Sunday, November 24, 2024

ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని తట్టుకొని నిలిచిన జర్నలిస్టు రాజేశ్వరరావు

గొప్ప చదువరి, పాత్రికేయుడు, హెచ్ఎంటీవీ తీర్పరి (ఓంబుడ్స్ మన్) చెన్నమనేని రాజేశ్వరరావు మరి లేరు. ఆయన హైదరాబాద్ లో మార్చి ఆరో తేదీ రాత్రి పదిన్నర గంటలకు చనిపోయారు. నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన సమాచారాధికారిగా ప్రభుత్వంలో పని చేశారు. (చెన్నమనేని రాజేశ్వరరావు అంటే చనిపోయిన కమ్యూనిస్టు నాయకుడు, శాసనసభ్యుడు అనుకునేరు. ఆయన వేరు. ఈయన పాత్రికేయుడు). రాజేశ్వరరావు కరీంనగర్ జిల్లాలోని వెదిర గ్రామంలో 1939లో జన్మించారు.

ప్రముఖ జర్నలిస్టు, వరిష్ఠ సంపాదకుడు చక్రవర్తుల రాఘవాచారికి ఈ రాజేశ్వరరావు మంచి మిత్రడు. వియ్యంకుడు. రాఘవాచారి కుమార్తె డాక్టర్ అనుపమను రాజేశ్వరరావు కుమారుడు సంజయ్ పెళ్ళి చేసుకున్నాడు. రాజేశ్వరరావు కోరుకున్నట్టుగానే పుస్తకాలు చదువుతూ తుది శ్వాస వదిలారు.

కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా 1965లో రాజేశ్వరరావు వ్యాసం రాశారు. ఎక్కడ ప్రశంసించాలో అక్కడ ప్రశంసించారు. ఎక్కడ విమర్శించాలో అక్కడ విమర్శించారు. తక్కిన పత్రికలన్నీ కాసు బ్రహ్మానందరెడ్డి పాలనను ప్రశంసించగా, రాజేశ్వరరావు వ్యాసం మాత్రం విమర్శనాత్మకంగా సాగింది. ముఖ్యమంత్రి తనను పొగుడుతూ వ్యాసాలు ప్రచురించిన పత్రికలను పక్కన పెట్టి తనను విమర్శించే వ్యాసం ప్రచురించిన పత్రికను తీసుకొని ఒకటికి రెండు సార్లు చదువుకున్నారు. ఆ పత్రిక సంపాదకుడు ముఖ్యమంత్రికి ఆత్మీయ స్నేహితుడు. సంపాదకుడు రిపోర్టర్ రాజేశ్వరరావును మర్నాడు తన ఛాంబర్ కు రమ్మని కబురుపెట్టారు. ముఖ్యమంత్రికి కోపం వచ్చి ఉండాలి. అందుకే సంపాదకుడు తనను పిలిపించారు అనుకున్నారు యువ రిపోర్టర్ రాజేశ్వరరావు. రాజీనామా లేఖ టైప్ చేసుకొని తన వెంట తీసుకొని సంపాదకుడి ఛాంబర్ కు వెళ్ళారు. ‘‘నా రాతల వల్ల మీకు సీఎం గారితో ఉన్న స్నేహం దెబ్బతిన్నట్టు ఉంది. నేను రిపోర్టర్ గా కొనసాగలేను. నా రాజీనామా ఆమోదించండి’’ అని చెబుతూ రాజీనామా లేఖను అందించారు. సంపాదకుడు పెద్దగా నవ్వుతూ ఆ రాజీనామా లేఖను చించివేశారు. ఆ సంపాదకుడు ఎవరో కాదు. శివలెంక శంభుప్రసాద్.

సంపాదక మహాశయుడు అన్నారు,‘‘సందేహం లేదు. ముఖ్యమంత్రి నాకు మంచి మిత్రుడే. కానీ నీ వ్యాసం చాలా బాగుంది. ఒక జర్నలిస్టు సంపాదకుడి కంటే, ముఖ్యమంత్రి కంటే ప్రజలకు జవాబుదారీ అనే సూత్రాన్ని నువ్వు పాటించావు’’ అని మెచ్చుకున్నారు. ఆ పత్రిక ఆంధ్రపత్రిక. ఆ రోజుల్లో మంచి సర్క్యులేషన్ కలిగిన దినపత్రిక.

ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని ఒక వివేఖరి తట్టుకోగలడా?

ఈ రోజుల్లో ఒక ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని ఒక విలేఖరి తట్టుకోగలడా? అని నేను (ఈ వ్యాసరచయిత) రాజేశ్వరరావుని అడిగితే, ‘‘అయ్యవారు (సంపాదకుడు శివలెంక శంభుప్రసాద్ ని ప్రేమగా అలా పిలిచేవారు) కారణంగా బ్రహ్మానందరెడ్డిని ఎదుర్కోగలిగాను. అందరు సంపాదకులూ శంభుప్రసాద్ వంటివారు కాదు’’ అని సమాధానం ఇచ్చారు. పరిశోధనాత్మక విలేఖరి అయిన రాజేశ్వరరావుకు ఎన్ టి రామారావుతో భిన్నమైన అనుభవం ఎదురయింది. తాను సన్యాసినంటూ ఎన్ టి రామారావు ప్రకటించుకున్నప్పుడు, ఆయన సన్యాసి కారని నిరూపిస్తూ రాజేశ్వరరావు ఒక వ్యాసం రాశారు. ముఖ్యమంత్రికి ఏమేమి చిరాస్థులు ఉన్నాయో సర్వేనంబర్లతో సహా రాశారు. ఫలితంగా రాజేశ్వరరావును పత్రిక యాజమాన్యం విజయవాడకు బదిలీ చేసింది.

మళ్ళీ రాజీనామా లేఖతో రాజేశ్వరరావు సిద్ధమైనారు. అప్పటికి సంపాదకుడికి స్వేచ్ఛ లేదు. యజమాని కె. జగదీశ్ ప్రసాద్ (ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు కెఎల్ఎన్ ప్రసాద్ కుమారుడు). ‘‘నన్ను హైదరాబాద్ రిపోర్టర్ గా నియమించారు. కనుక నన్ను బదిలీ చేయజాలరు. నేను ఉండటం ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పండి. బదిలీ వేటు ఎందుకు?’’ అని జగదీశ్ ప్రసాద్ తో రాజేశ్వరరావు అని ఆ పత్రిక నుంచి నిష్క్రమించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా స్నేహితుడైనా, కాకపోయినా ఆయన ఇష్టానుసారంగా పత్రిక యజమాని వార్తలనూ, వ్యాఖ్యలనూ నియంత్రించేవారు.

ధైర్యశాలి అయిన జర్నలిస్టు

బ్రహ్మానందరెడ్డి గట్టి ముఖ్యమంత్రి. ఉధృతంగా సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కొన్నారు. విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంపైన వ్యాఖ్యానించారు. ‘‘ఉద్యమానికి పెద్దగా మద్దతు లేదు’’ అన్నారు. ఎన్ జీవోల వైఖరి గురించి ఒక విలేఖరి ప్రశ్నించినప్పుడు, ‘‘99శాతంమంది ఎన్ జీవోలు తెలంగాణ కోరుకుంటున్నప్పుడు వారితో చర్చలు ఏమి జరుపుతాం?’’ అని అన్నారు. అంతవరకూ మౌనంగా ఉండిన రాజేశ్వర్, ‘‘ముఖ్యమంత్రిగారూ, మీరు చెప్పిన దాంట్లో వైరుధ్యం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఖంగుతిన్న ముఖ్యమంత్రి వైరుధ్యం ఎక్కడున్నదో చెప్పండి అని అన్నారు. ‘‘తెలంగాణ ఉద్యమానికి మద్దతు లేదు అని అంటూనే 99శాతం మంది ఎన్ జీవోలు మద్దతు ఇస్తున్నారని అంటున్నారు’’ అని రాజేశ్వర్  ఎత్తి చూపారు.

