గురువారం, 16 మార్చి 2023, తెలుగుజాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంత్యుత్సవం. ‘నీ చల్లని దీవెన మాకివ్వు’ అంటూ సుప్రసిద్ధ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత త్రిపురనేని సాయిచంద్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చిత్రాన్ని బ్యానర్ ఫొటోలో ఎడమవైపు చూడవచ్చు. కుడివైపున హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించడమే అస్పృశ్యతను నివారించడం అనే నినాదం రాసి దానిని తన ముందు పెట్టకొని కూర్చొని దీక్ష చేస్తున్న పొట్టిశ్రీరాములు చిత్రం ఉన్నది. ‘ఏకపంక్తి భోజనంతో కులతత్వాలను పోకొట్టుడు’ అని కూడా శ్రీరాములు నినదించారు. ఏకపంక్తి భోజనాలలో పాల్గొన్నారు.
సాయిచంద్ పొట్టిశ్రీరాములు దివ్వస్మృతికి నివాళి ఘటిస్తూ మద్రాసు నుంచి ప్రకాశం జిల్లాలో పొట్టిశ్రీరాములు పూర్వీకుల ఊరు పడమరల్లెలోని వారి ఇంటివరకూ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించిన సంగతి విదితమే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాయిచంద్ పాదయాత్రకు స్పందించి అమరజీవి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలంటూ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఏడీ ప్రిన్సిపల్ కార్యదర్శి ముత్యాలరాజు ఒక సర్క్యులర్ జారీ చేశారు.
పాశ్చాత్య మోజులో పడి భారతీయ మూలాలను మరువవద్దనీ, ఆంగ్లభాషపైన పట్టుకోసం మాతృభాషను విడువవద్దనీ, తల్లి భాష మన తెలుగు భాషనీ తెలుగుయువతకు సాయిచంద్ ఇటీవల గుర్తు చేశారు. ‘‘ఎన్నో మరెన్నో అర్థవంతమైన ప్రాసలు, నుడికారాలు, యాసలు, భావాలను పలికించే అత్యద్భుతమైనది మాతృభాష. అట్టి మాతృభాషను బ్రతకనిద్దాం, భావితరాలు మాతృభాషలో మాట్లాడేలా కృషి చేద్దాం. మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, ఆత్మబంధువులు అందరికీ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. నా మాతృభాష తెలుగు. తెలుగులోనే మీ అందరికీ వందనం, అభివందనం, అదే మనకు నవనందనం. జైహింద్, జైతెలుగుతల్లీ’’ అంటూ 21 ఫిబ్రవరి 2023న మాతృభాషా దినోత్సవం సందర్భంగా సాయిచంద్ భావోద్వేగంతో ఒక సందేశం ఇచ్చారు. జనవరి పదో తేదీన ప్రారంభమైన పుస్తక మహోత్సవానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావడం పట్ల సంతోషం వెలిబుచ్చుతూ మరో సందేశం ఇచ్చారు.
మహాత్మాగాంధీతో దాదాపు రెండు దశాబ్దాలు గడిపిన శ్రీరాములు అహింసాసిద్ధాంతాన్ని నరనరానా జీర్ణించుకున్నారు. తెలుగు ప్రాంతాలలో ఏ పని చేయాలన్నా మద్రాసు రాష్ట్ర స్థాయి నాయకుల అనుమతి అవసరమనీ, ఆ నాయకత్వం తమిళుల చేతుల్లో ఉన్నదనీ, నాటి ముఖ్యమంత్రి రాజాజీ తెలుగుపట్ల అంత సానుభూతి కలిగిన రాజకీయ నాయకుడు కాదనీ పొట్టి శ్రీరాములు గ్రహించారు. అంతవరకూ హరిజనోద్ధరణ, కులనిర్మూలన వంటి కార్యక్రమాలను చేపట్టిన పొట్టి శ్రీరాములు ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు నడుంబిగించాల్సి వచ్చింది. అహింసావాదులు రంగంలోకి దిగి ప్రత్యేక రాష్ట్రం సాధించుకోలేకపోతే హింసావాదులు రంగప్రవేశం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధనను అసాధ్యం చేసే ప్రమాదం ఉన్నదని పొట్టి శ్రీరాములు మద్రాసు రాష్ట్రప్రజలకు 14 అక్టోబర్ 1952 విజ్ఞప్తి చేశారు. అంతకు ముందే నెల్లూరుకు చెందిన భాగవతుల లక్ష్మీనారాయణకు శ్రీరాములు లేఖ రాస్తూ రాష్ట్రం కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించాలని అన్నారు. తర్వాత భీమవరంలో స్వామీ సీతారాంను కలుసుకున్నారు. మద్రాసు నగరంకోసం పట్టుపట్టవద్దని, అది అయ్యేపని కాదని సీతారాం ఇచ్చిన సలహాను శ్రీరాములు తిరస్కరించారు. మద్రాసు నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం సాధ్య కావచ్చునని సీతారాం అభిప్రాయం. మొత్తంమీదికి మద్రాసు నగరంపైన మద్రాసు రాష్ట్రప్రజల మధ్య ఏకాభిప్రాయం కుదరాలనీ, రాజ్యాంగం మూడవ అధికరణ కింద ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలనే జమిలి డిమాండ్లతో శ్రీరాములు నిరశనదీక్ష ప్రారంభించి వాటి సాధనకోసమే ప్రాణత్యాగం చేశారు.
విశాంలాంధ్ర ఉద్యమం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రాజధాని కావడంతో మద్రాసు దక్కకుండా పోయిందనే బాధ తెలుగువారిలో క్రమంగా తగ్గిపోయింది. యాభై ఎనిమిదేళ్ళ సహజీవనం తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. మరలా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. పాత/కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానికోసం వెతుకులాట అంతులేకుండా వివాదమై సాగుతోంది. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తలుచుకోవడం, మద్రాసుకోసం శ్రీరాములు పట్టుపట్టడానికి కారణాలు ఏమిటో అర్థం చేసుకోవడం అవసరం.