గది నాలుగు గోడల మధ్య, సాక్షులెవరూ ఉండని చోట షెడ్యూల్డు కులాలు/తెగలకు చెందిన వ్యక్తిని అవమానించారని లేదా బెదిరించారని చేసే ఆరోపణలను ఎస్సీ,ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం కింద నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ మహిళ ఇంటికి వచ్చిన వ్యక్తి ఆమెను దుర్భాషలాడారనే ఆరోపణలకు సంబంధించిన కేసును కొట్టివేస్తూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. సమాజంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు లక్ష్యంగా జరిగే అవమానాలు, వేధింపులు, అమానుష చర్యలు వంటివి బహిరంగ ప్రదేశాలు లేదా ప్రజల దృష్టిలో పడే ప్రాంతాల్లో జరిగినట్లయితే వాటిని ఎస్సీ,ఎస్టీల చట్టం కింద నేరంగా భావించవచ్చని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
బహిరంగ ప్రదేశం అంటే…?
బహిరంగ ప్రదేశం(పబ్లిక్ ప్లేస్), ప్రజల దృష్టిలోకి వచ్చే ప్రదేశం(ప్లేస్ విత్ ఇన్ పబ్లిక్ వ్యూ) మధ్య ఉన్న తేడాను వివరించేందుకు 2008లో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ఆధారంగా చేసుకుంది. ఒక భవనం వెలుపల ఉన్న ఆరుబయట ప్రాంతంలో జరిగే విషయాలను రోడ్డుపైన వెళ్లే వ్యక్తులు, లేదా ప్రహరీ వెలుపల ఉన్న వ్యక్తులు చూడటానికి వీలవుతుంది. దీనిని ప్రజల దృష్టిలోకి వచ్చే ప్రాంతంగా భావించవచ్చు. ధర్మాసనం ముందుకు వచ్చిన ప్రస్తుత కేసులో నేరం జరిగిందని చెబుతున్న సమయంలో మహిళ తన ఇంటిలోని గదిలో ఉన్నారు. అక్కడ జరిగిన వ్యవహారాన్ని ఆమె కుటుంబ సభ్యులు మినహా ఇతరులు చూసే అవకాశం ఉండదు. కనుక ఆ మహిళ ఆరోపణలకు ఆధారమైన మాటలను అభియోగపత్రంలో పేర్కొన్న సాక్షులు విన్నారని భావించటానికి అవకాశంలేదంటూ 2008లో స్వరణ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ఉదహరించింది. ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సాక్షులు గదిలో జరిగిన సంభాషణలను వినే అవకాశం ఉండదని పేర్కొంటూ వేధింపుల చట్టం కింద నమోదైన కేసును కొట్టివేసింది.
కేసు పూర్వపరాలివి…
ఉత్తరాఖండ్ ప్రభుత్వం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం 2019 డిసెంబరు 10న వర్మ అనే వ్యక్తి తనను అవమానించారని ఆరోపిస్తూ ఓ మహిళ ఫిర్యాదు చేయగా అతనిపై ఎఫ్‌ఐఆర్ (ఫస్ట ఇన్ఫర్మేషన్ రిపోర్ట) నమోదైంది. దీంతో వర్మ తనపై దాఖలైన ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసును కొట్టివేయాలంటూ ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఆ తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వర్మకు, మహిళకు మధ్య నెలకొన్న ఆస్తి వివాదం సివిల్ కోర్టులో ఉందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఆ క్రమంలో ఆమె వర్మ తనను వేధిస్తున్నాడంటూ క్రిమినల్ కేసు వేసి, ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని పేర్కొన్నారు. అసలు వివాదం ఆస్తికి సంబంధించినది కనుక, దాని మూలంగా తలెత్తే ఆరోపణలను ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కిందకు తీసుకురాకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. ఎస్సీ/ఎస్టీ కులాలకు చెందిన వ్యక్తి అయిన కారణంగానే ఆమెపై వేధింపులు, బెదిరింపులు వంటి జరుగుతుంటే ఆ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని స్పష్టీకరించింది.