రామాయణమ్ – 189
హనుమంతుడు అకంపనుని, అంగదుడు వజ్రదంష్ట్రుని, వానర సేనానినీలుడు రాక్షససేనాని పహస్తుని యమలోకమునకు సాగనంపిరి.
యుద్ధరంగమంతా భీతావహంగా ఉంది. ఎటువైపు చూసినా భీభత్సమే. రక్త ప్రవాహముతో నిండిన భూమి వైశాఖ మాసములో ఎర్రటి మోదుగలు పరచిన పుడమిలా ఉన్నది. చనిపోయినవారి కొవ్వుఅనే నురగతో నిండిపోయిన ఎర్రెర్రటి నది అది. ఆ రణభూమిలో పిరికి వారెవరికీ ప్రవేశములేదు!
Also read: హనుమ, అంగద ప్రతాపం, రాక్షస యోధుల మరణం
‘‘ప్రహస్తుడు మరణించినాడా?’’ నమ్మలేకపోయినాడు రావణుడు ….‘‘అవును మరణించినాడు ఇది నిజం. ముమ్మాటికీ నిజం మహారాజా’’ అని సైనికులు తెలుపగా ఇక తానే స్వయముగా రణరంగమునకు బయలుదేరినాడు రావణుడు.
నల్లని మేఘమువలే, ప్రజ్వరిల్లిన అగ్ని శిఖవలె ప్రమథ గణసేవితుడైన రుద్రునివలె, రావణుడు గొప్పతేజస్సుతో ప్రకాశించుచూ రాక్షస గణములు వెంట అనుసరించగా రణస్థలికి తానే ఉరికినాడు.
Also read: గరుత్మంతుడి ఆగమనం, రామలక్ష్మణులకు నాగబంధవిముక్తి
ఎదురుగా కడలివలే కదలుతూ ఉప్పొంగే సేనావాహినిని చూస్తూ రామచంద్రుడు విభీషణుని తో ‘‘ఆ సైన్యము ఎవరిది?’’ అని ప్రశ్నించెను.
‘‘రామచంద్రా, అదుగో! ఏనుగెక్కి ఉదయసూర్యునివలె ఎర్రని ముఖముగల ఆ యోధుడు”ప్రవీరబాహువు.” అదిగో, ఆ రధముమీద రెపరెప లాడే సింహధ్వజము. ఆ రధము ఎక్కి వచ్చే రణకర్కశుడు ఇంద్రజిత్తు. అదుగో ఒక మహాపర్వతము కదలినట్లుగా కదులుతున్నాడే వాడే అతికాయుడు. ఎర్రనైన కన్నులతో ఏనుగునెక్కి గంటలు వాయించుకుంటూ వస్తున్నాడే, వాడు మహోదరుడు. చిత్రాతిచిత్రమైన అలంకరణలతో ఉన్న ఆ గుర్రము చూడు, దానినెక్కి వచ్చే దానవుడు “పిశాచుడు.”
‘‘వాడిగల శూలమును ఒడుపుగా పట్టుకొని ఆటవిడుపుగా తిప్పుతూ వస్తున్నాడే, వాడే “త్రిశిరస్కుడు.” అడుగో, ఆ సర్ప రాజ చిహ్నము గలవాడు కుంభుడు, అడుగో వీరకృత్యములు చేయు నికుంభుడు. వాని చేతిలో వజ్రాలుపొదగబడిన పరిఘ ఉన్నది’’ అనుచూ రావణుని పరివేష్టించి ఉన్న రాక్షసవీరుల గురించి చెపుతున్నాడు విభీషణుడు.
‘‘మిత్రమా విభీషణా, ఎవరా దివ్యపురుషుడు? రావణుడేకదా?
తేరిపార చూడలేని వింతతేజస్సు ఉట్టిపడుతూ మహాదర్పంతో కదలి వస్తున్నాడు.
Also read: ఇంద్రజిత్తు నాగాస్త్రం వల్ల మూర్ఛిల్లిన రామలక్ష్మణులు
‘‘ఇన్నాళ్ళకు ఈ పాపాత్ముడు నా కంటబడినాడు. వీడు నా క్రోధాగ్నిలో పడి శలభమువలె మాడిపోవును గాక!’’ అని పలుకుచూ ధనుస్సు ఎత్తిపట్టి నిలుచుండినాడు. ఆయన వెనుక ధనుర్ధారియై లక్ష్మణుడు కూడా సిద్ధముగా నిలబడినాడు.
