Thursday, November 21, 2024

గరుత్మంతుడి ఆగమనం, రామలక్ష్మణులకు నాగబంధవిముక్తి

రామాయణమ్187

రెండు ఏనుగులను బంధించి నేలపై పడవేసినచో ఎటులుండనో ఆవిధముగా అన్నదమ్ములిరివురూ నేలపై పడిఉండినారు.

కొంత సేపటికి రామునికి తెలివి వచ్చినది. కానీ నాగబంధములు పూర్తిగా వీడలేదు. ప్రక్కనే పడి ఉన్న తమ్ముని చూచినాడు. ఒడలంతా కుంకుమవర్ణముతో రక్తపు ముద్దలాగా నేలపై పడి ఉన్నాడు లక్ష్మణుడు. ఒక్కసారిగా దుఃఖము పొంగిపొరలినది. ‘‘ఆహా! ఎటువంటి సోదరుడీతడు! సీతవంటి భార్య ఈ భూమండలములో ప్రయత్నించిన దొరకవచ్చునేమో గానీ లక్ష్మణుని వంటి తమ్ముడు ఇంకొకడు దొరకడు! సుమిత్రామాతకు ఏమిబదులీయగలను?

Also read: ఇంద్రజిత్తు నాగాస్త్రం వల్ల మూర్ఛిల్లిన రామలక్ష్మణులు

ఏడి నా కుమారుడు ఎక్కడ అంటే? ఎక్కడున్నాడని చెప్పను? ఛీ! నా వంటి పాపాత్ముడు ఇంకొకడుండడు. తండ్రిగారి శాసనము నేను అడవులకు వెళ్ళుట వరకే. అనవసరముగా లక్ష్మణుని తీసుకువచ్చితిని. ఎటువంటి వీరుడీతడు! ఒక్కసారిగా అయిదువందల బాణములు గుప్పించి విడువగల గొప్ప విలుకాడు! వేయిచేతుల కార్తవీర్యార్జునుడుకూడా మా లక్ష్మణుని ముందు నిలువలేడే!

పట్టు పాన్పు పయిన శయనించ వలసినవాడు నేడిలా శరతల్పము మీద పడుకొనవలసిన దుర్గతి పట్టినది. విధి ఎంత బలీయము!

‘‘సుగ్రీవా నీవు మిత్రుడికి చేయవలసిన సహాయమంతా చేసినావు ఇక నీవు ససైన్యముగా వెనుకకు మరలుము. అయినది ఇక చాలు. నా కొరకు ఇక ప్రాణనష్టము వద్దు.’’

Also read: ఇరు పక్షాల మధ్య భీకర సమరం

ఈ విధముగా రాముడు మానసికవైకల్యముతో ఏవేవో మాడలాడుచుండగా వానర సైన్యము ధైర్యము కోల్పోయినదై పారిపోవుట ప్రారంభించిరి. విభీషణుడు వారందరికి ధైర్యము చెప్పి మరల ఒకచోటికి చేర్చి ఏమి జరిగినదో తెలుసుకొందమని రామ లక్ష్మణులు ఉన్న చోటికి వచ్చి వారిస్థితిని చూసి భోరున విలపించినాడు.

ఇంతలో సుగ్రీవుడు సుషేణునితో …‘‘మీరు రామలక్ష్మణులను తీసుకొని కిష్కింధకు మరలండి.నేను ఆ రావణుని సబాంధవముగా యమపురికంపి సీతమ్మను తీసుకొని వచ్చెదను’’ అని పలికినాడు.

వీరి సంభాషణలు ఇలా కొనసాగుచుండగనే ఒక అద్భుతము ఆకాశములో ప్రత్యక్షమాయెను.

ఆకాశంలో ఎక్కడో సుదూరంగా ఒక తేజోపుంజము సన్నగా బయలుదేరి  అక్కడ ఉన్నవారందరికీ ఒక మెరుపు తీగ వలె కనపడింది. అది క్రమేపీ దగ్గరవుతూ ఒక వెలుగులముద్దలాగ మారింది.

