ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘వికాస్’ అనే మాట తరచూ మాట్లాడుతూ ఉంది. అది అణగారిన వర్గాల రక్తమాంసాల్ని, మైనార్టీల అస్థిపంజరాల్ని కార్పొరేట్ శక్తులకు నైవేద్యం పెడుతూ దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపిస్తోంది? దేశంలోని ప్రతి సగటు మనిషి గుండె మీద చేయివేసుకుని, తమకు తిండి, బట్టా దొరుకుతున్నాయా? అని – తమ పిల్లలకు సరైన చదువు చెప్పించగలుగుతున్నామా? అని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ దేశ ప్రజలకు ఆరోగ్య సదుపాయం, రవాణా సౌకర్యాలు సరిగా అందుతున్నాయా? యువతకు ఉపాధి లభిస్తోందా? రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారా?- అని ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. దేశ ప్రజల్ని మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన, ఆర్థిక స్థోమతల ప్రాతిపదికన విభజించి పాలిస్త ‘దేశ్ కా వికాస్’ ఎలా తేగలుగుతున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. బ్రిటిష్ వాడు విభజించి పాలించాడంటే అర్థం చేసుకోవచ్చు. వాడు విదేశీయుడు. ఇప్పుడు మరి వీరికేమయ్యింది? అందరం ఈ దేశవాసులమే కదా?
Also read: ఏ మనిషినీ సున్నా కింద తీసిపారవేయలేం!
మరి, ఈ దేశ ప్రజలకు ఏమైందీ? స్వాతంత్ర్యానంతరం దేశంలో విద్యావంతుల సంఖ్య గణనీయంగా పెరిగింది కదా? వారు చదివిన చదువులు ఎందుకు వారిలో వివేకం పెంచలేకపోతున్నాయీ? కుటుంబ బాధ్యతలే నిర్వహించుకోలేని సన్యాసుల చేతికి అధికార పగ్గాలు ఎలా ఇస్తున్నారూ? ఎందుకు ఇస్తున్నారూ? కమాన్, మమ్మల్ని దోచుకోండి! కమాన్, మమ్మల్ని అణగదొక్కండి! కమాన్, మా బతుకుల్ని దుర్భరం చేయండి – అని అసమర్థులకు ఎందుకు లైసెన్స్ ఇస్తున్నారూ? ప్రభుత్వాధినేతలు చెప్పే అబద్ధాల ‘భాషణ్’లలో మిత్రోం…ఏమిటీ? అంత తీపిదనం ఉందా? మీ తెలివితేటల్ని, శక్తిని వాళ్ళు ఆవు మూత్రంతో శుద్ది చేస్తుంటే అంత మజావస్తోందా? తినిపించే ఆవు పేడ అంత రుచిగా ఉందా? ఏమిటీ కారణం? ఎందుకు దేశ పరిస్థితి పడిపోయిన రూపాయి విలువలాగా – హంగర్ ఇండెక్స్ లో చివరికి చేరిన స్థానంలాగా – ఈ దేశ ప్రజల విజ్ఞత ఎందుకు పడిపోతూ ఉంది? జ్ఞానేంద్రియాలన్నింటినీ మూసి పెట్టుకుని ఎందుకు ఈ దేశ ప్రజలు అజ్ఞానానికీ, మూర్ఖత్వానికీ పట్టం కడుతున్నారు? ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది.
Also read: భౌతికవాదాన్ని తవ్వితీసిన దేవీప్రసాద్ ఛట్టోపాధ్యాయ
దేశభక్తుడు షహీద్ భగత్ సింగ్ ఎందుకు గుర్తుకు రావడం లేదూ? ఈ దేశాన్ని రక్షించుకోవడానికి రక్తం చిందించిన అమరవీరులైన దేశభక్తులెవరూ ఎందుకు గుర్తుకు రావడం లేదూ? ఎందుకు దేశద్రోహులను, మోసగాళ్ళను గద్దెనెక్కిస్తున్నారూ? మనం ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రైస్తవుడిగా పుట్టడమన్నది యాదృచ్ఛికం. ఎవరు, ఎక్కడ, ఏ ప్రాంతంలో పుట్టాలన్నది ఎవరి అధీనంలోనూ ఉండదు కదా? ఏది ఏమైనా, అందరం ఈ దేశవాసులం. భారతీయులం. అంతకన్నా ముఖ్యం-అందరం మనుషులం! తేడా లెందుకూ? విభజనలెందుకూ? కుట్రపూరితంగా విభజనలు ప్రోత్సహించేవారి ఆటకట్టించాలి కదా? అబద్ధాలు చెపుతూ పుకార్లు ప్రచారం చేసేవారి భరతం పట్టాలికదా? కరోనా కష్టకాలంలో లక్షలమంది వలస కార్మికులకు కనీసం రైలు, బస్సు సౌకర్యం కల్పించలేని ప్రభుత్వ అసమర్థత ఎందుకు కనిపించలేదూ? లక్షల కోట్లు బ్యాంకు దోపిళ్ళు చేసినవారిని మాత్రం భద్రంగా దేశం దాటిస్తారా? అదేనా ఈ దేశ చౌకీదారు చేయవలసిన పని? అధిక సంఖ్యాకులైన సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపలేని – ‘ప్రజాసేవకులు’ మనకు అవసరమా?
