దేవుడు ఉన్నాడా లేడా? ఫునర్జన్మ ఉందా లేదా? అనేవి ఎప్పటికీ తేల్చుకోలేని విషయాలు. అలాగే కొన్ని కొన్ని విశ్వాసాలు తరతరాలుగా మన జీవితంలో ఉంటూనే వస్తున్నాయి. నిజమే! మరి అలాంటప్పుడు వాటిని వదిలేసి, పక్కకు నెట్టేసి వస్తున్న అత్యాధునిక వైజ్ఞానిక విషయాల్ని అవగాహన చేసుకొని జీవితం సుఖమయం చేసుకుంటే తప్పేమిటీ? – అని కొందరు గట్టిగానే వాదిస్తుంటారు. మెదడు నిండా చెత్త నింపుకున్నవారే అడ్డదిడ్డంగా మొండిగా వాదిస్తుంటారు.
Also read: భౌతికవాదాన్ని తవ్వితీసిన దేవీప్రసాద్ ఛట్టోపాధ్యాయ
ఇక్కడ మనం ఒక విషయం ఆలోచిద్దాం! ఇంటి నిండా చెత్తాచెదారం ఉన్నప్పుడు, కుళ్ళుతో నిండిపోయి దుర్వాసన వస్తున్నప్పుడు సానిటైజర్ లు, సుగంధాల స్ప్రేలు చల్లుకుని ఆ ఇంట్లో ఆరోగ్యంగా ఉండగలమా? ఉండలేం కదా? ముందు ఆ చెత్తను తీసి, దూరంగా పెంటకుప్పలో వేయాలి. బూజులు దులుపుకోవాలి. తర్వాత ఫ్లోర్ క్లీనర్స్ తో ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. అప్పుడు గాని బయటి నుండి వీచే చల్లగాలికి మనకు ఊపిరి సరిగా ఆడదు. ప్రాణానికి హాయిగా ఉండదు – ఇల్లు ఎలాంటిదో మన మెదడు కడా అలాంటిదే – తరతరాలుగా వస్తున్న అంధవిశ్వాసాల్ని ఎవడో ఎపుడో కుట్రపన్ని రూపొందించిన వర్ణవ్యవస్థని, దేవుడు, దయ్యం, ఆత్మ, పునర్జన్మ, పాపం, పుణ్యం వంటి పనికిరాని భావనల్ని, ఆచారాల్ని, వివక్షతల్ని నిర్భయంగా వదిలించుకుంటేనే మనం బాగుపడతాం. మెదడులో చెత్త మెదడులోనే ఉంచుకుని, వైజ్ఞానిక స్పృహ, హేతువాదం గురించి మాట్లాడుతామంటే కుదరదు. జీవితంలో ఆచరిస్తామంటే వీలు కాదు. ఇల్లు శుభ్రం చేసుకున్నట్టే, మెదడులో పేరుకుపోయిన తరతరాల చెత్తను వదిలించుకోవడం ముఖ్యం! ఆ తరువాతే జీవితంలో ఆధునిక జీవనశైలిని, ప్రగతిశీల ఆలోచనా ధోరణిని అనుసరించాలనుకుంటే అనుసరించొచ్చు – ముఖ్యంగా ఇంట్లోంచి, వంట్లోంచి చెత్తను తొలగించి శుభ్రం చేసుకోవడం, మెదడుకు పట్టిన తప్పును వదిలించుకోవడం అవసరం. అప్పుడు కదా వారికి వైజ్ఞానిక దృక్పథమంటే ఏమిటో కొద్దికొద్దిగా అర్థమవుతుందీ?