ముఖ్యమంత్రి దొరికిపోయారు. అడ్డగోలుగా దబాయించడం ద్వారా బయటపడటానికి ప్రయత్నించారు.‘‘వైరుధ్యం మీ మెదడులో ఉంది.’’ అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి డొల్లదనం అనుమానాలకు తావులేకుండా బయటపడింది. ఎనభై మూడవ ఏట రాజేశ్వర్ హెచ్ఎంటీవీ భవనంలో ఒక చిన్న చాంబర్ లో పుస్తకాలు, వార్తాపత్రికలు, మ్యాగజైన్ల నడుమ కూర్చొని ఉన్నారు. యువ విలేఖరులు రాసిన వార్తలలో తప్పులు దిద్దుతున్నారు. అమర్త్యసేన స్వీయచరిత్రపై నుంచి దృష్టి మళ్ళించకుండా ఏకాగ్రచిత్తంతో చదువుతున్నారు. తన ఛాంబర్ లో ప్రవేశించి తనకు అభివాదం చేసిన  వ్యక్తిని గమనించలేదు. గిరిష్ కర్నాడ్ స్వీయచరిత్ర కూడా పక్కనే ఉన్నది ఆయన దృష్టిలో పడటం కోసం నిరీక్షిస్తూ. ఆయన చుట్టూ ఉన్న షెల్ఫ్ లూ, టేబుల్సూ అన్నీ పుస్తకాలతో నిండిపోయాయి. డ్రాయర్ లాగి అందులోనుంచి ఇటీవల హన్స్ ఇండియాలో పడిన తన వ్యాసం ప్రతిని సందర్శకుడికి (నాకు) ఇచ్చారు.

ఆంధ్రపత్రిక ఉద్యోగం

ఆ తర్వాత ఆంధ్రపత్రికలో స్టాఫ్ రిపోర్టర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం పిలిచారు. ఏ అభ్యర్థినైనా మూడు, నాలుగు రోజులు ఇంటర్వ్యూ చేసి నిర్ణయాన్ని వారం, పదిరోజుల తర్వాత తీసుకోవడం సంపాదకుడి శంభుప్రసాద్ ఆనవాయితీ. మద్రాసు రైల్వే సెంట్రల్ స్టేషన్ లో ఒక ప్లకార్డు పట్టుకొని ఆంధ్రపత్రిక జనరల్ మేనేజర్ నిలబడి ఉన్నారు. ఆయన రాజేశ్వరరావుకి స్వాగతం చెప్పారు. రాజకీయాలు, కళలు, సాహిత్యం, అంతర్జాతీయ వ్యవహారాలపైన ఇంటర్వ్యూ గంటల తరబడి సాగింది. ఇంటర్వ్యూ అయిన తర్వాత తిరిగి హైదరాబాద్ కి బయలు దేరుతుంటే కొద్ది నిమిషాలు ఆగమని సంపాదకుడు చెప్పారు.  శంభుప్రసాద్ స్వయంగా టైపు చేసి నియామక పత్రాన్ని అందజేశారు. ఆశ్చర్యపోయిన రాజేశ్వరరావు తాను డెయిలీ న్యూస్ లో ఒక నెలరోజుల నోటీసు ఇవ్వవలసి ఉంటుందని చెప్పారు. అందుకు అనుగుణంగా నియామకపత్రంలోని తేదీని మార్చి ఇచ్చారు. తాను రాజీనామా సమర్పించిన వెంటనే దాన్ని ఆమోదించిన వీబీ రాజు గొప్పదనాన్ని రాజేశ్వరరావు  ప్రశంసించారు. బాగా పని చేశారంటూ విలేఖరిని రాజు అభినందించారు.

ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక ఒక వెలుగు వెలుగుతున్న దినపత్రిక. ఆ పత్రిక దిల్లీ ప్రతినిధిగా దశాబ్దానికి పైగా పనిచేశారు రాజేశ్వర్.

