Thursday, November 21, 2024

ప్రపంచంలోని తొలి భౌతికవాదులు మన చార్వాకులు

జైన, బౌద్ధ ధర్మాల గురించిన సమాచారం మనకు చాలానే అందింది. కానీ, చార్వాకుల వివరాలూ, వారి సాహిత్యం ఎందుకు అందలేదూ? అంటే వైదిక ధర్మ ప్రబోధకులు పనిగట్టుకుని ఆ సాహిత్యాన్ని అనవాళ్ళు లేకుండా నాశనం చేశారు కాబట్టి! మరి, ఈ మాత్రం కొన్ని విషయాలయినా మనకు ఎలా అందాయీ? అంటే చార్వాక/లోకాయతలను తీవ్రంగా ఖండించిన వైదికుల రచనల నుండి కొన్ని విషయాలు అందాయి. అంటే చార్వాక విరోధుల నుండి కొన్ని సంగతులు బయటికి వచ్చాయి. చార్వాక విరోధులు ఏయే విషయాలలో చార్వాకులతో విభేదించారో – వారు రాసినప్పుడు, చార్వాకుల ఆలోచనలు  కొన్ని మనకు తెలిశాయి. హేతువాద దృక్పథంతో చూసినప్పుడు,  చార్వాకులు వాస్తవాలు మాట్లాడుతున్నారనీ మనకు అనిపిస్తుంది. ఉదాహరణకు దయానంద సరస్వతి తన ‘సత్యార్థ ప్రకాశ్’లో  వేదాలను చార్వాకులు తిరస్కరించారని చెపుతూ ‘‘వేదవిద్య లేకపోతే అవిద్య విస్తరిస్తుంది’’- అని అన్నాడు. ఒప్పుకుందామా? అలాగే తల్లిదండ్రుల కలయికతోనే సంతానం కలుగుతుందని చార్వాకులు చెప్పింది  నిజమే – కానీ, తొలి మానవుడు ఎలా పుట్టాడూ?- ఈ విషయం చార్వాకులు ఎందుకు గ్రహించలేదు- అని ప్రశ్నించాడు. లా చార్వాకుల విరోధుల నుండే చార్వాకుల ఆలోచనలు మనకు అందాయి.

Also read: భారత్ విశ్వగురువు ఎలా అయ్యింది?

చార్వాక ఆలోచనా విధానాన్ని గురువైన బృహస్పతి బహుళ ప్రచారంలోకి తెచ్చాడని దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశ్ లో రాశాడు. సాధారణ శకానికి చాలా ముందు బృహస్పతి అనేక నియమాలు రాశాడు. వ్యవసాయం ఎలా చేయాలి? వ్యాపారం ఎలా చేయాలి? సరకుల మార్పిడి ఎలా జరగాలి? – వంటి నాటి నిత్యజీవితానికి అవసరమైన పలు అంశాల గూర్చి రాశాడు. ఇవే కాకుండా పరిపాలకుడైన రాజుకు ఏయే లక్షణాలు ఉండాలో కూడా రాశాడు. ఆ కాలంలే పద్దెనిమిది గణరాజ్యాలుండేవి. ప్రతి గణానికీ ఒక ఈశ్వరుడు (రాజు- అధిపతి) ఉండేవాడు. గణానికి అథిపతే గణాధిపతి. గణానికి ఈశుడెవరో అతడే గణేశుడు. అంతేకాని, వైదిక ధర్మకర్తలు కల్పించిన ఏనుడు తొండంలో ఉండే గణపతి కాదు. అది తొండి గణపతి. ఆ కాలంలో ఉన్న గణపతికి అర్థాలు మార్చి పిట్టకథలు ప్రచారం చేశారు కాబట్టి, అది తొండి అనే కదా అనుకోవాలి? గణానికి ఈశుడైన వాడికి ఏ లక్షణాలు ఉండాలో బృహస్పతి ఇలా రాశాడు-‘‘భూమిని తల్లిగా భావించేవాడు- ప్రజల సుఖాలు చూసేవాడు -రక్షించగల బలశాలి- సమస్యల్ని పరిష్కరించే బుద్ధిశాలి- స్త్రీలపై చూపు పడనివాడు’’- ఈ విషయాలన్నీ అయిదు వేల సంవత్సరాల క్రితం చెప్పినవి. ఆ తర్వాత చాలా కాలానికి చాణుక్యుడు ఈ అంశాలన్నిటనీ చేర్చి అర్థశాస్త్రం ప్రకటించాడు. చార్వాకుల గురువైన బృహస్పతి పేరును తొక్కిపెట్టి, బ్రాహ్మణార్యుడైన చాణుక్యుడికీ, అతని అర్థశాస్త్రానికీ ప్రాచుర్యం కల్పించుకున్నారు.

Also read: ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?

చార్వాక సాహిత్యం విరివిగా లభించలేదు కాని, ప్రపంచానికి భౌతికవాదం గురించి చెప్పిన తొలి తార్కికవాదులు వారే. వారిని మనం భౌతికవాదులు, దేహవాదులు, తర్కవాదుల, నాస్తికులు వంటి పేర్లతో పిలుచుకోవచ్చు. మన దేశ సంపదను మనమే నాశనం చేసుకుని, కొన్ని వేల ఏళ్ళ నుండి మనువాదుల ప్రభావంలో పడి, భ్రమల్ని నమ్ముతూ, మూఢనమ్మకాల్ని నమ్ముతూ, దుష్ట సంప్రదాయాలను ఆచరిస్తూ జీవితం దుర్భరం చేసుకుంటున్నాం. ఇదే పరిస్థితి యూరోప్ దేశాలలో కూడా వచ్చింది. అక్కడి మత న్యాయస్థానాలు హేతువాదుల్ని, తర్కవాదుల్ని, తాత్త్వికుల్ని, శాస్త్రజ్ఞుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. మత ఛాందసుల అఘాయిత్యాలు చెప్పనలవి కానంతగా అక్కడ జరిగాయి. నిజమే! కానీ, అక్కడి వారు తమ ఆలోచనా ధోరణిని మార్చుకుని భౌతికవాదులకు శాస్త్రజ్ఞులకు అడ్డుపడడం తగ్గించారు. ఫలితంగా ఆ దేశాలు వైజ్ఞానిక ప్రగతిని సాధించాయి. మన దేశంలో హేతువాదుల్ని ఇప్పటికీ చంపుతూనే ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రగతి లేదు. 17వ శతాబ్దం నుండి యూరోప్ దేశాలు సాధించిన వైజ్ఞానిక పరిశోధనా ఫలితాల్ని మన దేశం కూడా అనుభవిస్తూనే ఉంది. అయినా సిగ్గు లేకుండా ‘‘అవన్నీ మా పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారని’’ కొందరు గొప్పలు చెపుకుంటున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. గుండెమీద చేయి వేసుకుని, నిజాయితీగా ఆలోచిస్తే దేశంలో జరుగుతున్నదేమిటో అర్థమవుతుంది.

Also read: ఏ మనిషినీ సున్నా కింద తీసిపారవేయలేం!

భౌతికవాదులు ఎప్పుడూ తామూ చూడని, తమకు అనుభవంలోకి రాని విషయాల్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఉదాహరణకు దేవుడు, దయ్యం, స్వర్గం, నరకం, కర్మ, ఆత్మ, పునర్జన్మ వంటి వాటికి ఎప్పుడూ ఎక్కడా ఆధారాలు లేవు. ఇలా ఆధారాలు లేనివాటిని లోకాయతులు, చార్వాకులు అసలు పరిగణనలోకి తీసుకోరు. చార్వాకులు స్పృహను స్పృహగా  మాత్రమే గుర్తించారు. దాన్ని ‘‘చైతన్య విశిష్ట దేహ ఎవ ఆత్మ’’గా పరిగణించారు. పురుషార్థకామమోక్ష-పురుషార్థాలు నాలుగు అని వైదిక ధర్మం చెపుతోంది. ధర్, అర్థ, కామ, మోక్షాలలో-అర్థ, కామ అనే రెంటిని మాత్రమే చార్వాకులు ఒప్పుకున్నారు. ధర్మ, మోక్షాలను పూర్తిగా తిరస్కరించారు. ఎందుకంటే, ఆ రెండు పూజారుల, పురోహితుల, బ్రాహ్మణుల పొట్ట కూటి కోసం జనాన్ని మోసం చేసి దోచుకోవడం కోసం కల్పించినవని తేల్చిచెప్పారు.  కామ, అర్థలను ఒప్పుకున్నారు. ఎందుకంటే మనిషికి కోరికలు (కామ) ఉంటాయి. అవి తీరాలంటే ధనం, సంపద (అర్థం) తప్పనిసరి. అందువల్ల వాటిని స్వీకరించారు. ధర్మానికి ఆధారం ధనమేనన్నారు. మోక్షం సాధించాలంటే ధర్మప్రవర్తన అవసరమనీ బ్రాహ్మణార్యులు తమ జీవనానికి ఉపయోగపడే నీతి సూత్రాలు ప్రచారం చేశారు. కాబట్టి, చార్వాకులు వాటిని తిరస్కరించారు. అలాగే సంశయాత్మకంగా (skepticism) ఉండే వాటిని కూడా ఒప్పుకోలేదు.

Also read: భౌతికవాదాన్ని తవ్వితీసిన దేవీప్రసాద్ ఛట్టోపాధ్యాయ

జ్ఞానమంతా దాదాపు అనుభవం నుంచి వచ్చిందే గనుక, లోకాయతులు దాన్ని తప్పక స్వీకరించారు. Empiricism ను స్వీకరించారు. మనిషయినవాడు తన పురోగతిని తను చూసుకోవాలి. తన ఆరోగ్యం తను కాపాడుకోవాలి. తను సంతోషంగా ఉన్నప్పుడే అతను ఇతరుల గురించి ఆలోచించగలడు. వారికి తగిన సహాయం చేయగలడు. కష్టాల్లో కుమిలిపోయేవాడు ఇతరుల గూర్చి ఆలోచించలేడు. ఇతరులకు ఏ సహాయమూ చేయలేడు. వ్యక్తిగతంగా ఎవరికి వారు వృద్ధిలోకి వస్తే సమాజం కూడా అభివృద్ది అవుతుంది. జీవితంలో వెలుగుచీకట్ల వలె- సంతోషంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది. భరించాల్సిందే – దాన్ని అధిగమించాల్సిందే- అన్నది చార్వాకుల సిద్ధాంతం.