Also read: అంగద రాయబారము

దానితోటే మొదట సుడిగాలి వీచింది. అది ఆకాశంలోని మేఘాలను చెల్లాచెదురు చేసింది. అది ఆ తరువాత ఝంఝామారుతమయ్యింది. ఆ వాయువు అక్కడి లవణ సముద్రంలోని నీటిని చిమ్మివేయసాగింది. ఆ తరువాత అది ప్రళయానిలమయ్యింది. పెద్దపర్వతాలు ఊగిపోవడం మొదలయ్యింది. మహావృక్షాలు సమూలంగా పెకిలింపబడి సముద్రంలో విసిరి వేయబడుతున్నాయి.

మహాతేజస్సుతో ఒక దివ్యపురుషుడు ఎవరో వస్తున్నట్లుగా విభీషణసుగ్రీవాదులకు కనిపించింది.

 ఆ పురుషుని ఉనికి తెలుస్తూనే సర్పములన్నీ ఎక్కడివక్కడ గజగజవణుకుతూ కలుగులలో దూరి కనపడకుండా పారిపోసాగినవి.

రామలక్ష్మణులను అప్పటిదాకా యమయాతనకు గురిచేసిన బాణరూపము ధరించిన నాగులన్నీ రాబోయే ఆపద గమనించి మరుక్షణములో తమబంధనములన్నీ సడలించి సంపూర్ణముగా విడిచివేసి తమప్రాణములు కాపాడుకొనుటకై పారిపోయినవి.

రామలక్ష్మణులు బంధవిముక్తులై పూర్తి చైతన్యమును తిరిగి పొందిరి.

అద్భుతమైన ఈ వింత పరిణామమును అందరూ అబ్బురపోతూ చూడసాగిరి.

ఆ మహాపురుషుడు రామలక్ష్మణులను సమీపించగా, రామచంద్రుడు ఆశ్చర్యముగా ‘‘ఓ దివ్యపురుషా తమరెవరు?’’ అని ఉత్సుకతతో ప్రశ్నించెను.

Also read: లంకను చుట్టుముట్టిన రామసైన్యం

అప్పుడు ఆ పురుషుడు సవినయముగా, ‘‘స్వామీ, నేను బయటతిరుగాడే తమప్రాణమును. నన్ను గరుత్మంతుడు అని అంటారు. నీకు నాకు గాఢమైన స్నేహముకలదు. నీకు ఆపద కలిగినదని తెలిసిన వెంటనే కడువేగముగా వచ్చితిని.

‘‘స్వామీ, రాక్షసులు మాయావులు. వారి మాయాయుద్ధమును చాలా జాగరూకతతో ఎదుర్కొనవలెను. వారిబలము ..మాయ తమబలము ….ఋజుత్వము కావున అజాగ్రత పనికిరాదు. నీవు అతిత్వరలో బాల, వృద్ధులైన మగవారు తప్ప సకల రాక్షససంహారము గావించి పట్టాభిషిక్తుడవు అయ్యెదవు. రామచంద్రా,  మరొక్కమాట నాకుతెలియని ఈ స్నేహితుడెవరా అని ఆలోచించనక్కరలేదు. యుద్ధపరిసమాప్తియందు సకలము నీకు అవగతమగును’’ అని చెప్పిఅన్నదమ్ముల గాయాలను తన చేతితో నిమిరి పోగొట్టి రామునికి ప్రదక్షిణము చేసి గగన వీధిలోనికి ఎగిరి అంతర్ధానమయ్యెను.

గరుడుడి స్పర్శతో రామలక్ష్మణులు ఇరువురికి అంతులేని స్వాస్థ్యము చేకూరి మునపటికన్నా అమితబలసంపన్నులైరి.

రామలక్ష్మణులను అలా చూసిన వెంటనే వానరసైన్యము ఒక్కపెట్టున మహాగర్జనలు చేసింది.

ఆ గర్జనలు వేసవి అంతములో ఆకాశములో సంచరించు పుష్కలావర్తక మేఘములనుండి పుట్టు ఉరుముల వలే ఉండి రావణుడి కర్ణపుటములు బ్రద్దలు చేసినవి..

Also read: రావణుడితో సుగ్రీవుడి మల్లయుద్ధం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles