Thursday, November 21, 2024

రావణుడి పనపున సుగ్రీవుడితో శుకుని రాయబారం విఫలం

రామాయణమ్177

‘‘అచట అశేష  వానరసేనా వాహిని సముద్రమును తలపించుచున్నది ప్రభూ.. భల్లూక దళములొక సంద్రము, వానరులొక సంద్రము. మహామహా యోధులతో కూడి సముద్రము ఒడ్డున రెండు సముద్రములవలే మహా కోలాహలముగా ఉన్నది ప్రభూ!

ఇరువురు మహా పురుషులు ధనుర్ధారులై ఆ సేనపై గొప్ప ఆధిపత్యముతో మహాతేజోరాశులవలె కడలి ఒడ్డున కదనానికి ఉత్సుకతతో నిలచి ఉన్నారుప్రభూ. వారే రామలక్ష్మణులు!’’

ఈ విధముగా శార్దూలుడు అనే రాక్షస గూఢచారిచెప్పగా విని గొప్ప తత్తరపాటుకు గురి అయినాడు రావణుడు.

Also read: విభీషణుడిని లంకాధిపతిగా చేసిన రాముడు

ఏమి చేయవలెనా అని ఆలోచించి చివరకు రామసుగ్రీవుల మధ్య భేదము పుట్టించి విడగొట్టవలెనని సంకల్పించి శుకుడు అను వానిని అందుకు నియోగించినాడు. ‘‘శుకుడా నీవు వెంటనే వెళ్ళి సుగ్రీవుని కలిసి నా మైత్రీ సందేశము వినిపింపుము. ‘ఈ యుద్ధము వలన సుగ్రీవా, నీ వంటి ఉత్తమకుల సంజాతునకు ఏమి లాభము? నీవు నాకు సోదరుని వంటివాడవు. నీతో నాకు ఏ వైరమూలేదు. మరి ఈ యుద్ధమెందులకు? రాముని భార్యను నేను అపహరించినాను అందుకు నాకు రామునికి వైరము. నీకేమి సంబంధము? నీ వారలను ఊరకే యుద్ధములో ఎందుకు కష్టపెట్టెదవు? హాయిగా కిష్కింధకు తిరిగిపో. అయినా దేవతలే ప్రవేశించలేని దుర్భేద్యమయిన లంకలో వానరులేల ప్రవేశించగలరు? నీది వృధాప్రయాస’ అనుచూ అనునయముగా మధురముగా సుగ్రీవునికి ఎరిగించుము. నీవు ఇప్పుడే వెళ్ళి ఈ కార్యమును నిర్వర్తించుము’’ అని ఆజ్ఞాపించగా శుకుడు చిలుక రూపము దాల్చి రివ్వున ఎగిరి సముద్రపు అవ్వలి తీరమునకు చేరెను.

ఆకాశమందే నిలచి సుగ్రీవుని వైపుకు వెళ్ళి ఆయనతో రావణుడు చెప్పమన్నట్లుగా పలికెను.

Also read: తనను శరణు కోరినవారిని రక్షించి తీరెదనని పలికిన రఘుపతి

ఇది వింటున్న వానరలు కొందరు రయ్యిన పైకి ఎగిరి శుకుని పట్టుకొని పెడరెక్కలు విరిచి కట్టి రెక్కలు ఊడబెరుకుతూ, పిడికిళ్ళతో టపటపమని కొట్టుచూ క్రిందికి పడదోసి రాముని ముందు నిలబెట్టిరి.

వాడు ప్రాణ భయముతో వణుకుచూ, ‘‘రామా, నేను దూతను. దూతను చంపుట న్యాయమా? నేను చెప్పినదంతా నా ప్రభువు చెప్పమన్నదే’’ అని ఏడుస్తూ పలికెను.

అంత రాముడు అతనికి అభయమిచ్చి స్వేచ్ఛగా పొమ్మనెను.

వాడు మరల ఆకసమునకు ఎగిరి, ‘‘సుగ్రీవా, మా రాజుకు నీవిచ్చు బదులు ఏది? నేనేమి సమాధానము ఆయనకు చెప్పవలెను?’’ అని పలికెను.

Also read: విభీషణుడు స్వాగతించదగినవాడేనన్న రామచంద్రుడు

‘‘రావణా నేను నీకు సోదర సమానుడనని వర్తమానము పంపితివి.  అది ఎటుల? నీవు నాకు మిత్రుడవు కావు. నాకు ఉపకారకుడవు  కావు. పైగా దయ చూపవలసిన వాడవు అంతకన్నా కావు.‌‌ ఏ విధముగా నాకు ప్రియుడవు? నా సోదరుడగు వాలి నీకు మిత్రుడు. అందుచేత తలచితివా? ఆతడు నాకు శత్రువు. అతని మిత్రుడవు కావున నీవునూ నాకు శత్రుడవే! రాముని భార్యనుఅపహరించితివి. రాముడు నాకు ప్రాణమిత్రుడు. కావున నీవు నాకు శత్రువు. దండించదగినవాడవు. వానరులు లంకను చేరలేరు అని కలలు కంటున్నావేమో నేనే ఎగిరి వచ్చి నీ లంకను భస్మము చేసి నిన్ను యమునకు అతిధిగా పంపగలను.

‘‘రామునకు అపకారము చేసి నీవు బ్రతికి బట్టకట్టడము కల్ల. సూర్యమండలములో దాగినా, పాతాళమునకు ఏగినా రామ బాణము నిన్ను వదలదు. ముల్లోకములలో నిన్ను రక్షించగలిగిన వాడు ఎవడూ లేడు. ముసలి వాడయిన జటాయువును చంపినట్లు కాదు మాతో యుద్ధమంటే. నీవొక పిరికి దద్దమ్మవు. రామలక్ష్మణులు లేని సమయము చూసి సీతమ్మను అపహరించుకుపోయిన నీవూ ఒక యోధుడవేనా?’’

సుగ్రీవుడు ఈ విధముగా మాట్లాడుచుండగనే శుకుడు వానర సైన్యమంతటినీ కలియ చూడటము పసికట్టిన అంగదుడు రయ్యిన పైకెగిరి వాని జుట్టుబట్టి క్రిందకు ఈడ్చి, ‘‘మహారాజా వీడు దూతగాడు. గూఢచారి. మన సైన్య సమాచారము వీడు సేకరించుచున్నాడు’’ అని చెప్పగనే వానరులంతా వాని పై పడి పిడిగుద్దులు గుద్ది వాని మర్మస్థానముల మీద తీవ్రముగా కొట్టి బాధించు చుండగా వాడు కుయ్యోమొర్రో అంటూ ‘‘రామచంద్రా నేను పుట్టి బుద్ధి ఎరిగిన తరువాత ఇన్ని తన్నులు ఎప్పుడూ తినలేదు. ఇంత తీవ్ర వేదన పొందలేదు. నన్ను కాపాడు తండ్రీ’’ అని మొరపెట్టుకొనగా ఆర్తత్రాణపరాయణుడయిన రామయ్య వానిని దయతో వదిలి వేయగా వాడు బ్రతుకు జీవుడా అంటూ లంకకు ఎగిరి పోయినాడు.

Also read: విభీషణుడిని మిత్రుడిగా స్వీకరించమని రాముడికి హనుమ సూచన

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles