కావు కావు అవి మహాయోధుల శరీరాలు.
కుంకుమవర్ణంతో ఎర్రగా ఇరువురి శరీరాలనుండి రక్తం ధారగా కారుతున్నది.
వారు విడిచిన బాణములు ఒకదానినొకటి ఎదిరించి భయంకరముగా శబ్దము చేస్తూ నిప్పులుకక్కుతూనేలపై పడిపోవుచున్నవి.
Also read: ఇంద్రజిత్తుతో తలబడిన రామానుజుడు
ఇరువురికీ తమ అస్త్రములు వ్యర్ధములైనందుకు కోపము, ఒకరినొకరు కొట్టలేకపోవుచున్నందుకు సిగ్గు ఒకేసారి కలిగినవి.
సమరము అద్భుతము.
సమరము సంకులము.
సమరము భీకరము….. ఆహా ఎన్నాళ్ళకు చూచువారి కనుల విందుగా మహాయుద్ధము సాగుచున్నది! అని ఆకాశముపై నిలచి వీక్షించు గంధర్వ, గరుడ, దేవ, పితృ, ముని సంఘాలు అనుకొనుచూ తమ తమ దృష్టులను ఎటూ మరల్చక యుండిరి.
Also read: మాయాసీత మరణవార్త విని కుప్పకూలిన రాముడు
ఇంతలో లక్ష్మణుడు ఒక బాణమును సంధించెను. అది గురితప్పక రావణసుతుని గుండెలు బ్రద్దలు కొట్టునట్లుగా కనపడుచున్నది. దీనిని దేవతలు లక్ష్మణునకు ఒసంగిరి. దానితోనే ఇంద్రుడు పూర్వము దేవాసుర సంగ్రామములో అసురులను జయించెను.
ధనుస్సునందు ఆ శరముసంధించి లాగిపట్టి నిలుచున్నాడు లక్ష్మణుడు. ఆయన మనస్సులో సంకల్పము చేసికొన్నాడు. ‘‘దశరధ పుత్రుడగు రాముడు సత్యసంధుడేని, ధర్మాత్ముడేని, పౌరుషవంతుడేని ఓ శరమా, నీవు రావణపుత్రుడు నేలకూలునట్లు ఆతని శిరస్సును త్రుంచి వేసెదవు’’ అనుచూ సంకల్పము చెప్పుకొని చెవివరకూ నారిసారించి ఇంద్రజిత్తుపైకి ఆ బాణము వదలినాడు.
Also read: మాయాసీతతో రణరంగానికి వచ్చిన ఇంద్రజిత్తు
అది గాలిని చీల్చుకుంటూ కంటికి కనపడనంత మహావేగముగా సర్రున దూసుకుంటూ వెళ్ళి ఇంద్రజిత్తు శిరస్సును ఎగురగొట్టెను.
((ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరధి ర్యది
పౌరుషే చా ప్రతిద్వంన్ద్వ శ్శరైనం జహి రావణిమ్ ……
….ఇదిమహా మంత్రము…లక్ష్మణుడు సంకల్పించినది…దీనిని సిద్ధమంత్రమందురు)
….
వంటినిండా బాణపు ములుకులు, ధారలై , ఏరులై పారుతున్న రక్తము అయినా ఆ హృదయంలో సంతోషము!
రావణుడి ప్రియపుత్రుడు, రావణుడంతటివాడైన యువరాజు మేఘనాధుని తాను మట్టుపెట్టినాడు.
తీవ్ర రక్తస్రావముతో తూలుతూ అన్నవద్దకు వచ్చి నిలుచున్నాడు లక్ష్మణుడు. అప్పుడు విభీషణుడు రామునితో, “మన లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించినాడు” అని పలికెను.
Also read: మరోసారి లంకాదహనం
ఆ సమాచారము వినినంతనే రాముడు లక్ష్మణుని దగ్గరకు తీసుకొని శిరస్సుపై ముద్దాడి వళ్ళునిమిరి వైద్యడగు సుషేణుని పిలిపించి ‘‘లక్ష్మణుని బాధ చూడలేకున్నాను. ఈబాణపు ములుకులనుండి నా సోదరునకు ఉపశమనము కలిగించము’’ అని చెప్పెను.
వెంటనే సుషేణుడు అమృత తుల్యములైన మూలికలను తెచ్చి నలగగొట్టి ఆ రసమును లక్ష్మణుని ముక్కులో పిండెను. ఆ మూలికల వాసన తగులుటతోడనే సౌమిత్రి వంటినుండి ములుకులన్నీ రాలి క్రిందపడెను. వ్రణములపై పైపూత పూసి చికిత్స చేసెను. అదే విధముగా విభీషణాదులందరికీ చికిత్స చేసినాడు సుషేణుడు.
రాముడు మహదానందముతో ‘‘ఇక రావణుని చావు అతి సులభము అతని కుడిచేయి నరికివేసితిమి’’ అనుచూ పలికెను.
వజ్రాయుధపు దెబ్బకూడా రావణుని మూర్ఛనందు పడవేయలేదు. కానీ ఇంద్రజిత్తు మరణవార్తను విని ఒక్కసారిగా మూర్ఛపోయినాడు రావణుడు.
నుదుటియందు కనుబొమలు ముడివడినవి. సహజముగా కోపధారి! నేటివార్త ఆతని కోపమును ద్విగుణీకృతము చేసినది. వెంటనే తన అధీనమున ఉన్న సీతమ్మను చంపవలెనని నిశ్చయించుకొని ధిగ్గున లేచెను.
నాటి రావణుని రూపము మునుపెన్నడూ ఎవరూ చూసియుండలేదు …
కడు భయంకరము!
Also read: ఇంద్రజిత్తు మయాయుద్ధతంత్రం
వూటుకూరు జానకిరామారావు