Also read: ప్రతి నాన్న కోసం
ఈ దేశంలోని యువతరాన్ని సంబోధిస్తూ దేశభక్తుడు షహీద్ భగత్ సింగ్ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి:
‘‘భారత రిపబ్లిక్ లోని యువతీయువకులారా! సిపాయిలారా! విశ్రాంతిగా, నిరర్థకంగా నిలబడకండి. అడుగులోఅడుగు వేస్తూ కార్యోన్ముఖులుకండి. తీవ్రమైన ఆకలి, పేదరికం మీకు సవాలు విసురుతోంది! దాన్ని తిప్పికొట్టాల్సి ఉంది. మీరొక మంచి మిషన్ (ధ్యేయం)లో నిమగ్నమై ఉన్నారు? దేశం అన్ని వైపులా, అన్ని మూలల్లో విప్లవ జ్వాలలు అంటుకుంటున్నాయి. ప్రజల్ని సమాయత్తం చేయండి. మీ ధ్యేయం వినిపిస్తున్న బిగుల్ ధ్వని (యుద్ధభేరి) వినండి. విని కదలండి. ఇలాగే నిశ్చేష్ఠులై నిస్సాంగా జీవితం గడపకండి-’’ భగత్ సింగ్ ఆయన కాలంలో చెప్పిన మాటలు ఈ కాలానికి కూడా పనికొస్తాయి. అందువల్ల ఆయన కన్న కలల్ని నిజం చేయాల్సిన బాధ్యత ఈ తరం యువతీయువకుల మీద ఉంది. వారంతా తీవ్రంగా ఆలోచించాలి. లేవాలి. లేచి, కార్యాచరణకు పూనుకోవాలి. లేకపోతే ఇంకా నష్టం జరిగిపోతుంది. ఆ తర్వాత పశ్చాత్తాపంతో కుమిలిపోయినా లాభం ఉండదు.
Also read: నేను అంటే ఎవరు?: ఒక వైజ్ఞానిక వివరణ
హిట్లర్ పరిపాలనా కాలంలో ఫాసిజాన్ని వ్యతిరేకించే ఒక కార్యకర్త, కవి పాస్టర్ నిమోలర్ ఒక కవిత రాశాడు. అది తెలుగులోకి తెస్తే ఇలా ఉంటుంది:
మొదట వాళ్ళు కమ్యూనిస్టులకోసం వచ్చారు
అప్పుడు నేనేం మాట్లాడలేదు
కారణం? నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి!
తర్వాత వాళ్ళు ట్రేడ్ యూనియన్ వారికోసం వచ్చారు.
అయినా నేనేం మాట్లాడలేదు-
కారణం? నేను ట్రేడ్ యూనియన్ లో లేను కాబట్టి!
ఆ తర్వాత వాళ్ళు యూదులకోసం వచ్చారు
అప్పుడూ నేను మాట్లాడలేదు-
కారణం? నేను యూదుణ్ణి కాదు కాబట్టి!
వాళ్ళు మళ్ళీ నాకోసం వచ్చారు – అంతే
అప్పటికి, నా గురించి మాట్లాడేవాళ్ళే మిగల్లేదు-
జరుగుతున్న అన్యాయాల సెగ మనకు తగలడం లేదు కదా అని తమాషా చూస్తూ ఉంటే, ఆ తర్వాత మన గురించి గొంతెత్తేవారే ఉండరు. సంఘ్ పరివార్, బీజేపీలు కలిసి ఆ హిట్లర్ పథకాన్ని ఇక్కడ ఈ దేశంలోఅమలు చేయాలని అనుకున్నప్పుడు – దేశ ప్రజలు ఏం చేయాలి? అన్యాయాల మీద, అబద్ధాల మీద, అరాచకాల మీద, అజ్ఞానమీద, మూర్ఖత్వం మీద, కుట్రల మీద, మనుషుల విభజన మీద తీవ్రంగా విరుచుకుపడాలి కదా? ఓర్చుకుని, నోరు మూసుకుంటే అది మరింత వినాశనానికే దారి తీస్తుంది. మానవజాతి అంతా ఒక్కటే అయినప్పుడు, ఈ దేశవాసుల్లోనే కొందరు మనవారు, కొందరు పరాయివారు ఎలా అవుతారు? మన అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్ళు ఉత్తపుణ్యానికి చనిపోతుంటే, విభజించి పాలిస్తున్న ఈ పాలకులు గొప్ప పాలన అందిస్తున్నారని మనమిక్కడ వేడుకలు చేసుకుందామా?
Also read: దేశాన్ని సానిటైజ్ చేద్దాం!