Also read: ప్రతి నాన్న కోసం
పెద్దపెద్ద వృక్షాల్ని సైతం పెకిలించి, తరలించి మరోచోట నాటటం ఈ రోజుల్లో సాధ్యమవుతోంది. ఈ ప్రక్రియలో ఆ చెట్టుకున్న వేర్లను మొత్తానికి మొత్తంగా బయటికి తీయడం కుదరదు. దూరదూరాలకు పాకి ఉన్న చిన్నచిన్న వేర్లన్నీ భూమిలోనే ఉండిపోతాయ్. ఆ చెట్టు బతకడానికి అవసరమైన తల్లివేరు, కొన్ని పిల్లవేర్లు మాత్రం జాగ్రత్తగా తీసి, తరలించిన చోట నాటుతారు. అంతే. అవే కొత్త స్థలంలో అంటుకుని నిలదొక్కుకుని మళ్ళీ ఎదుగుతాయి. అలాగే లోతుగా పాకిపోయిన చాదస్తాల వేర్లని నిర్భయంగా కోసేసి, కొత్త ఆలోచనలతో నవయుగంలోకి ప్రయాణించాలంటే మనుషులు తమ మెదళ్ళను ముందు శుభ్రంచేసుకోవాలి! ‘కారణం-హేతువు’ ఆధారంగా బతకడం నేర్చుకోవాలి. ప్రశ్నను ప్రాణంగా భావించి వివేకం పెంచుకోవాలి. తప్పదు. అలవాట్లు, ఆలోచనలు మార్చుకోవాలి! అన్నింటికీ మనిషే కారణం! మనిషే కేంద్రకం!! ఆ దృష్టితో ఆలోచించినపుడే నూతనత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది. మానవత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది. పర్యావరణాన్ని, జంతువృక్ష జాతుల్ని పరిరక్షించుకుంటే తప్ప మనిషిని బతికించుకోలేం. ఏ మాతానికి చెందిన ఏ దేవుడూ ఈ పనులు చేయలేడు. కేవలం మనిషి మాత్రమే చేయగలడు. మనిషే చేయాలి! ప్రాథమికంగా ఇలా ఆలోచించేవాడయితేనే వాడు మానవవాది అవుతాడు. మనిషే మన ప్రాధాన్యత. మనిషి ఎప్పటికీ జీరో కాదు – అని చెప్పుకోవడానికి ఇక్కడ ఒక సంఘటన చెప్పుకుందాం- మతాలన్నీ మనిషిని సున్నా కింద జమకడతాయి. వాడొక పాపాత్ముడు అని హీనంగా చూస్తాయి. ఆధునిక ఆలోచనాధోరణి ప్రకారం ఏ మనిషినీ సున్నాకింద తీసిపారెయ్యలేం! గతానికీ ప్రస్తుతానికీ అదే తేడా!!
Also read: నేను అంటే ఎవరు?: ఒక వైజ్ఞానిక వివరణ
ఏ పరీక్షకైనా మన దేశంలో అత్యధిక స్కోరు వందమార్కులు. వందకు ఎవరు ఎన్ని మార్కులు సంపాదించారు – అన్నది పరిగణనలోకి తీసుకుంటాం. కానీ, రష్యాలో దాదాపు అన్ని పరీక్షలకు అత్యధిక మార్కల స్కోరు అయిదు. అయిదు మార్కులకు ఏ విద్యార్థి ఎన్ని సంపాదించాడూ అన్నదాని మీద వారి లెక్కలుంటాయి. ఆ దేశంలో ఒక సారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక విద్యార్థి తన ఆన్సర్ షీట్ మీద తనరోల్ నంబరు వేసి, ఏమీ రాయకుండా తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మన దేశంలో అయితే, ఏమీ రాయలేదు గనక ఆ విద్యార్థికి సున్నా ఇస్తారు. కానీ, అక్కడ ఆ విద్యార్థికి ప్రొఫెసర్ గారు రెండు మార్కులు ఇచ్చారు. ఇది చాలా కాలం క్రితం మాస్కో విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటన. ఆ ప్రొఫెసర్ పేరు డాక్టర్ థియోడోర్ మెడ్రావ్. అది తెలుసుకున్న ఒక భారతీయ విద్యార్థి వెళ్ళి ప్రొఫెసర్ గారిని అడిగాడు. ‘‘సర్, ఏమీ రాయనివాడికి సున్నా ఇవ్వాలి గానీ, మీరేమిటి రెండు మార్కులిచ్చారూ’’- అని అడిగాడు. అందుకు ఆయన నవ్వి ‘‘మనిషన్నవాడెవడూ ఎప్పుడూ జీరో (సున్నా)కాదు. ఆన్సర్ షీట్ లో ఏమి రాశాడు అనేదే కాదు, దాని వెనక అతని కృషీ, తపన, ఆత్రుతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతిరోజూ ఏడు గంటలకు లేచి, క్రమం తప్పకుండా అంతటి చలిలో ప్రయాణం చేసి వచ్చి, క్లాసులకు హాజరవుతున్నాడా? పరీక్ష కోసమని కూడా ఆ రోజు చలిలో వణుకుతూ పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ప్రయాణించి, సమయానికి వచ్చి ప్రశ్నాపత్రంలోని వాటికి సరైన జవాబులు రాయాలని తాపత్రయ పడ్డాడా? పడ్డాడు – ఎన్నో రాత్రులు నిద్ర చెడగొట్టుకుని చదివాడా? చదివాడు – నోటు బుక్కులకు, పెన్నులకు, కంప్యూటర్ కు ఇతరత్రా డబ్బు ఖర్చు పెట్టాడా? పెట్టాడు. శారీరకంగా, మానసికంగా శ్రమించాడా? శ్రమించాడు కదా? మరి అలాంటి విద్యార్థిని జీరో కింద లెక్కగట్టి ఏలా తీసిపారేస్తాం?’’
Also read: దేశాన్ని సానిటైజ్ చేద్దాం!
‘‘ప్రశ్నాపత్రంలో అడిగినవాటికి అతను సమాధానాలు రాయలేకపోవచ్చు. నిజమే. ఒప్పుకుంటాను. కానీ, ఒక మనిషిగా అతడు జోరో కాదు కదా? అన్యాయంగా అతని విలువ సున్నా అని నేనే తేల్చేయలేను’’- అని అన్నాడు ప్రొఫెసర్ థియోడోర్ మెడ్రావ్. ‘‘మార్కులనేవి కేవలం ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు జవాబులు రాయడానికే కాదు, అంతకు మించి ఉండాలి. ఆ విద్యార్థి సంవత్సరం పొడుగునా తన చిరుకోర్కెల్ని పక్కకు నెట్టి, ఇష్టాఇష్టాల్ని చంపుకుని, కాలేజి లైబ్రరీలోనూ, ఇంట్లోనూ అధ్యయనానికి ఎంతో కొంత సమయం వెచ్చించాడు కదా? దాన్ని కాదని అందామా? అనలేం కదా? అందుకే, ఏ విద్యార్థీ జీరో కాదు. మనిషి అయినప్పుడు అతణ్ణి సున్నాగా తీసి పారేయలేం! అతను మనిషి. మనిషిగా మనం గుర్తించాలి. అతనికి మెదడుంది. దానితో పని చేయించాడు. అందువల్ల ఎక్కువో, తక్కువో మార్కులైతే ఇవ్వాలి. బొత్తిగా సున్నాగా పరిగణించలేం!’’-
ఆ రష్యన్ ప్రొఫెసర్ అంత వివరంగా చెపుతూ ఉంటే భారతీయ విద్యార్థికి నోట మాట రాలేదు. నిజమే కదా? – అని అనిపించింది. అతని విలువేమిటో కూడా అతను తెలుసుకున్నాడు – ‘‘ఒక విద్యార్థిని ఒక సబ్జెక్టులో జీరోగ్రేడ్ లో ఉంచామనుకోండి. అతను/ ఆమె పూర్తిగా కుంగిపోతారు. ఆ విషయంలో ఇక తాము కృషి చేసినా మంచి ఫలితాలు సాధించలేమని తీర్మానించుకుంటారు. ఆ సమయాన్ని ఇతర విషయాలపైకి మరల్చుతారు. అంటే – మనమే వారిని ఆ ‘విషయాని’కి దూరం చేస్తున్నట్టు కదా? ఏం రాయకపోయినా రెండు మార్కులు వస్తే- ఇక ఎంతో కొంత రాస్తే మంచి గ్రేడు వచ్చేదన్న ఆశ వారికి కలుగుతుంది. మనిషిలో ఆశ రేకెత్తించడం ముఖ్యం’’- నువ్వు సున్నా, నీకేమీ రాదు. నువ్వు పాపాత్ముడివి. నువ్వు నీచుడివి. నువ్వు బానిసవి – అంటూ సనాతన ధర్మప్రబోధకులు చెప్పేదానికీ ఆధునిక మానవవాదులు చెప్పేదానికీ తేడా గ్రహించాలి.
Also read: చదవడం కాదు, సి.వి. రచనలు జీర్ణించుకోవాలి!
భారతీయ విద్యార్థికీ, రష్యన్ ప్రొఫెసర్ కీ మధ్య జరిగిన సంభాషణ సారాంశాన్ని మన దేశంలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, పరిపాలకులు, ప్రభుత్వాలు అందరీ అందరూ లోతుగా ఆలోచించి, మనస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. రాబోయే కొత్త తరాల్ని ఆరోగ్యకరమైన మానవవాద దృక్కోణం లోంచి ఆలోచింపజేసే బాధ్యతను వీరందరూ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో భారతీయ సమాజం అన్యాయానికి గురైంది చాలు – వందల సంవత్సరాలపాటు సమాజంలో మూడు శాతం ప్రజలకే విద్య అందింది. అక్షరాలు ఉచ్ఛరించిన వారి నాలుకలు మనువాదులు కత్తిరించారు. అందుకే వేల సంవత్సరాలపాటు దేశ ప్రజలకు విద్య అందలేదు. విద్యలేక బానిసల్లా బతికారు. మెదడ్లు వికసించలేదు. ప్రశ్నించడమంటే ఏమిటో కూడా తెలియదు. అణచివేత వల్ల సమాజంలో ద్వేషభావం పెరిగింది. ప్రేమభావనకు ఆస్కారం లేకుండా పోయింది. మనిషిని మనిషిగా ఎదగనివ్వని గడ్డుకాలం అది. ఇక ఇప్పుడు పరిస్థితి మారింది. బాడీ బిల్డింగ్ మాత్రమే కాదు, బ్రెయిన్ బిల్డింగ్ పై ఎక్కువ శ్రద్ద పెట్టాల్సి ఉంది. ఇది జిమ్ లో చేసే వర్కవుట్ కాదు. గ్రంథాలయాల్లో చేసే వర్కవుట్. పుస్తకాలతో చేసే వర్కవుట్ – ముందు ఈ విషయం తెలుసుకుంటే బ్రెయిన్ ని ఎలా ట్రయిన్ చేసుకోవాలన్నది దానంతట అదే తెలుస్తుంది. కొందరుంటారు సమాజాన్ని పట్టించుకోకుండా రచనలు చేసేవారు, ఉపన్యాసాలు చెప్పేవారు, ముఖ్యంగా ప్రవచనాలు చెప్పేవారు. మొదట వారినందరినీ బహిష్కరించాలి. ప్రజలను ఆలోచింపజేసేవారిని, ప్రభావితం చేసేవారిని ఎన్నిక చేస్కోవాలి. మనలో నేర్చుకోవాలనే తపనను రగిలించేవారిని చదవాలి. వినాలి. అనుసరించాలి.
కొందరి ఉపన్యాసాలు వింటుంటే ఎంతో ఉత్సాహభరితంగా, ఉద్వేగభరితంగా ఉంటాయి. ఉదాహరణకు మార్టిన్ లూథర్ కింగ్-జూనియర్ చెప్పిన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి – ‘‘నాకొక స్వప్నం ఉంది – ఈ దేశం స్వేచ్ఛాసమానత్వాల ఆదర్శాలకు నిలయంగా మారుతుందని! నాకొక స్వప్నం ఉంది – బానిసల పిల్లలు, శ్వేతజాతీయుల పిల్లలూ సోదరభావంతో కలిసిమెలసి ఉంటారని! నాకొక స్వప్నం ఉంది – నా నలుగురు పిల్లలు చర్మం రంగుని బట్టి కాకుండా, వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించబడతారని – నాకొక స్వప్నం ఉంది-’’ ఈ మనిషి ఉన్నతాశయం ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి! నిజమే! ఏ మనిషినీ సున్నాగా తీసిపారెయ్యలేం!!
Also read: బుద్ధుడు, విష్ణుమూర్తి అవతారాలలో ఒకడు కాదు!
(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)