ఇందిరాగాంధీని ప్రశ్నించిన జర్నలిస్టు

ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీకి ఒక మంత్రిత్వశాఖలో మార్పులు చేసే అధికారం ఉన్నది. దేశీయాంగశాఖలో ఉండిన రెవిన్యూ, రాజకీయ నిఘా విభాగం నుంచి రెవెన్యూ ఇంటెలిజెన్స్ ను వేరు చేశారు. రాజేశ్వరరావు ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మంత్రిమండలి సహచరుడి నుంచి ఈ విశేషమైన అధికారాలను ప్రధాని తన చేతుల్లోకి తీసుకోవడాన్ని ముఖ్యమైన పరిణామంగా గుర్తించారు. హైదరాబాద్ లో విలేఖరు గోష్ఠిలో ప్రధాని ఇందిరాగాంధీ మాట్లాడినప్పుడు ఆమెను ప్రశ్న అడిగేందుకు రాజేశ్వరరావుకి అవకాశం వచ్చింది. ‘‘ప్రధానమంత్రిగారూ, మీలో నియంత అయ్యే ధోరణి కనిపిస్తున్నది’’ అని అన్నారు. ‘‘అట్లా అని మీరెందుకు అనుకుంటున్నారు?’’ అంటూ ఇందిరాగాంధీ ఎదురుప్రశ్న వేశారు. మంత్రిత్వశాఖలోని విభాగాలను మార్చడం గురించి రాజేశ్వరరావు ప్రస్తావించారు.

ఆమె చిరునవ్వు నవ్వి, ‘‘తర్వాత ప్రశ్న’’ అంటూ ముందుకు సాగారు. విషయం రూఢి అయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు రాజేశ్వరరావుని ‘‘ప్రధానిని పట్టుకొని అటువంటి ప్రశ్నఅడిగేందుకు మీకు ఎన్ని గుండెలు?’’ అన్నారు. ‘‘అది జర్నలిస్టు విధి’’ అంటూ రాజేశ్వరరావు సమాధానం చెప్పారు.

నేటి ప్రధాని మీడియాతో మాట్లాడనే మాట్లాడరు. తన ఆలోచనలను ఆకాశవాణి ప్రసారం చేస్తున్న ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రజలతో పంచుకుంటారు. అది ఏకపక్ష సంభాషణ. ప్రశ్నలు, సమాధానాలు ఉండవు. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడకుండా ఒక రికార్డు నెలకొల్పారు. ఎవరైనా ముఖ్యమంత్రి ఈ రోజుల్లో మీడియా గోష్ఠి ఏర్పాటు చేసినా సరే విలేఖరులు ప్రశ్నలు అడగడం అరుదు. ఈ  ధోరణి ఆశ్చర్యంగా ఉన్నదని రాజేశ్వర్ వ్యాఖ్యానించారు.

జర్నలిస్టు జీవితాన్ని అదరగొట్టే తీరులో ప్రారంభించారు

ఒక మంగళవారంనాడు రాజేశ్వర్ ఆంధ్రపత్రికలో చేరారు. ఇప్పటికీ ఆయనకు స్పష్టంగా గుర్తు. రాష్ట్ర శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం రిపోర్టు చేయవలసిందిగా చీఫ్ రిపోర్టర్ ఆదేశించారు. ఇటువటి పని సర్వసాధారణంగా ఒక అనుభవజ్ఞుడైన విలేఖరికి అప్పజెప్పుతారు. సభలో వినపడిన ప్రతి మాటనూ జాగ్రత్తగా వినాలి. అనుబంధ ప్రశ్నలను సైతం అర్థం చేసుకోవాలి. ప్రతి ప్రశ్న విభిన్నమైన అంశంపైన ఉంటుంది. రోజులో పది భిన్నమైన విషయాలు ప్రస్తావనకు వస్తాయి. రాజేశ్వర్ కు ఈ విషయం తెలుసు. ఆ రోజు ఆయన సమర్పించిన వార్త మరుసటిరోజు పత్రికలో ప్రధాన శీర్షిక (బ్యానర్)గా ప్రచురితమైంది.

రాష్ట్రంలో పరిశ్రమలను ఎట్లా ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని శుక్రవారం అధ్యయనం చేసి వ్యాఖ్యానసహితంగా విశ్లేషణ రాశారు. రెండో రోజు కూడా ఆయన రిపోర్టు బ్యానర్ గా వచ్చింది. ఆ వార్త ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది. శనివారంనాడు ముఖ్యమంత్రి ఆ విషయం గురించి మాట్లాడారు. దాన్నికూడా వార్తగా రాశారు. మూడో రోజు సైతం రాజేశ్వర్ రాసిన వార్తే ప్రధాన శీర్షికగా వచ్చింది. చేరీచేరడంతోనే తన రిపోర్టులతో సమాజంపైన ప్రభావం వేయడం ప్రారంభించారు. ఒక జర్నలిస్టుకు ఇంతకంటే కావలసింది ఏముంటుంది?