Also read: నేను అంటే ఎవరు?: ఒక వైజ్ఞానిక వివరణ

వైద్య విద్యార్థులు ఇన్ని వందల సంవత్సరాలుగా మానవుల మృత దేహాల్ని కోసి అవయవ నిర్మాణం గురించి అధ్యయనం చేస్తున్నారు కదా? మరి ఎవరికీ ఎప్పుడూ ఆత్మ కనబడలేదు ఎందుకూ? పోనీ జీవించి ఉన్నవారికి ఆపరేషన్లు చేస్తున్నారు కదా?? ఒక్కోసారి ఆపరేషన్ విఫలమై అక్కడే ఆ బల్లమీదే కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. పోనీ అప్పుడైనా డాక్టర్లకు ఆత్మ కనబడాలి కదా? కనబడడం లేదు. ఎందుకంటే అలాంటిది ఏదీ లేదు కాబట్టి! ఇంత ప్రగతి సాధించిన తర్వాత కూడా కనిపెట్టలేని ఆత్మ ఇక లేనట్టేకదా? ఇదే విషయం సాధారణ శకానికి ముందు చార్వాకులు కేవలం తమ పరిశోధనలతో, వివేకంతో ఆత్మలేదని చెప్పారు. మరి వారు తెలివిగలవాళ్ళా? తెలివి లేనివాళ్ళా? ఆలోచించుకోవాల్సింది మనమే! మనుషులకు ఆత్మ ఉంటుందని అంటున్నారు కదా!‘‘మరి కుక్క, గాడిద వంటి జంతువులకు కూడా ఆత్మ ఉంటుందా? అవి కూడా జీవం ఉన్న ప్రాణులే కదా?’’- అని చార్వాకులు బ్రాహ్మణార్యులన్ని ఆనాడే ప్రశ్నించారు. సమాధానం చెప్పి ఒప్పించే తెలివిలేని ఆ మనువాదులు చార్వాకుల్ని దుష్టులని, ధూర్తులని ఈసడించుకున్నారు. అంతేకాదు, వారి ఆలోచనలు ముందు తరాలకు అందకుండా జాగ్రత్తపడ్డారు. తర్కవాదులు బలపడితే ధర్మగురువుల దుకాణాలన్నీ మూత పడతాయి. వారి ఉనికికే ప్రమాదం అని గ్రహించి, చార్వాకుల్ని అన్ని రకాలుగా నాశనం చేశారు. అందువల్లనే చార్వాక సాహిత్యం మనదాకా రాలేదు. దాని స్థానంలో బ్రాహ్మణార్యులు తమ సాహిత్యం కుప్పలు తెప్పలుగా గుమ్మరించారు. జనాల్ని భ్రమల్లో, విశ్వాసాల్లో, కట్టుకథల్లో ముంచి జ్ఞాన హీనులుగా తయారు చేశారు. అందుకే చూడండి. దేశంలో ఇప్పటికీ జ్ఞానహీనుల సంఖ్యే ఎక్కువ. అజ్ఞానుల్ని, అమాయకుల్ని క్షమించవచ్చు. చదువు, స్థాయి, హోదా ఉండి కూడా జ్ఞానహీనులుగా ప్రవర్తించేవారిని ఏమందాం? ఎలా మార్చుకుందాం?

Also read: దేశాన్ని సానిటైజ్ చేద్దాం!

వైదిక మత ప్రబోధకుల ప్రసక్తి, బ్రాహ్మణార్యుల ప్రసక్తి రాగానే సమకాలీన సమాజంలో ఉన్నవారు ఉలిక్కిపడగూడదు. ఇక్కడ చర్చించేదంతా వేల ఏళ్ళ క్రితం జరిగిన అఘాయిత్యాల గురించి – అందులోంచి ఇప్పటికీ బయట పడలేని అజ్ఞానుల గురించి మాత్రమే! మనుషులంతా ఒక్కటే అని వైజ్ఞానిక పరిశోధనలు తేల్చి చెప్పిన సత్యాన్ని పక్కన పెట్టి ఇంకా అగ్రకులస్థులమని అహంభావంతో ప్రవర్తించేవారు  వారి పంథాను మార్చుకుంటే బావుండు కదా? అని అనుకుంటాం. అణగారిన వర్గాల వారు కూడా న్యూనతాభావంతో కుంచించుకు పోగూడదని భావిస్తాం. తప్పిస్తే ఎవరి మీద ఏ ద్వేషమూ వెళ్ళగక్కడం లేదు. మానవవాదులు మనుషులందరినీ సమానంగా ప్రేమిస్తారు. సమానంగా గౌరవిస్తారు. మనుషులందరూ వివేకవంతులై హేతువాద దృక్పథంతో ఆలోచిస్తే సామాజిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.  పురాణాల పరిజ్ఞానంతో సమాజాన్ని ఇంకా శాసించాలని ప్రయత్నించే మూర్ఖులు వాటిని పక్కన పెట్టి, విజ్ఞానశాస్త్రం, చరిత్ర వంటి లోకజ్ఞానం పెంచుకునే పుస్తకాలు చదవాలి. దేశంలో నాస్తిక కేంద్రం ఏర్పాటు చేసి, ప్రపంచ నాస్తిక సభలు నిర్వహించిన మహనీయుడు, తెలుగువాడు గోపరాజు రామచంద్రరావు (గోరా) ఎవరో, ఆయన నేపథ్యం ఏమిటో తెలుసుకుంటే, మన చదువుకున్న మూర్ఖుల కళ్ళు తెరుచుకునే అవకాశం ఉంది.