ఇంతలో ఒక పెద్ద పర్వత శిఖరమును హఠాత్తుగా పెకిలించి సుగ్రీవుడు రావణునిపై ఎత్తి పడవేసినాడు.
వెనువెంటనే బంగారుపొన్నులు గల బాణములతో దానిని రావణుడు ఛేదించి వేసెను. ఆ వెంటనే మహోగ్రరూపము దాల్చి రావణుడు ఒక సర్పాకారముగల అస్త్రమును సుగ్రీవుడే లక్ష్యముగా సంధించి విడిచిపెట్టెను. అది బ్రహ్మాండమైన వేగముతో వెళ్ళి సుగ్రీవుని గుండెలను తాకెను. ఆ బాణ వేగానికి చిత్తము వికారము చెంది పెద్దగా అరుస్తూ స్పృహతప్పి నేలపై సుగ్రీవుడు పడిపోయెను. అది చూచి రాక్షసులందరూ పెద్దపెట్టున హర్షధ్వానములు చేసిరి
తమ ప్రభువుకు పట్టిన గతి చూసి వానరముఖ్యులంతా ఒక్కసారిగా శరీరమును పెంచి రావణుని పైకి దూసుకుంటూ వెళ్ళిరి. వారందరినీ వాడిబాణములతో మూర్ఛపోవునట్లు కొట్టి వానర సైన్యము మొత్తమును తన బాణసముదాయముతో కప్పివేసినాడు ఆ రాక్షసరాజు.
Also read: ఇరు పక్షాల మధ్య భీకర సమరం
భీతిల్లిన వానరులంతా రాముని శరణు జొచ్చిరి. అంత రాముడు రణమునకు సిద్ధముకాగా, సౌమిత్రి వచ్చి ఆయన ముందు నిలచి, ‘‘అన్నా, నాకు అనుజ్ఞ ఇమ్ము. ఈతనిని నేను చంపెదను’’ అని పలికెను. అందుకు రాముడు అనుమతించెను.
‘‘లక్ష్మణా, జాగ్రత్త! ఎదుట ఉన్నది అసామాన్యుడైన మహాయోధుడు. ఆతని ముందు ముల్లోకములూ ఏకమైననూ నిలువజాలవు. నిన్ను నీవు అన్ని వైపులనుండీ రక్షించుకొనుచూ కడుమెలకువగా యుద్ధము చేయుము. నీ లోని లోపములు తెలుసుకుంటూ ఎదుటి యోధుడి లోపములను గ్రహించి యుద్ధము చేయుము’’ అని చెప్పి రావణుని పై యుద్ధానికి తమ్మునికి అనుమతి నొసగినాడు రాఘవుడు.
అంతలో వాయుపుత్ర హనుమంతుడు యుద్ధరంగములో రావణుని బాణములు కాచుకుంటూ అతని మీదకు శీఘ్రముగా వెళ్ళి తన కుడిచేయి ఎత్తిపట్టి అతనిని భయపెట్టి, ‘‘నీవు ఎవరిచేతిలోనూ మరణములేని వరము పొందినావు కానీ ఆ వరము పొందుటలో వానరులసంగతిని నీవు మరచినావు. ఇదుగో ఆ నిర్లక్ష్యమునకు మూల్యము ఇప్పుడు చెల్లించుకోగలవు. మా చేతిలో నీకు చావు మూడినది. రావణా కాచుకో!’’ అని పలికెను.
అప్పుడు రావణుడు బిగ్గరగా వికటాట్టహాసము చేసి ‘‘రారా వానరా, రారా!
నీ బలమేపాటిదో చూపించుము. అవశ్యము నన్ను కొట్టుము.
కీర్తిని పొందుము. నీ పరాక్రమము ఎంతో తెలిసికొని ఆ పైన నీకు మృత్యుదేవతాపరిష్వంగ సౌఖ్యమును ప్రసాదించెదను. రా! రా !’’ అనుచూ తొందరపెట్టెను.
Also read: అంగద రాయబారము
వూటుకూరు జానకిరామారావు