అసంకల్పితంగా జర్నలిజంలోకి…

వందల ఎకరాల భూమి కలిగిన భూస్వామి కుటుంబంలో రాజేశ్వరరావు జన్మించారు (ఇప్పుడు ఆ ఆస్తులు లేవనుకోండి). హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుంచి అప్పు తీసుకోవలసి వచ్చింది. సమానత్వం, న్యాయం అందరికీ వర్తించాలని నమ్మే లౌకికవాది, సామాజికవాది, ప్రజాస్వామ్యవాది రాజేశ్వర్. విద్యార్థిగా ఉన్న రోజులలోనే ఇంగ్లీషు పత్రికలూ, పుస్తకాలూ కొనడానికి నెలకు అయిదు వందల రూపాయలు ఖర్చు చేసేవారు. మంచి అధ్యయనశీలిగా ఆయనకు అంతర్జాతీయ పరిణామాలు, ఇంగ్లీషు సాహిత్యం, కవిత్వం, సినిమా, సాంస్కృతికరంగం క్షుణ్ణంగా తెలుసు. ఈ విషయాలపైన కరీంనగర్ కు చెందిన ఆదర్శవంతమైన రాజకీయవేత్త జువ్వాది చొక్కారావుతో చర్చించేవారు. చొక్కారావు కేబినెట్ మంత్రిగా, ఎంఎల్ఏగా, ఎంపీగా పని చేశారు. రాజేశ్వర్ కి ఆయన సమీప బంధువు కూడా. ఒక సందర్భంలో అంతర్జాతీయ అంశాలపైన సాధికారికంగా మాట్లాడుతున్న చొక్కారావును చూసి వరిష్ఠ కాంగ్రెస్ నాయకుడు వల్లూరి బసవరాజు ఆశ్చర్యపోయారు. ‘‘తెలుగుపత్రికలలో ప్రచురణ కాని ఈ అంశాలు మీకు ఎట్లా తెలుస్తున్నాయి?’’ అని అడిగారు. ‘‘మా మేనల్లుడు ఇంగ్లీషు పత్రికలు చదివి నాకు చెబుతాడు’’ అంటూ చొక్కారావు సమాధానం చెప్పారు. ఆ మర్నాడు వీబీ రాజు రాజేశ్వరరావును ‘డెయిలీ న్యూస్’ కార్యాలయానికి పిలిచి ఉపసంపాదకుడిగా చేరమంటూ ఆహ్వానించారు. ‘‘నేను జర్నాలిస్టును కాను. జర్నలిస్టు కావాలని అనుకోవడం లేదు’’ అని రాజేశ్వరరావు అన్నారు. కానీ రాజేశ్వరరావు మంచి జర్నలిస్టుగా ఎ దుగుతారని వీబీ రాజు నమ్మకం. రాజేశ్వరరావుని డెయిలీ న్యూస్ లో చేరవలసిందిగా ప్రోత్సహించి నెలకు రూ. 150ల వేతనంపైన ఉద్యోగం ఇచ్చారు. కన్వేయన్స్ అలవెన్సు పేరు మీద మరో పది రూపాయలు ఇచ్చేవారు. చేరిన తర్వాత కొద్ది రోజులకే డెస్క్ ను నిర్వహించడంలో తన ప్రతిభను చాటుకున్నారు. ఆ విధంగా అసంకల్పితంగా ఒక పత్రికాపాఠకుడు ఒక పత్రికలో ఉపసంపాదకుడిగా చేరారు. పత్రికలు చదివే అలవాటు ఆయనను పత్రికా రచయితగా చేసింది. ఆరు దశాబ్దాలపాటు ఆయన పాఠకుడిగా, రచయితగా కొనసాగడం విశేషం. ఇంతకీ, జర్నలిస్టు రాజేశ్వరరావులాగా ఈ రోజు ఏ  జర్నలిస్టు అయినా ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని తట్టుకొని నిలబడగలరా?

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles