వోలేటి దివాకర్
మార్గదర్శి చిట్ ఫండ్ విషయంలో మీడియా మొఘల్, మార్గదర్శి అధినేత రామోజీరావు వ్యవహరిస్తున్న తీరు సరైందేనా అన్న విషయాన్ని కృత్రిమ మేధతో పనిచేసే నూతన సాంకేతిక విజ్ఞానం చాట్ జిపిటీని ప్రశ్నించగా తప్పని తేల్చింది. అవిభాజ్య హిందూ కుటుంబం ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించవచ్చా? అని చాట్ జిపిజిని ప్రశ్నించగా తప్పని చెప్పిందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. గతంలోనే ఆర్ బీఐ మార్గదర్శి వ్యవహారాన్ని తప్పుపట్టిందని గుర్తుచేశారు.
మార్గదర్శిలో జరుగుతున్న చట్టవిరుద్ధమైన వ్యవహారాలపై తాను 17 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నానని, ఇప్పటికైనా రామోజీరావు చేస్తున్నది తప్పో..రైటో తేల్చాలని ఉండవల్లి కోరారు. రామోజీరావు లాంటి సెలబ్రెటీలు మార్గదర్శిగా ఉండాలని, చట్టవిరుద్ధంగా వ్యవహరించకూడదన్నదే తన ఉద్దేశమని, అంతే తప్ప ఆయనకు శిక్ష పడాలన్నది కాదని స్పష్టం చేశారు. రామోజీరావు తరపున రాజాజీ అనే వ్యక్తి ఒక కేసులో మార్గదర్శికి రామోజీరావుకు సంబంధం లేదని చెబుతారని, మరో కేసులో మార్గదర్శి చైర్మన్ గా రామోజీరావును పేర్కొంటారని ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం ఐపిసి 193 ప్రకారం ఏడేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. భూగరిష్ట పరిమితికి మించి 1600 పైగా ఎకరాలను సేకరించి రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారని ఉండవల్లి ఆరోపించారు. అయితే న్యాయస్థానాల్లో మాత్రం తనకు భూగరిష్ట పరిమితి చట్టం వర్తించదని వాదించారని, తెలంగాణా ప్రభుత్వం కూడా దీనితో ఏకీభవించడం వింతగా ఉందన్నారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు వంటి వారు కూడా కోర్టుకు హాజరయ్యారని, అయితే రామోజీరావు అన్నింటికీ అతీతుడిగా భావిస్తారని విమర్శించారు. మార్గదర్శి అంశంపై రామోజీరావుతో చర్చకు సిద్ధమని ఉండవల్లి పునరుద్ఘాటించారు.
మార్గదర్శిపై సిఐడికి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉండవల్లి విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ గతంలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ మార్గదర్శిపై ఇచ్చిన నివేదికను ఈకేసును దర్యాప్తు చేస్తున్న సిఐడికి పంపుతానన్నారు.
చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకులు ఇతర వ్యాపారాలు నిర్వహించరాదని, అయితే రామోజీరావు 24 కంపెనీలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ విషయాలను సిఐడి దృష్టికి తీసుకెళ్లి, చందాదారుల నిధులను షేర్ మార్కెట్లోకి దారిమళ్లించిన మార్గదర్శిపై ఈడితో దర్యాప్తు చేయించాలని ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మార్గదర్శిపై ఎలాంటి ఫిర్యాదులు లేవన్న యాజమాన్య వాదనలను ప్రస్తావిస్తూ 2008లోనే దివంగత మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అలాగే తాను కూడా మార్గదర్శిలో జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కేంద్ర ఆర్థికశాఖకు ఫిర్యాదు చేశానన్నారు. చిట్ ఫండ్ కంపెనీలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో ఇప్పటికీ సాధారణ చందాదారులకు తెలియదన్నారు. మార్గదర్శి వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన తనకు పలువురు చందాదారులు ఫోన్లు చేసి ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. చిట్ ఫండ్ సంస్థలు బోర్డు తిప్పేస్తేనే పోలీసులను ఆశ్రయిస్తారన్నారు.
ఈసందర్భంగా సహారా సంస్థ గురించి ప్రస్తావిస్తూ, చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన సహారా సంస్థ అధినేతను సుప్రీంకోర్టు తప్పుపట్టిందని, ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారన్నారు. అయితే ఇప్పటికీ సహారా పేరిట డిపాజిట్లు వసూలు చేస్తున్నారన్నారు.
రామోజీ బంధువులతో ప్రెస్ మీట్
గతంలో రామోజీరావు చేతిలో మోసపోయిన ఆయన బంధువులతోనే ప్రెస్మీట్ పెట్టిస్తానని ఉండవల్లి. అరుణ్కుమార్ చెప్పారు.