రామాయణమ్ – 197
కుంభకర్ణుడు రణరంగములో నేలకూలినాడు. రామబాణాగ్నిలో మిడతలాగా దగ్ధమయినాడు అనే వార్త చెవిని చేరటంతోటే రాక్షసరాజు ఉన్నపళముగా నేల మీద దబ్బున పడిపోయి మూర్ఛపోయినాడు.
కుంభకర్ణుని మరణవార్త విని దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరస్సులు నిర్ఘాంతపోయి నోటమాటరాని వారైరి.
Also read: కుంభకర్ణుని వధ
కాసేపటికి రావణునికి మెలకువ వచ్చినది. ‘‘హా తమ్ముడా, నిన్ను చూసుకొని కదరా నేను గర్వముతో ఉండెడివాడను. నీవు ఉన్నావనే ధైర్యముచేతనే సురాసురులను నేను లెక్కచేయక ఉండెడివాడను కదరా! నీవు లేని ఈ రాజ్యమెందులకు ,ఈ భోగమెందులకు? అసలు నేనే ఎందులకు?
‘‘నా ఉనికే ప్రశ్నార్ధకమయినదికదరా తమ్ముడా! దేవ, దానవ, గంధర్వుల పీచమణచిన నిన్ను ఎలా సంహరింపగలిగినాడురా ఆ రాముడు? ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బనే లెక్క చేయని నీకు రామబాణము మృత్యు పాశమైనదేమిరా తమ్ముడా! నాకు రాజ్యముతో పనిలేదు. ఇక సీతతో నాకు ఏమి పని? ఇక నా లక్ష్యము ఒక్కటే. నిన్ను వధించిన రాముని యమపురికి సాగనంపుటయే.
Also read: కుంభకర్ణుడి స్వైరవిహారం
‘‘మహావీరుడు ప్రహస్తుడు, జగదేక మల్లుడు కుంభకర్ణుడు మరణించిన తరువాత నాకు తెలిసి వచ్చినది ధర్మాతుడైన విభీషణుని మాట పెడచెవిని పెట్టినందులకు ఈ ఫలితము అనుభవించుట సరి అయినదే అని ….ఏమేమో తనలో తాను అనుకొనుచూ బిగ్గరగా రోదించుచూ మరలమరల మూర్ఛిల్లుతూ తేరుకుంటూ వ్యాకుల చిత్తముతో దిక్కుతోచని వాడయినాడు ఆ రావణబ్రహ్మ!
…
విలపించి విలపించి సోలిపోయి వాలిపోయినాడు రావణుడు. ఆ రాక్షసరాజు దీన స్థితిని చూసి త్రిశిరుడు, ‘‘తండ్రీ మహాపురుషులిట్లు శోకింపదగునా? నీకు బ్రహ్మదత్తమైన శక్తికవచము, సాయకము, ధనుస్సు సహస్రఖరయుక్తమైన దివ్యరథములు కలవు … అయినా నీదాకా ఎందులకు? నేను పోయివచ్చెదను.’’ ఆ మాటలకు రావణుని కి ప్రాణములు లేచివచ్చినట్లాయెను .
మహోదర, మహాపార్శ్వ, త్రిశిర, దేవాంతక, నరాంతకులు బహుసంరంభమ్మున రణస్థలికేగిరి.
Also read: రణరంగానికి బయలుదేరిన కుంభకర్ణుడు
నరాంతకుడు వానర మూకను చీల్చి చెండాడుట చూసి సుగ్రీవుడు వానిమీదకు అంగదుని పంపెను. అంగదుడు మహావేగముగా వచ్చి వానిని ఢీకొట్టి సవాలువిసిరెను. ‘‘మామూలు వానరులతో నీకేమిరా పని’’ అని అనుచూ వానిని వక్షస్థలము మీద మోదెను. వాడునూ చలించక అంగదుని తలపై మోదెను. ఆ దెబ్బకు అంగదుడు విహ్వలుడై తిరిగి తేరుకొని ఒక బలమైన ముష్టిఘాతముతో అతని తలపై మోదెను. ఆ దెబ్బకు వాడితల నూరువ్రయ్యలై నేల కూలెను.
మిగిలినవారిని ఆంజనేయ, నీల, ఋషభులు యముడికి అతిధులుగా సాగనంపిరి.
Also read: రావణునితో కటువుగా మాట్లాడిన కుంభకర్ణుడు
వూటుకూరు జానకిరామారావు