దేశభక్తులు షహీద్ భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురూలు 20 మార్చి 1931న పంజాబ్ గవర్నర్ కు ఒక లేఖ పంపించారు. అందులోని సారాంశం ఇలా ఉంది ‘‘-మేం చెప్పదల్చుకున్నదేమంట, ఇక్కడ యుద్ధం ప్రారంభం కానే అయ్యింది. శ్రామికుల శ్రమ శక్తిని అన్యాయంగా దోచుకుని బలిసిపోతున్న కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఈ యుద్దం కొనసాగుతుంది. దోచుకునే కార్పొరేట్లు బ్రిటిష్ వారయినా, స్వదేశీయులైనా మాకు ఒక్కటే – వాళ్ళంతా ఒక్కటై సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. జీవితాలు దుర్భరం చేస్తున్నారు. అందుకే చెపుతున్నాం. దోపిడిని, అణచివేతను ఇక ఎంత మాత్రమూ సహించం. రక్తం తాగేవాడు స్వదేశీయుడైతే నేమిటి? విదేశీయుడైతే నేమిటి? మాకు అందరూ శత్రువులే!’’
ఆ నాడు ఆ దేశభక్తులు వెలిబుచ్చిన ఆవేదనను ఇప్పుడు ఈ దేశ ప్రజలందరూ మళ్ళీ వెలిబుచ్చాల్సిన అవసరం వచ్చింది. కారణం ఇప్పుడు సమకాలీనంల కూడా అదే పరిస్థితి ఉంది.
‘‘ఒకప్పుడు జర్మనీలో జరిగినట్టుగానే ఇక్కడ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం – అసలు సమస్యల నుండి దృష్టి మరల్చడానికి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఉంది’’- అని అన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షులయిన జస్టిస్ మార్కండేయ కుట్జూ.
Also read: చదవడం కాదు, సి.వి. రచనలు జీర్ణించుకోవాలి!
అసలు సమస్యల నుండి దృష్టి మరల్చడానికి మన దేశ నాయకులు ప్రచారం చేస్తున్న అంశాలు: 1. పురాణాల్లో సైన్సు ఉంది. 2. మసీదులో లింగం ఉంది. 3. హిందీ భాషని దేశంలో తప్పనిసరి చేయాలి 4.ముస్లింలను దేశం నుండి తరిమేయాలి. 5. ఘర్ వాపసీ – ఇతర మతాలలో ఉన్నవాళ్ళందరూ ఒకప్పుడు హిందువులే గనక వారందరూ మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. అంటే హిందువులుగా మారాలి. 6. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ దేశంల ఎలాంటి హక్కులు ఉండకూడదు. 7. మొఘల్ చక్రవర్తులు దుర్మార్గులు. వారి కట్టడాలు, ఆనవాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు. 8. స్త్రీల వస్త్రధారణా విధానాల వల్లనే రేప్ లు జరుగుతున్నాయి. 9. ఆవు మూత్రం, ఆవు పేడలతో అన్నిరోగాలు నయం చేసుకోవచ్చు. 10. ఓం శబ్దంలోని మహత్తును నాసా కూడా గుర్తించింది – ఇలా ఇష్టం వచ్చాన విషయం మీద ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతూ దేశ ప్రజల్ని అయోమయంలో పడేయాలని వారు అనుకుంటున్నారు. అలా కాలక్షేపం చేస్తూ, అధికారంలో కొనసాగవచ్చు – నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుకోవచ్చునన్నది వారి ఆలోచన!
ఐన్ స్టీన్ లాంటి మహాశాస్త్రవేత్త, గోథే లాంటి మహారచయిత, బెథోవెన్ వంటి మహాసంగీతకారుడు, కాంట్, నీషే, మార్క్స్ లాంటి గొప్ప తత్త్వవేత్తలు అందరూ జర్మన్లే. కాని 1933లో జర్మనీ-హిట్లర్ అధీనంలోకి రాగానే పరిస్థితుల్ని పూర్తిగా మార్చేశాడు. సమస్యలన్నింటికీ యూదులే కారణమని ప్రచారం చేశాడు. ఆలోచనాపరుల మెదళ్ళలో కూడా విషం నింపాడు. ఫలితం ఏమైంది? సుమారు 60 లక్షలమంది యూదులను గ్యాస్ ఛాంబర్ లోకి పంపి హత్య చేయించాడు. చరిత్ర పుటల్లో కనీవినీ ఎరగని దుర్మార్గం అక్కడ జరిగిపోయింది. పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే ఫాసిజం ఇక్కడ ఈ దేశంలో విలయతాండవం చేస్తోంది. తమకు తాము దేశభక్తులమని ప్రకటించుకున్నవారు దేశ స్వాతంత్ర్యానికి ముందు గానీ తర్వాత గానీ వారు చేసేదంతా దేశద్రోహమేనన్నది తేలిపోయిన తర్వాత, రగిలిపోతున్న ఈ దేశ ప్రజలు ఆచరణలోకి దిగకుండా ఉంటారా? సామాన్యుల సంఘటిత శక్తిని తక్కువగా అంచనావేసే ఈ పాలకులే భవిష్యత్తులో అవహేళనకు గురికాబోతున్నారు. నియంతలకు చరిత్ర ఏ గతి పట్టిస్తూ వచ్చిందో మనందరికీ బాగా తెలుసు.
Also read: బుద్ధుడు, విష్ణుమూర్తి అవతారాలలో ఒకడు కాదు!
(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)