మరొక ముఖ్యమైన విషయం గమనించండి. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చరిత్రకారుడు కాకపోయినా, బాగా చదువకున్నవాడు. జ్ఞాని. అందుకే ఆయన తన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ గ్రంథంలో చార్వాకుల ప్రసక్తి తెచ్చారు. వారి తార్కిక వాదనకు ఆకర్షితుడై నిరీశ్వరవాదిగా మారి ఉంటారు. ఆయన రూపకల్పన చేసిన ‘సైంటిఫిక్ టెంపర్’ అనే పదం కూడా చార్వాకుల ఆలోచనా ధొరణికి ప్రభావితుడై చేసి ఉంటారు. ఆ స్పృహతోనే – దేశం వైజ్ఞానిక దృక్పథంతోనే ముందుకు పోతుందని చెప్పి ఉంటారు. ఈ దేశం చార్వాకుల ఆలోచనా విధానాన్ని అనురించి ఉంటే, శీఘ్రగతిన వైజ్ఞానికంగా ముందడుగు వేసి ఉండేది – విదేశీయుల పాలనలోకి పోకుండా ఉండగలిగేది. ఇప్పుడ ఉట్టి మాటలకు పరిమితమైన ‘విశ్వగురువు’ అనే మాట భారతదేశం నిజంగానే సార్థకం చేసుకుని ఉండేది. మనం దారి తప్పినప్పుడు గమ్యం కూడా పక్కకు తప్పుకుంటుంది. ఆ విషయం ఇకనైనా గ్రహించుకోవాలి! చార్వాక/బృహస్పతి దర్శనాల్ని పునరుద్ధరించుకోవాలి!!

Also read: చదవడం కాదు, సి.వి. రచనలు జీర్ణించుకోవాలి!

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

4 COMMENTS

  1. బృహస్పతిని వెనుకకు తోసి చార్వాకునికి ఘనత నిస్తున్నారు. ఎందుకలాగ? లోకాయతలకు థర్మం అక్కర్లేదు. థర్మంనుంచే చట్టాలు వచ్చాయికదా! అంటే వీరి గణనాథులు ఏమంటే అదే ధర్మం,న్యాయం,చట్టం. ఎవరికీ తెలియని మనువాదం పట్టుకొని వేళ్ళాడుతున్నారు. మనువాదం రామాయణ భారత భాగవతాలలో వుందా?అంతకు ముందే వుందా? చరిత్రలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసిన రాజులెవరూ? బ్రాహ్మణార్యులు ఎప్పుడు పుట్టుకొచ్చారు?
    మీరు నమ్మిన వాదం నమ్మండి, నమ్ముతునే కాలంలో కాస్త వెనక్కి వెళ్లి వాటి ఆధారాలు వెతకండి.

  2. యింత కన్న గొప్పవాదనలు యీ కాలంలోనే కాదు, అన్ని కాలాల్లోనూ జరిగాయి. దేనిని యెంత వరకు గ్రహించాలో అంతవరకు గ్రహించి పరమార్థం సాధించపజేయడమే వైదిక సంస్కృతి లక్ష్యము.
    మహానుభావులు అందరూ యీ బాట ననుసరించిన వారే. అది తెలియక ఆర్షధర్మమును నిరసించుట తుచ్ఛమైన, నీచమైన విషయము.

  3. Every theory has its own strengths and weaknesses.
    Complying all theories and taking goodness from them is always good thing

  4. బావిలో కప్పల బెకబెకలు తప్ప మీకు ఏమీ తెలుసు, మెకాలే గాడి నాలుగు అక్షరాలు మాత్రమే బట్టీ పట్టి, పరదేశి పందుల ఎంగిలి మాటలు రాసే మీ తెలివి తెలివా… మీ దగ్గర విషయం వుండదు, నోటికొచ్చిన పిచ్చి రాతలు రాసి, మీకు మీరే బిరుదులు ఇచ్చుకుని సమాజాన్ని సర్వ నాశనం చేయడానికి అవసరమైన ప్రతీ చెడు దారి వెదుకుతున్నారు,
    దమ్ము ధైర్యం తెలివి తేటలు వుంటే బహిరంగ చర్చకు రండి, ప్రజలే మీ సంగతి తేలుస్తారు,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles